పరిగిలో గత వారం క్రితం బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు
సాక్షి, పరిగి: బతుకమ్మ చీరల కొరత అధికారులు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. చీరల పంపిణీలో ప్రభుత్వం ఈసారి పొదుపు మంత్రాన్ని పాటించింది. దీంతో చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబంలోని 18 ఏళ్లు నిండిన మహిళలకు చీర అందజేస్తామని సర్కారు ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాకు 3.11 లక్షల చీరలు అవసరమని అధికారులు నివేదిక ఇచ్చారు. కానీ 2.11 లక్షల చీరలు మాత్రమే గోదాంలకు చేరాయి. వీటిని ఆయా గ్రామాలకు పంపిణీ చేసి.. లబ్ధిదారులకు అందజేస్తున్నారు.
సర్పంచుల తంటాలు..
జిల్లాకు రావాల్సిన చీరల్లో 30 శాతం తక్కువగా పంపిణీ చేశారు. ఈ గణాంకాల ఆధారంగానే మండలాలు, గ్రామాలకు 70శాతం చీరలు అందజేశారు. 300 చీరలు
ఇవ్వాల్సిన గ్రామానికి 200, 3 వేల చీరలు ఇవ్వాల్సిన పంచాయతీకి 2వేల చీరలు ఇచ్చారు. మిగతావి త్వరలో వస్తాయని అధికారులు చెప్పారు. ఈ హామీతో ఆర్భాటంగా పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించిన సర్పంచ్‌లు, రేషన్ డీలర్లు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు చీరలు అందనివారికి సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతున్నారు. కొందరికి ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోవటంపై పేద మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈవిషయమై సర్పంచ్‌ల వద్ద పేచీ పెడుతున్నారు. గ్రామాల్లో మెజార్టీ సర్పంచ్‌లు అధికార పార్టీకి చెందిన వారే కావడంతో దీనిపై నోరు మెదపడం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కో గ్రామంలో 50పైగా ఆహార భద్రత కార్డులు రద్దయ్యాయి. వీరికి సంబంధించి చీరలు రాలేదు. ప్రస్తుతం ఇది కూడా ఓ సమస్యగా మారింది.
మిగతావి వస్తాయా...రావా..?
గ్రామాలకు 30 శాతం చీరలు తక్కువగా రావడంతో మిగతా చీరలు వస్తాయా..? రావా..? అని మహిళల్లో అయోమయం నెలకొంది. ఒక వేళ వచ్చినా.. పండగ లోపు వస్తాయా.. పండగయ్యాక వస్తాయా.. తెలియక పంపిణీ బాధ్యతలు తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు దిక్కుతోచకున్నారు. తమను నిలదీస్తున్న లబ్ధిదారులకు ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్నారు. కొరతను దృష్టిలో పెట్టుకుని మూడు చీరలు ఇవ్వాల్సిన ఇంటికి రెండు చీరలు ఇస్తున్నారు. మిగతాది స్టాక్ వచ్చాక ఇస్తామని సర్ది చెబుతున్నారు.
ఒకేసారి ఇవ్వాల్సింది
ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన చీరల్లో కోత పెట్టడం సర్పంచులు, డీలర్లకు తలనొప్పిగా మారింది. ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా చీరలన్నీ ఒకేసారి ఇస్తే బాగుండేది. కొందరికి ఇచ్చి.. మరికొందరికి ఇవ్వకపోవడంతో మమ్మల్ని తప్పుబడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మిగిలిన చీరలు పంపిణీ చేస్తే అందరికీ అందజేస్తాం.
– నర్సింహ, సర్పంచ్, రూప్‌ఖాన్‌పేట్
రెండు రోజుల్లో వస్తాయి
మండలానికి ఇవ్వాల్సిన చీరల్లో 30శాతం తక్కువగా వచ్చాయి. ఈ లెక్కన గ్రామాల వారీగా 30 శాతం తగ్గించి చీరలు పంపిణీ చేశాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు రోజుల్లో మిగతా చీరలు కూడా వస్తాయి. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం. సమస్యను ఉన్నతాధికారులకు వివరించి పండుగలోపే చీరలు వచ్చేలా చూస్తాం.
– అనురాధ, తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment