Bathukamma Sarees
-
బతుకమ్మ కానుకలకు స్వస్తి..?
చుంచుపల్లి: బతుకమ్మ పండుగకు మహిళలకు అందించే చీరలకు ప్రభుత్వం ఈసారి స్వస్తి పలికినట్లేనని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది అక్టోబర్‌లో పంపిణీ చేస్తుండగా, రెండు నెలల ముందు నుంచే లబ్ధిదారుల సంఖ్య, చీరల కొనుగోలు ప్రక్రియపై కసరత్తు జరిగేది. కానీ ఈసారి బతుకమ్మ చీరలకు సంబంధించి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. చీరల స్థానంలో ప్రత్యామ్నాయంగా నగదు లేదా ఇంకేమైనా బహుమతులు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 నుంచి బతుకమ్మ కానుకగా చీరలను అందించింది. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాలవారికి చీరలు పంపిణీ చేసింది. సిరిసిల్ల, షాద్‌నగర్, నారాయణపేట్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో తయారైన చేనేత చీరలను కొనుగోలు చేసి అందించింది. జిల్లాలో 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలోని 3,66,088 మంది మహిళలకు రేషన్ షాపులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ద్వారా ఈ బతుకమ్మ కానుకలు నేరుగా అందించేవారు. అయితే ఈ బతుకమ్మ చీరలు నాణ్యమైనవి కాదని, కొనుగోలు ప్రక్రియలో అవినీతి జరిగిందని గతంలో కాంగ్రెస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి నాణ్యతలేని చీరలను పంపిణీ చేసి అభాసుపాలు కాకుండా చీరలకు బదులు వేరే బహుమతులు ఇవ్వాలనే భావనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
బతుకమ్మ చీరల పంపిణీలో లొల్లి!
మంచిర్యాల: మండల కేంద్రంలో బుధవారం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే దివాకర్‌రావు సాక్షిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు నాణ్యతగా ఉంటే బాగుంటుంది, ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాన్నారు. అక్కడే ఉన్న పలువురు బీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుంటూ గత ఏడాది ఎంపీపీగా ఉన్నప్పుడు ఏం మాట్లాడావు. ఇప్పుడు పార్టీ మారి ఇలా మాట్లాడుతున్నావ్, చీరలకు ఏమైందని ప్రశ్నించారు. దీంతో ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు ఇరుపార్టీల వారిని తోసివేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, జెడ్పీటీసీ నాగరాణి, వైస్‌ఎంపీపీ అనిల్, రైతుసమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్ లింగన్న, ఎంపీటీసీలు శ్రీనివాస్, మోహన్, ఉపసర్పంచ్ భూమన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సత్యం, వివిధ గ్రామాల బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్ డ్రైన్ పనులకు భూమిపూజ.. దండేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు పక్కన రూ.47.1 లక్షల ఆర్అండ్బీ నిధులతో 600 మీటర్ల పొడవుతో చేపట్టే సైడ్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే దివాకర్‌రావు భూమి పూజ చేశారు. ఇక్కడ కూడా ఎంపీపీ శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ కృష్ణ, ఎస్సైలు ప్రసాద్, లక్ష్మణ్‌లు ఇరుపార్టీల వారికి నచ్చజెప్పి పంపించారు. ఈ కార్యక్రమాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘పాప పరిహారం కోసమే బతుకమ్మ చీరల పంపిణీ’
బెల్లంపల్లి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాను చేసిన పాపాలను పరిహరించుకునేందుకే రాష్ట్రంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం యాత్ర సాగించారు. స్థానిక కాంటా చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి.. హామీలకే పరిమితం అయ్యాయన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోని సీఎం కేసీఆర్‌ను ఏమనాలని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే సింగరేణిలో భూగర్భ గనులు తప్ప ఓపెన్ కాస్టు ప్రాజెక్టులు ఉండవని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు. 2014కు ముందు సింగరేణి వ్యాప్తంగా 40 భూగర్భ గనులు, 8 ఓపెన్‌కాస్టులు ఉండగా, రాష్ట్రం ఏర్పడ్డాక భూగర్భ గనుల సంఖ్య 20కి పడిపోయిందని, ఓపెన్‌కాస్టుల సంఖ్య 19కి పెరిగిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఓసీలు తెరిచి కార్మికుల సంఖ్య తగ్గిస్తోందని విమర్శించారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలు ఇస్తామని ఏడేళ్ల క్రితం చెప్పిన కేసీఆర్.. ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును కట్టి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఆ ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టికూడా తీయలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూపకల్పన చేసిన ప్రాణహిత ప్రాజెక్టును లేకుండా చేసి, రైతాంగాన్ని కేసీఆర్ వంచించారని ఆరోపించారు. -
Photo Feature: బతుకమ్మ చీరలను మూటలు కట్టేందుకు వాడుతున్న మహిళలు
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను లబ్ధిదారులు వివిధ పనుల కోసం వినియోగిస్తున్నారు. కొంతమంది పంట పొలాల్లోకి అడవి పందులు రాకుండా చేల చుట్టూ కడుతుండగా.. మరికొందరు మూటలు కట్టేందుకు వాడుతున్నారు. శనివారం ధారూరు సంతకు వచ్చిన ఓ మహిళా రైతు బతుకమ్మ చీరల్లో ఆకు కూరలు మూట కట్టి తీసుకువచ్చింది. ఇదేమని ప్రశ్నించగా.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాలిస్టర్ చీరలు కట్టుకునేలా లేవని, మూడేళ్లుగా వీటిని పొలం వద్ద బెదుర్లు పెట్టేందుకే వినియోగిస్తున్నామని తెలిపారు. – ధారూరు (వికారాబాద్) -
పంట చేలకు పరదాలుగా బతుకమ్మ చీరలు
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను రైతులు పంటల చుట్టూ పరదాలుగా కడుతున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఓ రైతు గ్రామంలో ఒక్కో బతుకమ్మ చీరను రూ.50 చొప్పున కొని పంటలకు అడవిపందుల నుంచి రక్షణకు పొలం చుట్టూ కట్టాడు. బషీరాబాద్ మండలానికి 11,316 చీరలు వస్తే రేషన్ డీలర్ల దగ్గర ఇప్పటి వరకు 20 శాతం మహిళలే తీసుకువెళ్లారు. దీంతో డీలర్ల దగ్గర చీరలు కుప్పలుగా మిగిలి పోయాయి. -
Telangana: కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ చీరలను రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ చీరల పంపిణీ జరిగేలా చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు కోటి చీరల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించుకున్న రాష్ట్రప్రభుత్వం ఈ చీరల తయారీకి రూ.339.73 కోట్లు వెచ్చించింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 24 విభిన్న డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల జరీ అంచులతో (త్రెడ్ బోర్డర్) తెలంగాణ టెక్స్టైల్ విభాగం ఈ చీరలను తయారు చేయించింది. గ్రామీణ ప్రాంతాల మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, ఆసక్తిని పరిగణనలోకి తీసుకొని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సహకారంతో డిజైన్లను రూపొందించారు. అత్యుత్తమ ప్రమాణాలతో చీరలను ఉత్పత్తి చేశారు. రెండు విభిన్న పొడవుల్లో చీరలను తయారు చేయించగా, ఇందులో ఆరు మీటర్ల చీరలు 92 లక్షలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవైన చీరలు ఎనిమిది లక్షలు తయారు చేయించినట్లు చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం వెల్లడించింది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగి, 18 ఏళ్లు పైబడిన మహిళలకు అందజేయనున్నారు. బతుకమ్మ చీరలతో నేతన్నల జీవితాల్లో వెలుగు: కేటీఆర్ తెలంగాణ ఆడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక ఇచ్చేందుకు 2017లో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించినట్లు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. గురువారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీతో భరోసా వచ్చిందన్నారు. నేతన్నల వేతనాలు రెట్టింపు కావడంతో పాటు కార్మికులు తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితికి చేరుకున్నారని తెలిపారు. నేత కార్మికులు ఏడాది పొడవునా ఉపాధి పొందేందుకు ఈ పథకం దోహదం చేసిందన్నారు. సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న నేత కార్మికులను ఆదుకునేందుకు సొంత రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ వంటి విధానాలతో వారి ఉపాధిని క్లిష్టతరం చేస్తోందన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు 5.81 కోట్ల చీరలను పంపిణీ చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇదీ చదవండి: టెర్రర్ ఫండింగ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు -
30 రంగులు.. 240 డిజైన్లు.. కోటీ 18 లక్షల బతుకమ్మ చీరలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పంపిణీ చేసేందుకు కోటికి పైగా చీరలు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ అవతరణ తర్వాత ప్రభుత్వమే మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలను తీరొక్క రంగుల్లో సిద్ధం చేసి ఉంచినట్లు రాష్ట్ర చేనేత శాఖ తెలిపింది. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో నేయించిన చీరలను రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మహిళలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, చీరల కోసం ఈ ఏడాది రూ.340 కోట్లను వెచ్చించినట్లు తెలంగాణ హ్యాండ్లూమ్ శాఖ తెలిపింది. 30 రంగుల్లో, 240 పైచిలుకు వెరైటీ డిజైన్లతో పాటు 800 కలర్ కాంబినేషన్లతో తయారు చేయించి పంపిణీకి సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు వెండి, బంగారు, జరీ అంచులతో చేయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఒక కోటీ 18 లక్షల చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఇదీ చదవండి: దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేతకే నా సపోర్ట్: మాజీ సీఎం కుమారస్వామి -
ముందస్తుగా బతుకమ్మ చీరల ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు ఈ యేడు ముందుగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు వచ్చాయి. తొలివిడతగా రూ.140.80 కోట్ల విలువైన 4.40 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లను సోమవారం టెస్కో అధికారులు సిరిసిల్ల నేతన్నలకు అందించారు. ఈమేరకు సిరిసిల్లలోని మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీలు(మ్యాక్స్), చిన్న తరహా యూనిట్ల(ఎస్ఎస్ఐ) యజమానులకు ఆర్డర్లు సిద్ధమయ్యాయి. ఈసారి బతుకమ్మ పండుగకు చీర, జాకెట్(పీస్)లను వేర్వేరుగా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. చీరకు బ్లాక్ రోటోవార్ప్తో డిజైన్ చేయగా.. జాకెట్‌ను మాత్రం వేరుగా డిజైన్ చేశారు. గతంలో మీటరు బతుకమ్మ చీరల బట్టకు రూ.33 ఇవ్వగా.. ఈ ఏడాది రూ.32 ఇవ్వాలని టెస్కో అధికారులు నిర్ణయించారు. బ్లాక్ రోటోవార్ప్తో 2020 నాటి డిజైన్‌ను ఈ ఏడాది మరోసారి అమలు చేయాలని భావిస్తున్నారు. ఫలితంగా ప్రతీ మీటరుకు ఒక్క రూపాయి ధర తగ్గించారు. చీరల్లో 240 రకాల డిజైన్లను రూపొందించి అందులోనే మార్పులు చేశారు. కాగా, బతుకమ్మ చీరల బట్ట ధరను ఒక్క రూపాయి తగ్గించడంపై నేతన్నల్లో నిరాశ నెలకొంది. గతేడాది మీటరు బట్టకు రూ.33 ఇవ్వగా.. ఈ ఏడాది రూ.32 నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
బతుకమ్మ చీరల పంపిణీ ఫోటోలు
-
బతుకమ్మ చీరల పంపిణీ బాధ్యత కలెక్టర్లకు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరలు పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి చీరలు పంపిణీ చేయాలా లేక కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామ, వార్డు కేంద్రాల్లో పంపిణీ చేయాలా అనే నిర్ణయాన్ని కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు టెస్కో ఎండీ శైలజా రామయ్యర్ వెల్లడించారు. బతుకమ్మ చీరలు ఇప్పటికే జిల్లాల్లోని గోదాములకు సరఫరా కాగా, అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ/ వార్డు కమిటీ ద్వారా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి, గ్రామ మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలర్ సభ్యులుగా ఉండే కమిటీ పర్యవేక్షణలో చీరల పంపిణీ జరుగుతుంది. మున్సిపల్ వార్డు స్థాయిలో బిల్ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలరు సభ్యులుగా ఉండే కమిటీ చీరలు పంపిణీ చేస్తుంది. -
Sircilla: సాంచాల సవ్వడి షురూ..
ఇతడి పేరు రాజమౌళి. సిరిసిల్లలోని సుందరయ్యనగర్‌లో పవర్లూమ్ కార్మికుడు. భార్య అనసూర్య బీడీ కార్మికురాలు. పది రోజులపాటు ఆసాముల సమ్మెతో రూ.3,500 వరకు వేతనం కోల్పోయాడు. మూడు రోజుల కిందట సమ్మె ముగియడంతో బతుకమ్మ చీరల ఉత్పత్తి మొదలైంది. ఇప్పుడు చీరల ఉత్పత్తి ద్వారా వారానికి రూ.4 వేల వరకు వేతనం పొందనున్నాడు. ఒక్క రాజమౌళే కాదు.. కార్మిక క్షేత్రంలోని సుమారు 20 వేల మంది కార్మికుల జీవన స్థితి ఇది. సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను అందించాలనే లక్ష్యంతో సిరిసిల్ల నేతన్నలకు తయారీ ఆర్డర్లు అందించింది. గతానికి భిన్నంగా ఇప్పుడు సిరిసిల్ల వస్త్రోత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పాత మరమగ్గాలకు (పవర్‌లూమ్స్) డాబీలను, జకార్డులను అమర్చి ఆధునిక హంగులతో, నేటితరం మహిళలు కోరుకునే డిజైన్లతో బతుకమ్మ చీరలను తయారు చేస్తున్నారు. ఆధునిక హంగులతో.. భూటకొంగుతో, బార్డర్ లైనింగ్‌తో బతుకమ్మ చీరలు తయారవుతున్నాయి. వస్త్ర పరిశ్రమలో 29,680 మరమగ్గాలు ఉండగా.. ఇప్పటికే 14 వేల మగ్గాలపై బతుకమ్మ చీరల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల మరమగ్గాలపై చీరల ఉత్పత్తి ఐదేళ్లలో ఎంతోమార్పు.. నేతన్నల వస్త్రోత్పత్తి నైపుణ్యాన్ని ఏటేటా జౌళిశాఖ మెరుగు పరుస్తోంది. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చిన తొలిఏడాది 2017లో 52 రంగుల్లో కోటి చీరలను రూ.280 కోట్లతో ఉత్పత్తి చేశారు. 2018, 2019లో 100 రంగుల్లో కోటి చీరలు తయారు చేశారు. 2020లో 225 రకాల బతుకమ్మ చీరలను అందించారు. ఈ ఏడాది భూటకొంగుతో ఉత్పత్తి చేస్తుండగా.. కొత్త డిజైన్లలో లైనింగ్‌తో నవ్యమైన చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. 136 మ్యాక్స్ సంఘాలకు, 138 చిన్న తరహా పరిశ్రమలకు, టెక్స్టైల్ పార్క్‌లోని 70 యూనిట్లకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో 20 వేల మంది సిరిసిల్ల నేతన్నలకు ఆరు నెలలపాటు చేతినిండా పని లభిస్తుంది. కార్మికులకు మెరుగైన వేతనాలు అందనున్నాయి. ఇక్కడ చదవండి: కరోనా ఎఫెక్ట్; మళ్లీ పెరుగుతున్న నిరుద్యోగం! ఢిల్లీ బస్సు వచ్చింది.. వంద కోట్లు మింగింది! -
తోటకు కంచెగా బతుకమ్మ చీరలు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలు ఓ గ్రామంలో తోటకు కంచెగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గండిలచ్చపేట గ్రామంలో ఓ వ్యక్తి తమ ఇంటి వద్ద తోటను పశువులు పాడుచేయకుండా ఉండడానికి బతుకమ్మ చీరలను కంచెగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించగా, గత ఏడాది వచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకోకుండా అలాగే ఉంచి ఇలా ఉపయోగించినట్లు తెలిపాడు. కాగా నేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘బతుకమ్మ చీరలు’పంపిణీ కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల 17న మొదలయ్యే బతుకమ్మ పండుగను దృష్టిలో చీరల పంపిణీని చేస్తున్నారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశారు. జిల్లాలలో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. -
బతుకమ్మ చీరలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : నేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘బతుకమ్మ చీరలు’పంపిణీ కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ నెల 17న మొదలయ్యే బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని ఆలోపే చీరల పంపిణీని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశారు. క్షేత్రస్థాయిలో చీరల పం పిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించగా, గ్రామ కార్యదర్శులు, రేషన్‌షాప్ డీలర్లు, సెర్ప్, మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో లబ్ధిదారులకు అందజేస్తారు. పంపిణీలో కోవిడ్ నిబంధనలు పాటించాలని కలెక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 287 డిజైన్లతో చీరలు బతుకమ్మ చీరలను ఆకర్షణీయమైన రంగుల్లో బంగారు, వెండి జరీ అంచులతో, 287 డిజై న్లతో 100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలు తో తయారు చేశారు. సాధారణ చీరలను 6.30 మీటర్లు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని వయోవృద్ధులైన మహిళల కోసం 9 మీటర్ల పొడవైన చీరలను తయారు చేశారు. బతుక మ్మ చీరలకు బహుళ ఆదరణ లభిస్తుండటం తో వీటికి బ్రాండింగ్ ఇవ్వాలని ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని టెస్కో విక్రయ కేంద్రాల్లోనూ వీటిని విక్రయించాలని నిర్ణయించారు. బతుకమ్మ చీరల స్టాక్ ను జిల్లాలకు చేరవేశామని, పంపిణీ సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరి ‘సాక్షి’కి తెలిపారు. డిమాండ్‌ను తట్టుకునేందుకు టెస్కో వద్ద 1.50 లక్షల చీరల బఫర్ స్టాక్ ఉందన్నారు. మరమగ్గాల కార్మికులకు ఉపాధి సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్‌లో 26 వేలకుపైగా మరమగ్గాలపై పనిచేస్తున్న సుమారు 15 వేల మంది కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ ద్వారా ఉపాధి లభించింది. గతంలో నెలకు రూ.8వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం పొందిన కార్మికులు ప్రస్తుతం రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఆర్జిస్తున్నారు. బతుకమ్మ చీరలను డిజైన్లలో తయారు చేసేందుకు మరమగ్గాల యజమానులు మూడు వేలకుపైగా డాబీలు కొనుగోలు చేసి ఆధునికీకరణ సాధించారు. స్కూల్ యూనిఫారాలు, అంగన్వాడీ, ఐసీడీసీ సిబ్బందికి అందచేసే చీరలు, కేసీఆర్ కిట్ చీరలు కూడా మరమగ్గాలపైనే తయారు చేస్తున్నారు. సంవత్సరం లబ్ధిదారులు ఖర్చు (రూ.కోట్లలో) 2017 95,48,439 222 2018 96,70,474 280 2019 96,57,813 313 2020 కోటి మంది 317.81 -
మాకెందుకియ్యరు? చీరలు..
సాక్షి, పరిగి: బతుకమ్మ చీరల కొరత అధికారులు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. చీరల పంపిణీలో ప్రభుత్వం ఈసారి పొదుపు మంత్రాన్ని పాటించింది. దీంతో చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబంలోని 18 ఏళ్లు నిండిన మహిళలకు చీర అందజేస్తామని సర్కారు ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాకు 3.11 లక్షల చీరలు అవసరమని అధికారులు నివేదిక ఇచ్చారు. కానీ 2.11 లక్షల చీరలు మాత్రమే గోదాంలకు చేరాయి. వీటిని ఆయా గ్రామాలకు పంపిణీ చేసి.. లబ్ధిదారులకు అందజేస్తున్నారు. సర్పంచుల తంటాలు.. జిల్లాకు రావాల్సిన చీరల్లో 30 శాతం తక్కువగా పంపిణీ చేశారు. ఈ గణాంకాల ఆధారంగానే మండలాలు, గ్రామాలకు 70శాతం చీరలు అందజేశారు. 300 చీరలు ఇవ్వాల్సిన గ్రామానికి 200, 3 వేల చీరలు ఇవ్వాల్సిన పంచాయతీకి 2వేల చీరలు ఇచ్చారు. మిగతావి త్వరలో వస్తాయని అధికారులు చెప్పారు. ఈ హామీతో ఆర్భాటంగా పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించిన సర్పంచ్‌లు, రేషన్ డీలర్లు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు చీరలు అందనివారికి సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతున్నారు. కొందరికి ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోవటంపై పేద మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈవిషయమై సర్పంచ్ల వద్ద పేచీ పెడుతున్నారు. గ్రామాల్లో మెజార్టీ సర్పంచ్‌లు అధికార పార్టీకి చెందిన వారే కావడంతో దీనిపై నోరు మెదపడం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కో గ్రామంలో 50పైగా ఆహార భద్రత కార్డులు రద్దయ్యాయి. వీరికి సంబంధించి చీరలు రాలేదు. ప్రస్తుతం ఇది కూడా ఓ సమస్యగా మారింది. మిగతావి వస్తాయా...రావా..? గ్రామాలకు 30 శాతం చీరలు తక్కువగా రావడంతో మిగతా చీరలు వస్తాయా..? రావా..? అని మహిళల్లో అయోమయం నెలకొంది. ఒక వేళ వచ్చినా.. పండగ లోపు వస్తాయా.. పండగయ్యాక వస్తాయా.. తెలియక పంపిణీ బాధ్యతలు తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు దిక్కుతోచకున్నారు. తమను నిలదీస్తున్న లబ్ధిదారులకు ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్నారు. కొరతను దృష్టిలో పెట్టుకుని మూడు చీరలు ఇవ్వాల్సిన ఇంటికి రెండు చీరలు ఇస్తున్నారు. మిగతాది స్టాక్ వచ్చాక ఇస్తామని సర్ది చెబుతున్నారు. ఒకేసారి ఇవ్వాల్సింది ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన చీరల్లో కోత పెట్టడం సర్పంచులు, డీలర్లకు తలనొప్పిగా మారింది. ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా చీరలన్నీ ఒకేసారి ఇస్తే బాగుండేది. కొందరికి ఇచ్చి.. మరికొందరికి ఇవ్వకపోవడంతో మమ్మల్ని తప్పుబడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మిగిలిన చీరలు పంపిణీ చేస్తే అందరికీ అందజేస్తాం. – నర్సింహ, సర్పంచ్, రూప్‌ఖాన్‌పేట్ రెండు రోజుల్లో వస్తాయి మండలానికి ఇవ్వాల్సిన చీరల్లో 30శాతం తక్కువగా వచ్చాయి. ఈ లెక్కన గ్రామాల వారీగా 30 శాతం తగ్గించి చీరలు పంపిణీ చేశాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు రోజుల్లో మిగతా చీరలు కూడా వస్తాయి. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం. సమస్యను ఉన్నతాధికారులకు వివరించి పండుగలోపే చీరలు వచ్చేలా చూస్తాం. – అనురాధ, తహసీల్దార్ -
బతుకమ్మ చీరలు మాకొద్దు
సాక్షి, మునిపల్లి(అందోల్): బతుకమ్మ చీరలు మా కొద్దు అంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా చౌర స్తాలో కాలనీవాసులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రేషన్ డీలర్‌ను బుదేరా చౌరస్తాకు సపరేట్గా ఏర్పాటు చేయాలని నాలుగు నెలలుగా అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు అధికారుల తీరుపై మండిపడ్డారు. రేషన్ డీలర్ షాపును ఏర్పాటు చేసేంతవరకు బతుకమ్మ చీరలు, చెత్త బుట్టలు, వివిధ రకాల మొక్కలను కూడా తీసుకోబోమని నినాదాలు చేశారు. దీంతో తహసీల్దార్ సువర్ణ రాజుకు అక్కడికి చేరుకుని నిరసన కారులతో మాట్లాడి రేషన్ డీలర్‌ను బుదేరా చౌరస్తాకు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమం విరమించారు. అనంతరం మహిళలు బతుకమ్మ చీరలు, చెత్త బుట్టలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. -
ఏంది ఈ రోడ్డు ? ఎలా వెళ్లేది !
సాక్షి, భీమ్‌గల్(నిజామాబాద్) : మండలంలోని సంతోష్‌నగర్ తండాలో నీటి లీకేజీ కారణంగా ప్రధాన రహదారి దెబ్బ తినడంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్‌గల్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన కలెక్టర్ రామ్మోహన్‌రావుతో కలిసి కారులో బయల్దేరారు. అయితే, తండా వద్దకు రాగానే రోడ్డంతా దెబ్బతిని బురదమయం కావడాన్ని గమనించిన మంత్రి.. వాహనాన్ని ఆపి కిందికి దిగారు. రోడ్డు ఇలా కావడంపై సర్పంచ్ ఎంజీ నాయక్‌ను ప్రశ్నించారు. పక్కనే ఉన్న భగీరథ పైపులైన్ లీకేజీ కారణంగా నీరు రోడ్డుపై ప్రవహించి బురదమయంగా మరుతోందని సర్పంచ్ తెలిపారు. దీంతో ఆయన అక్కడి నుంచే ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి వెంటనే రోడ్డును సరిచేయాలని ఆదేశించారు. -
ఆడపడుచులకు బతుకమ్మ కానుక
సాక్షి, పాలమూరు: ఆడపడుచులంతా కొత్త దుస్తులు ధరించి బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని న్యూ గంజ్, బండ్లగేరి, పాత పాలమూరు వార్డుల్లో మంగళవారం మహిళలకు బతుకమ్మ చీరలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేద మహిళ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక అన్నారు. ఇందుకనుగుణంగా గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా మహిళలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు. అలాగే పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016కు, వికలాంగుల పింఛన్ రూ.1,500 నుంచి రూ.3,016లకు పెంచామన్నారు. తాగునీరు, సాగునీరు సమస్యలను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి రైతులకు లబ్ధిచేకూర్చడంతోపాటు పంటల సాగులో ఇబ్బందులు తొలిగాయన్నారు. పేదపిల్లల వివాహం కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్ప త్రుల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయని, పుట్టిన బిడ్డకు అవసరమయ్యే వస్తువుతో కేసీఆర్ కిట్టు అందిస్తున్నామన్నారు. వీటిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్, మహబూబ్‌నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 16,678 మందికి చీరల పంపిణీ పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లాలో గత రెండు రోజుల నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ఇంకా జిల్లాలో ఏడు మండల కేంద్రాలు, ఆయా మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేయాల్సి ఉంది. సోమవారం 6,857 చీరలు పంపిణీ చేయగా.. మంగళవారం 9,821 చీరలు అందించారు. రెండు రోజుల్లో కలిపి జిల్లాలో 16,678 మంది మహిళ లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు. రాజాపూర్, దేవరకద్ర, చిన్నచింతకుంట, మూసాపేట, హన్వాడ, నవాబుపేట, కోయిలకొండ మండలాల్లో బుధవారం నుంచి ప్రారంభం చేయనున్నారు. బాలానగర్ మండలంలో 220, జడ్చర్లలో 6,378, భూత్పూర్లో 1,150, గండీడ్‌లో 30, మహబూబ్‌నగర్ అర్బన్ పరిధిలో 5,498, మహబూబ్‌నగర్ రూరల్‌లో 110, మిడ్జిల్‌లో 2,607, అడ్డాకుల మండలంలో 685 మందికి చీరలను అందజేశారు. జిల్లాలో మొత్తం 2.98 లక్షల చీరలను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెల 28 వరకు జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగనుంది. -
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సాక్షి, మెదక్: జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. వృద్ధులకు, వితంతవులకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ప్రశంసించారు. అంగన్వాడీల ద్వారా మాత, శిశువులకు పోషక ఆహారాన్ని ఇస్తున్నామని తెలిపారు. రేపటి భావిభారత పౌరుల నిర్మాణానికి పోషకాహారం విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. సంగారెడ్డి: ఆందోల్, జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌లు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం జోగిపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆందోల్ మండలానికి చెందిన 100 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. -
ఆడపడుచులకు పెద్దన్న కేసీఆర్
సాక్షి, మహేశ్వరం: తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్నగామారి దసరా పండుగకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చి గౌరవిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం పోతర్ల బాబయ్య ఫంక్షన్హాల్లో ఆమె జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ హరీష్‌తో కలిసి ప్రభుత్వం అందజేసిన చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. దసరా పండుగను ఆనందంగా జరుపుకోవడానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచు కు బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు తీరోక్క పూలతో మహిళలు బతుకమ్మను పేర్చి ఆడిపాడుతారని తెలియజేశారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోటి 3 లక్షల బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుందన్నారు. జిల్లాలో 6,65, 686 చీరలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో చేనేత కార్మికులకు అన్నివిధాలుగా ప్రోత్సహించి, వారికి ఉపాధి ఆవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరలను తయారు చేయించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై అభివృద్ధికి సహకరించాలని కోరారు. మహిళా సంక్షేమం కోసం కృషి సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి కోసం చొరవ చూపలేదని విమర్శించారు. మహిళలందరికీ దసరా కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 100 రకాలు, పది రంగుల చీరలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని ఇన్ చార్జి కలెక్టర్ హరిష్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలిపారు. తెలంగాణలో మహిళలు వైభవంగా నిర్వహించే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ప్రభుత్వం 100 రకాలు, 10 రంగుల్లో బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు వివరించారు. రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేస్తామన్నారు. అంతకు ముందు అతిథలు జ్యోతి ప్రజ్వళన చేసి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలతో కలిసి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం మహేశ్వరం మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా మంత్రి, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు మొక్కను నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ప్రశాంత్‌కుమార్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితానాయక్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య యాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు కూన యాదయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, మహిళా సమాఖ్య ఏపీఎం సత్యనారాయణ, మహేశ్వరం సర్పంచ్ ప్రియంక ఉన్నారు. బాగా చదువుకుంటున్నారా..? మహేశ్వరం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నాగుల్దోని తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతకు ముందు ఆమె టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులకు గణితం బోధించారు. వారితో ఎక్కాలు చెప్పించారు. బాగా చదువుకుంటున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు. పాఠ్యంశాల్లోని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. విద్యాశాఖ మంత్రి అయిన సబితారెడ్డి టీచర్ అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని సర్పంచ్‌కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతానాయక్, ఎంపీడీఓ నర్సింహ, ఎంఈఓ కృష్ణ, సర్పంచ్ మెగావత్ రాజు నాయక్, ఉప సర్పంచ్ జగన్ ఉన్నారు. -
పథకాల అమల్లో రాజీ లేదు
సాక్షి, సిద్దిపేట: కరువు కాటకాలు వచ్చినా.. రాష్ట్రంలో ఆర్థిక మాధ్యం ఏర్పడినా, కేంద్రం రాష్ట్రానికి అందించాల్సిన నిధలకు కోతపెట్టినా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపే ప్రసక్తే లేదని, వీటి అమలులో రాజీపడమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట పట్టణాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అలాగే ఉమ్రాకు వెళ్లే 40 మంది ఇమామ్, మౌజమ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణ జీవన చిత్రానికి నిదర్శనం బతుకమ్మ పండుగ అన్నారు. ఈ పండగ సందర్భంగా ఎంతటి పేదవారైనా తమ ఆడపడుచులకు కొత్త చీరె కొని ఇస్తారని, కొత్త చీరెకట్టుకొని బతుకమ్మను పట్టుకొని వెళ్లే ఆడపడుచులు మురిసి పోతారని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న బతుకమ్మ పండుగకు కొత్త చీరెలను పంపిణీ చేసి, ఆడపడుచులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా మారారని హరీశ్ అన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నేతన్నల బతుకు మార్చేందుకు బతుకమ్మ చీరెల తయారీ బాధ్యత వారికి అప్పగించామన్నారు. విపక్షాల విమర్శలు శోచనీయం రాష్ట్రంలో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుంటే అభినందించాల్సిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం శోచనీయమని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణలో మసీదుల నిర్వాహణ కష్టంగా మారిన రోజుల్లో నేను అండగా ఉంటానని కేసీఆర్ భరోసా కల్పించారని చెప్పారు. దీనిలో భాగంగానే మౌజమ్, ఇమామ్‌ల భృతిని రూ. 5వేలకు పెంచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి మగ్గానికి అండగా ఉంటాం : కేటీఆర్
సాక్షి, నల్లగొండ : చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. సోమవారం ఆయన నల్గొండ వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో చేనేతకు చేయూత ఇచ్చేందుకు కోటి చీరల పంపిణీ జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ తోబుట్టువుగా, పెద్దన్నగా చంద్రుడికో నూలుపోగు అన్నట్లు చిరుకానుకగా చీరలను అందిస్తున్నామని చెప్పారు. కోటి చీరలను నాణ్యతతో నేసి ఆడబిడ్డలకు అందిస్తున్న నేతన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మగ్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. (చదవండి : తీరొక్క కోక.. అందుకోండిక!) ‘బతుకమ్మలాంటి పండుగకు తెలంగాణలోని కోటి మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ తోబుట్టువుగా, పెద్దన్నగా చంద్రుడికో నూలుపోగు అన్నట్లు చిరుకానుకగా చీరలను అందిస్తున్నాం. నచ్చిన చీరలు తేవడం భర్త వల్ల కానే కాదు. కానీ ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేతన్నలు చాలా చక్కని చీరలు తయారు చేశారు. పెద్ద మొత్తంలో చీరల పంపిణీ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 2001, 2002 