ఇతడి పేరు రాజమౌళి. సిరిసిల్లలోని సుందరయ్యనగర్‌లో పవర్‌లూమ్ కార్మికుడు. భార్య అనసూర్య బీడీ కార్మికురాలు. పది రోజులపాటు ఆసాముల సమ్మెతో రూ.3,500 వరకు వేతనం కోల్పోయాడు. మూడు రోజుల కిందట సమ్మె ముగియడంతో బతుకమ్మ చీరల ఉత్పత్తి మొదలైంది. ఇప్పుడు చీరల ఉత్పత్తి ద్వారా వారానికి రూ.4 వేల వరకు వేతనం పొందనున్నాడు. ఒక్క రాజమౌళే కాదు.. కార్మిక క్షేత్రంలోని సుమారు 20 వేల మంది కార్మికుల జీవన స్థితి ఇది.
సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను అందించాలనే లక్ష్యంతో సిరిసిల్ల నేతన్నలకు తయారీ ఆర్డర్లు అందించింది. గతానికి భిన్నంగా ఇప్పుడు సిరిసిల్ల వస్త్రోత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పాత మరమగ్గాలకు (పవర్‌లూమ్స్) డాబీలను, జకార్డులను అమర్చి ఆధునిక హంగులతో, నేటితరం మహిళలు కోరుకునే డిజైన్లతో బతుకమ్మ చీరలను తయారు చేస్తున్నారు. ఆధునిక హంగులతో.. భూటకొంగుతో, బార్డర్ లైనింగ్‌తో బతుకమ్మ చీరలు తయారవుతున్నాయి. వస్త్ర పరిశ్రమలో 29,680 మరమగ్గాలు ఉండగా.. ఇప్పటికే 14 వేల మగ్గాలపై బతుకమ్మ చీరల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు.
సిరిసిల్ల మరమగ్గాలపై చీరల ఉత్పత్తి
ఐదేళ్లలో ఎంతోమార్పు..
నేతన్నల వస్త్రోత్పత్తి నైపుణ్యాన్ని ఏటేటా జౌళిశాఖ మెరుగు పరుస్తోంది. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చిన తొలిఏడాది 2017లో 52 రంగుల్లో కోటి చీరలను రూ.280 కోట్లతో ఉత్పత్తి చేశారు. 2018, 2019లో 100 రంగుల్లో కోటి చీరలు తయారు చేశారు. 2020లో 225 రకాల బతుకమ్మ చీరలను అందించారు. ఈ ఏడాది భూటకొంగుతో ఉత్పత్తి చేస్తుండగా.. కొత్త డిజైన్లలో లైనింగ్‌తో నవ్యమైన చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. 136 మ్యాక్స్ సంఘాలకు, 138 చిన్న తరహా పరిశ్రమలకు, టెక్స్‌టైల్ పార్క్‌లోని 70 యూనిట్లకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో 20 వేల మంది సిరిసిల్ల నేతన్నలకు ఆరు నెలలపాటు చేతినిండా పని లభిస్తుంది. కార్మికులకు మెరుగైన వేతనాలు అందనున్నాయి.
ఇక్కడ చదవండి:
కరోనా ఎఫెక్ట్; మళ్లీ పెరుగుతున్న నిరుద్యోగం!
Comments
Please login to add a commentAdd a comment