బెల్లంపల్లి సభలో మాట్లాడుతున్న షర్మిల
బెల్లంపల్లి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాను చేసిన పాపాలను పరిహరించుకునేందుకే రాష్ట్రంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం యాత్ర సాగించారు. స్థానిక కాంటా చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.
ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి.. హామీలకే పరిమితం అయ్యాయన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోని సీఎం కేసీఆర్‌ను ఏమనాలని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే సింగరేణిలో భూగర్భ గనులు తప్ప ఓపెన్ కాస్టు ప్రాజెక్టులు ఉండవని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు.
2014కు ముందు సింగరేణి వ్యాప్తంగా 40 భూగర్భ గనులు, 8 ఓపెన్‌కాస్టులు ఉండగా, రాష్ట్రం ఏర్పడ్డాక భూగర్భ గనుల సంఖ్య 20కి పడిపోయిందని, ఓపెన్‌కాస్టుల సంఖ్య 19కి పెరిగిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఓసీలు తెరిచి కార్మికుల సంఖ్య తగ్గిస్తోందని విమర్శించారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలు ఇస్తామని ఏడేళ్ల క్రితం చెప్పిన కేసీఆర్.. ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును కట్టి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఆ ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టికూడా తీయలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూపకల్పన చేసిన ప్రాణహిత ప్రాజెక్టును లేకుండా చేసి, రైతాంగాన్ని కేసీఆర్ వంచించారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment