ఉపాధ్యాయులు, అధ్యాపకుల వెంటే ఉంటున్నా..
ఖమ్మం సహకారనగర్/కొత్తగూడెంఅర్బన్: నిరంతరం ఉపాధ్యాయులు, అధ్యాపకుల వెంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నానని వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెంలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 2019లో ఎమ్మెల్సీగా గెలిచాక సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏలు, ఈ–కుబేర్‌లో పెండింగ్ బిల్లుల విడుదల కోసం ధర్నాల్లో సైతం పాల్గొన్నట్లు చెప్పారు. అలాగే, గురుకులాల ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు, కేజీబీవీ ఉపాధ్యాయులకు వేతనం పెంపు, బదిలీలకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా తనకు కేటాయించిన రూ.9 కోట్ల నిధులను అదనపు తరగతి గదుల నిర్మాణానికి కేటాయించానని వెల్లడించారు. ఈ మేరకు 27న జరగనున్న ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, తద్వారా మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లింపు, హెల్త్ కార్డులు, పదోన్నతులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి పాటుపడతానని తెలిపారు. టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ మాట్లాడగా యూటీఎఫ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, ఏవీ నాగేశ్వరరావు, వెంగళరావుతో పాటు జీవీ నాగమల్లేశ్వరరావు, చావా దుర్గాభవాని, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment