చెరువు ఆక్రమణలపై డిజిటల్ సర్వే
నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం చెరువు శిఖం కబ్జా అవుతోందన్న ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. చెరువు శిఖాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు ఖాసిం, ఉపాధ్యక్షులు ధీరావత్ రాధాకృష్ణమూర్తి, బలరాం ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువు విస్తీరణంపై ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ సూచనల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్య శాఖ అధికారులు శుక్రవారం సంయుక్తంగా సర్వే చేపట్టారు. పడవ ద్వారా చెరువులోకి వెళ్లి డిజిటల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఏడీ జి.శివప్రసాద్ మాట్లాడుతూ చెరువు శిఖం ఆక్రమణకు గురైనట్లు తేలినా, చేపల కుంటలు నిర్మించినట్లు గుర్తించినా బాధ్యులకు నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. కాగా, చికెన్ వ్యర్ధాలను చెరువులో వేసే వారిపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఈ నరేష్, సర్వేయర్ మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment