భద్రాచలంలో వైభవంగా రామయ్య పెళ్లి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సిరిసిల్ల: భద్రాచలంలో సీతారాముల కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు ఆలయ గర్భగుడిలో ఉన్న మూలవిరాట్‌లకు వేదపండితులు లఘు కల్యాణం నిర్వహించి లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో వెలుపలకు తీసుకువచ్చారు. కల్యాణ మండపంలో శ్రీరాముడిని సింహాసనంలో, ఆయనకు ఎదురుగా గజాసనంపై సీతమ్మవారిని కొలువుదీర్చారు. మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు సీతారాముల ఉత్సవమూర్తుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం పెట్టారు.
అనంతరం సీతమ్మ వారికి మాంగల్యధారణ చేసి వెండి పాత్రల్లో ఉంచిన ముత్యాల తలంబ్రాలను సీతారాములపై పోశారు. ఆ తర్వాత తలంబ్రాలతో వేడుక నిర్వహించారు. స్వామివారికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలను, త్రిదండి చినజీయర్ స్వామి మఠం, శృంగేరి పీఠం, శ్రీరంగం, టీటీడీ తరఫున ప్రతినిధులు వ్రస్తాలను సమర్పించారు.
ఈ వేడుకకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ భీమపాక నగేశ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.హæరినాథ్, జస్టిస్ రవినాథ్ తిల్హారి హాజరయ్యారు. గురువారం మిథిలా స్టేడియంలో పట్టాభిõÙక మహోత్సవం జరగనుంది. కల్యాణోత్సవానికి తాను నేసిన బంగారు, వెండి జరీ పోగుల చీరను సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ కానుకగా అందించారు.
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శాస్త్రోక్తం గా ధ్వజారోహణం
22న కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
ఒంటిమిట్ట: వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణబట్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మలనం నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఉత్సవాల్లో ప్రధానంగా ఈ నెల 20న హనుమంత వాహనం, 22న కల్యాణోత్సవం, 23న రథోత్సవం, 25న చక్రస్నానం నిర్వహించనున్నారు.
22న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరుగనుంది. ఈ వేడుక చూసేందుకు భారీగా భక్తులు తరలిరానున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారామ లక్ష్మణులు ఒంటిమిట్ట పురవీధుల్లో శేషవాహనంపై విహరించారు.
Comments
Please login to add a commentAdd a comment