ఆడపడుచులకు బతుకమ్మ కానుక | Srinivas Goud Speech In Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఆడపడుచులకు బతుకమ్మ కానుక

Published Wed, Sep 25 2019 11:01 AM | Last Updated on Wed, Sep 25 2019 11:02 AM

Srinivas Goud Speech In Mahabubnagar - Sakshi

మహిళలకు చీరలు అందజేస్తున్న మంత్రి, కలెక్టర్‌

సాక్షి, పాలమూరు: ఆడపడుచులంతా కొత్త దుస్తులు ధరించి బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని న్యూ గంజ్, బండ్లగేరి, పాత పాలమూరు వార్డుల్లో మంగళవారం మహిళలకు బతుకమ్మ చీరలను కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌తో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేద మహిళ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ కోరిక అన్నారు. ఇందుకనుగుణంగా గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా మహిళలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు. అలాగే పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016కు, వికలాంగుల పింఛన్‌ రూ.1,500 నుంచి రూ.3,016లకు పెంచామన్నారు.

తాగునీరు, సాగునీరు సమస్యలను మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి రైతులకు లబ్ధిచేకూర్చడంతోపాటు పంటల సాగులో ఇబ్బందులు తొలిగాయన్నారు. పేదపిల్లల వివాహం కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్ప త్రుల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయని, పుట్టిన బిడ్డకు అవసరమయ్యే వస్తువుతో కేసీఆర్‌ కిట్టు అందిస్తున్నామన్నారు. వీటిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్, మహబూబ్‌నగర్‌ ఆర్డీఓ శ్రీనివాసులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

16,678 మందికి చీరల పంపిణీ 
పాలమూరు: మహబూబ్‌నగర్‌ జిల్లాలో గత రెండు రోజుల నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ఇంకా జిల్లాలో ఏడు మండల కేంద్రాలు, ఆయా మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేయాల్సి ఉంది. సోమవారం 6,857 చీరలు పంపిణీ చేయగా.. మంగళవారం 9,821 చీరలు అందించారు. రెండు రోజుల్లో కలిపి జిల్లాలో 16,678 మంది మహిళ లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు. రాజాపూర్, దేవరకద్ర, చిన్నచింతకుంట, మూసాపేట, హన్వాడ, నవాబుపేట, కోయిలకొండ మండలాల్లో బుధవారం నుంచి ప్రారంభం చేయనున్నారు. బాలానగర్‌ మండలంలో 220, జడ్చర్లలో 6,378, భూత్పూర్‌లో 1,150, గండీడ్‌లో 30, మహబూబ్‌నగర్‌ అర్బన్‌ పరిధిలో 5,498, మహబూబ్‌నగర్‌ రూరల్‌లో 110, మిడ్జిల్‌లో 2,607, అడ్డాకుల మండలంలో 685 మందికి చీరలను అందజేశారు. జిల్లాలో మొత్తం 2.98 లక్షల చీరలను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెల 28 వరకు జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement