ఉత్తర ద్వార దర్శనం తలుపునకు తుది మెరుగులు
భద్రాచలం: ముక్కోటి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా ఈ నెల 22న రాత్రి గోదావరిలో హంసవాహనంపై రామయ్య తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 23న తెల్లవారుజామున ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరపనున్నారు. దీంతో ఈఓ రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
దేవస్థానం, మిథిలా స్టేడియం పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. తెప్పోత్సవం జరిపే హంసవాహనం ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఉత్తర ద్వార దర్శనం వీక్షణకు సెక్టార్ల వారీగా విభజనతోపాటు ప్రధాన ద్వారాల వద్ద తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ఏర్పాట్లపై కలెక్టర్ ప్రియాంక ఆల పలుమార్లు సమీక్షలు జరిపారు. ఎస్పీ వినీత్‌తో కలిసి పర్యవేక్షించి పలు సూచనలు అందజేశారు.
వీఐపీల తాకిడితోనే అసలు సమస్య!
ప్రతి ఏడాది వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీనికి తోడు వీఐపీ సెక్టార్లలో అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించి కిక్కిరిసి ఉండటం, నిలబడి వీక్షించడంతో వెనుక సెక్టార్లలో ఉన్న భక్తులు ఉత్తర ద్వార దర్శనంను వీక్షించే అవకాశం ఉండటం లేదు. ఈ సమస్యను అధికారులు గుర్తించి నివారించాల్సి ఉంది. ఈ ఏడాది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, అందులోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులకు అవకాశం వచ్చింది.
ఈ నేపథ్యంలో వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సైతం హాజరయ్యే అకాశం ఉంది. ఈ క్రమంలో మంత్రుల అనుచరులు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు. దీంతో రద్దీ పెరిగి సెక్టార్లు, అంతరాలయం వద్ద సామాన్య భక్తులు ఇబ్బందులు పడే ఆస్కారం ఉంది. ఈ సమస్యను దేవస్థానం, రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులు గమనించి అధిగమించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment