
లీజు ఉంటేనే తవ్వకం...
● గడువు ముగిసిన క్వారీలపై నిఘా ● జిల్లాలోని తొమ్మిది చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటు
ఖమ్మంఅర్బన్: జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాల కట్టడికి మైనింగ్ శాఖ అధికారులు గట్టి నిఘా ఏర్పాటుచేశారు. ట్రిప్పర్, ట్రాక్టర్ ఇలా ఎందులో మట్టి తరలించినా అనుమతి పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచిస్తూ మైనింగ్ సహా రెవెన్యూ, పోలీసు శాఖల ఉద్యోగులు సైతం తనిఖీలు చేపడుతున్నారు. కానీ అక్రమ తవ్వకాలకు అలవాటు పడిన కొందరు రాత్రి వేళ దొంగచాటుగా మట్టి తరలించడం ఆపలేదు. దీంతో గతంలో తవ్వకాలకు అనుమతి ఇచ్చి ప్రస్తుతం లీజ్ గడువు ముగిసిన జిల్లాలోని మండలాల్లో క్వారీల వద్ద సీసీ కెమెరాలు అమర్చారు. వీటిని జీపీఎస్ ద్వారా కార్యాలయానికి అనుసంధానించి అనుమతి లేని క్వారీల్లో మట్టి తవ్వకాలు చేపట్టినా, తరలించినా పరిశీలిస్తూ స్థానిక అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఆ వెంటనే తనిఖీలు చేపడుతుండడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని చెబుతున్నారు. జిల్లాలోని రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, ఏన్కూరు, ముదిగొండ మండలాల పరిధిలో గడువు ముగిసిన తొమ్మిది క్వారీల వద్ద సీసీ కెమెరాలు బిగించగా.. మళ్లీ లీజ్ తీసుకుంటే తవ్వకాలకు అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.
నిఘాతో పాటు సైరన్
జిల్లాలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. గడువు ముగిసిన క్వారీల వద్ద సోలార్ ప్యానల్‌తో కూడిన సీసీ కెమెరాలు బిగించి పర్యవేక్షిస్తూనే సైరన్లు కూడా ఏర్పాటుచేశాం. తద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సులువవుతోంది.
– సాయినాథ్, మైనింగ్‌ఏడీ

లీజు ఉంటేనే తవ్వకం...
Comments
Please login to add a commentAdd a comment