సంవత్సరాల సమయంలో పోచంపల్లిలో ఏడు మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. నాటి ఉద్యమనాయకుడు, నేటీ సీఎం కేసీఆర్.. వారికి సహాయం చేయ్యండి.. బతుకు మీద భరోసా కల్పించాలని అడిగితే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. స్వయనా కేసీఆరే జోలెపట్టుకుని డబ్బులు అడిగి.. ఏడు కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున సహాయం చేశారు’ అని గుర్తుచేశారు. నేతన్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేత కార్మికులకు చేనేత మిత్ర పేరుతో 50శాతం సబ్సిడీ, నేతన్నకు చేయూత పేరుతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రతి సోమవారం అధికారులతో చేనేత దుస్తులు ధరించేలా నిర్ణయం తీసుకుని ఆచరిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలు ధరించాలని, తద్వారా నేతన్నలకు జీవనోపాధి కల్పించిన వాళ్లం అవుతాం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటుకు రూ.35 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నల్లగొండ జిల్లా మీద ఎనలేని ప్రేమ ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ చొరవతోనే నల్లగొండలో ఒక మెడికల్ కాలేజ్, సూర్యాపేటలో ఒక మెడికల్ కాలేజ్, భువనగిరిలో ఏయిమ్స్ మంజూరయ్యాయని చెప్పారు. దండు మల్కాపురంలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు అవుతుందన్నారు. మిర్యాలగూడ దామరచర్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఉదయ సముద్రంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు 35 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అందరూ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. బతుకమ్మ చీరలు.. ఆడబిడ్డలకు కేసీఆర్ ఇచ్చిన కానుక : జగదీశ్ రెడ్డి ఎరరూ అడక్కపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందించి గౌరవిస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోసం చీరల పంపిణీ జరగడం లేదన్నారు. చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు, కార్మికులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బూతాన్ని తరిమి కొట్టేందుకు కేసీఆర్ తీసుకున్న చొరవే మిషన్ భగీరథ రూపకల్పన అని మంత్రి జగదీశ్ అన్నారు. -
నేటి నుంచి బతుకమ్మ కానుకలు
సాక్షి, మహేశ్వరం: మహిళలకు సోమవారం నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. 28న వేడుకలు ప్రారంభం కానుండడంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేసేందుకు నిర్ణయించింది. ఈమేరకు గ్రామాల వారీగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన 6,65,686 మంది మహిళలను గుర్తించగా ఇప్పటికే 3,58,600 చీరలు జిల్లాకు చేరాయి. మొయినాబాద్ గోదాంలో 1,62,000, కందుకూరు మండలం కొత్తురులో 1,96,600 నిల్వ చేశారు. ఇంకా అవసరమైన 3,07,086 చీరలు త్వరలో వస్తాయని అధికారులు పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. రంగురంగలు చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, మహిళా సంఘాలు, రేష¯Œ డీలర్లు, బిల్ కలెక్టర్లు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలకు ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడేళ్లగా సర్కారు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మండలాల వారీగా పంపిణీ చేసేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. చీరల పంపిణీ ఇలా.. సోమవారం నుంచి 27వరకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొయినాబాద్ గోదాం నుంచి చేవెళ్ల, చౌదరిగూడ, శంషాబాద్, గండిపేట, శేరిలింగపల్లి, చందానగర్ ప్రాంతాలకు 37 డీసీఎం వాహనాల్లో చీరల తరలింపునకు అధికారులు ఏర్పాటు చేసి రూట్ అధికారులకు నియమించారు. ఒక డీసీఎంకు ఇద్దరు చొప్పున అధికారులకు ఇన్చార్జిలుగా నియమించారు. మొదట గ్రామీణ ప్రాంతంలో పంపిణీ పూర్తయ్యాక అర్బన్ మండలాలపై దృష్టిసారించనున్నారు. ఐదు రోజుల్లో పంపిణీ తంతంగాన్ని పూర్తి చేసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా తహసీల్దార్, పట్టణాలల్లో మున్సిపల్ కమిషనర్లు చీరల పంపిణీని పర్యవేక్షించనున్నారు. చీరల పంపిణీలో మంత్రి, జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొననున్నారు. టెప్కో నుంచి టెప్కో నుంచి జిల్లాకు బతుకమ్మ చీరలు వచ్చాయి. సిరిసిల్ల పవర్లూమ్ చీరలను అందించనున్నారు. దసరా పండుగకు రెండు నెలల ముందు నుంచే బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు. సద్దుల బతుకమ్మకు జిల్లాలో చీరలను పంపిణీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉండగా రేషన్‌కార్డులో పేరున్న ఉన్న ప్రతి మహిళన్నివ్వనున్నారు. జిల్లాలో దాదాపు 943 రేషన్ షాపులు ఉన్నాయి. ఇప్పటికే తహసీల్దార్లు, సివిల్ సప్లయ్ అధికారులు, వీర్వోలు ఇతర అనుబంధ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బతుకమ్మ చీరలు స్టాక్ పాయింట్లు... జిల్లాలోని మొయినాబాద్‌లోని మార్కెట్ కమిటీ గోదాంలో, కందుకూరు మండలం కొత్తురులో ఉన్న గోదాంలో చీరలను భద్రపరిచారు. జిల్లాలో చేవెళ్ల, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కందుకూరు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. హాజరుకానున్న మంత్రి మహేశ్వరం, కందుకూరు మండలాల్లో బతుకమ్మ చీరల పంపిణీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదతరులు హాజరు కానున్నారు. మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలో పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాలులో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు, కందుకూరు మండల కేంద్రంలో 2 గంటలకు బతుకమ్మ చీరలను పంపిణీని మంత్రి తదితరులు ప్రారంభించనున్నారు. అంతా సిద్ధం చేశాం.. జిల్లాలో 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకు చీరలు పంపిణీ చేస్తాం. మొత్తం 6,65,686 మందికి అందజేస్తాం. ఇప్పటి వరకు జిల్లాకు 3,58,600 చీరలు వచ్చాయి. మిగతావి త్వరలో రానున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి బతుకమ్మ చీరల పంపిణీని విజయవంతంగా పూర్తి చేస్తాం. మొయినాబాద్, కందుకూరు మండలం కొత్తూరులో ఉన్న గోదాంల నుంచి చీరలను ఆయా మండలాలకు తరలిస్తాం. రేషన్ దుకాణాల వద్ద బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. – ప్రశాంత్‌కుమార్, డీఆర్డీఏ పీడీ -
23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి బతుకమ్మ చీర ల పంపిణీ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. 18 ఏళ్లకుపైగా వయసు కలిగి, తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు రాష్ట్ర ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీర అందిస్తామన్నారు. 1.02 కోట్ల మంది అర్హులైన మహిళలకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యార్ పాల్గొన్నారు. -
కోటి బతుకమ్మ చీరల పంపిణీ : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ నెల 23 నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి చీరలను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని, దీని కోసం ప్రభుత్వం రూ. 313 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. 10 లక్షల వరకు 9 మీటర్ల చీరలు.. 6 మీటర్లతో 90 లక్షల చీరలు తయారు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక బతుకమ్మ చీరలు మార్కెట్లో సైతం దొరికేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టంలోని కోటి మంది మహిళలకు చిరు కానుక అందివ్వనున్నామని, ద్విముఖ వ్యూహంతో కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. వీటి తయారీ కోసం 24 వేల మగ్గాలు పనిచేశాయని, 18 ఏళ్ళు పై పడ్డ మహిళలు అందరికి పంపిణీ బతుకమ్మ చీరలతో నేతన్నలకు భరోసా ఇస్తున్నామని, వీటి పంపిణీ గ్రామ స్థాయిలో, పట్టణాల్లో.. వార్డు స్థాయిలో చేయనున్నట్లు తెలిపారు. 10 రకాల రంగులు, 10 రకాల డిజైన్లతో 100 కాంబినేషన్లో పంపిణీ చేస్తున్నామని, 710 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరలకు ప్రభుత్వం కేటాయించిందని స్పష్టం చేశారు. 23 నుంచి సాధ్యమైనంత వేగంగా పంపిణీ చేస్తామని, ఇతర రాష్ట్రాలకు మన చీరలు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ చీరలు ఓ బ్రాండ్ కాబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. -
బతుకమ్మ చీరల పంపిణీకి అంతా సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీకి అధికార యంత్రాగం సిద్ధమైంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఆహార భద్రత కార్డుల ఆధారంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించి జీహెచ్ఎంసీకి అందించింది. తీరొక్క రంగులతో కూడిన బతుకమ్మ చీరలను అందజేయనున్నారు. ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలను అర్హులుగా గుర్తిస్తూ లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని అర్బన్ పరిధిలో సుమారు 20 లక్షల మంది మహిళలను లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు. జాబితాలో నమోదు కాని అర్హులు ఎవరైనా ఉంటే వారికి సైతం చీరలు అందించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ నెల 28 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారం రోజుల ముందే చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్కిల్ వారీగా.. నగరంలో సర్కిల్ వారీగా బతుకమ్మ చీరలను కేటాయిస్తున్నారు. ఒక చీర 5.5 మీటర్లు, జాకెట్ 80 సెంటీమీటర్ల చొప్పున చీరలు తయారు చేశారు. తయారైన చీరలు, జాకెట్ స్టాక్ సైతం నగరంలోని గోదాములకు చేరుకుంది. వాటిని నగరంలోని మలక్‌పేట, యాకుత్‌పురా, చార్మినార్, నాంపల్లి, మెహిదీపట్నం, అంబర్‌పేట, ఖైరతాబాద్, బేగంపేట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, బాలానగర్, ఉప్పల్ పౌరసరఫరాల సర్కిళ్ల వారీగా కేటాయించారు. సర్కిల్లోని ఎంపికచేసిన ప్రాంతాల్లో చౌకధరల దుకాణాలకు సెంట్రల్ పాయింట్‌గా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం పంపిణీ చేసిన కేంద్రాల్లోనే ఈసారి కూడా బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుంది. స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారు. చీరల పంపిణీలో వృద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యమిస్తారు. లబ్ధిదారులకు ఏరోజు పంపిణీ చేస్తారో స్లిప్‌ల ద్వారా ముందస్తుగా తెలియజేస్తారు.