బతుకమ్మ చీరలపై మహిళల ఆగ్రహం
►బతుకమ్మ చీరలపై మహిళల అసంతృప్తి
►చీరలు కాల్చి బతుకమ‍్మ ఆడిన మహిళలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన బతుకమ‍్మ చీరలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేనేత చీరలను పంపిణీ చేస్తామన్న ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం...తీరా డామేజ్ చీరలను ఇచ్చిందని మండిపడుతున్నారు. కేవలం వంద రూపాయల విలువచేసే సాధారణ చీరలు పంపిణీ చేసిందని ఆరోపిస్తూ పలు జిల్లాల్లో మహిళలు.. చీరలు కాల్చేసి బతుకమ‍్మ ఆడారు.
జనగామ జిల్లా
జిల్లా కేంద్రంలోని 12వ వార్డు బుడగ జంగాల కాలనీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలు ఆందోళనకు దిగారు. 50రూపాయలు విలువ కూడా చేయని చీరలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అగౌరవ పరుస్తున్న అని ఎద్దేవా చేశారు. ఆ చీరలు బతుకమ్మకు కట్టుకోమని మహిళలు వాటిని అక్కడే పడేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా
భువనగిరి పట‍్టణంలోని 22, 23వ వార్డులో సోమవారం బతుకమ‍్మ చీరలు పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అయితే వాటిని అందుతున‍్న మహిళలు చీరలు చాలా నాసిరకంగా ఉన్నాయని ఆగ్రహం వ‍్యక‍్తం చేస్తూ వాటిని నడిరోడ్డుపైనే కుప‍్పగా వేసి నిప్పు పెట్టారు. చీరలు కాలుతుండగా చుట్టూ చేరి బతుకమ‍్మ ఆడారు. పోచంపల్లి చేనేత చీరెలు పంపిణీ చేస్తానని కేవలం 50 రూపాయలు విలువచేసే పాలిస్టర్ చీరెలు పంపుతారా అని కోపోద్రుక్తులయ్యారు.
జగిత్యాల జిల్లా
జిల్లా మండలం చల్గల్, లింగంపేటలో ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళల ధర్నాకు దిగారు. బతుకమ్మ చీరలను దగ్ధం చేసి మహిళలు తమ నిరసన తెలిపారు.
పెద్దపల్లి జిల్లా
ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోనూ బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. వాలీబాల్ కోర్టులోని నెట్కు చీరలను కట్టి తమ అసంతృప్తిని వెల్లడించారు. పంట చేళ్లల్లో పక్షుల కోసం బెదురుగా కట్టే చీరల కంటే హీనంగా బతుకమ్మ చీరలు ఉన్నాయని మండిపడ్డారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి మూడ్రోజులపాటు కొనసాగనుంది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత, జౌళి శాఖ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,04,57,610 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.222 కోట్లు వెచ్చించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లోలో
భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్ కాలనీవాసులు బతకమ్మ చీరలను కుప్పగా పోసి నిప్పంటించారు. బతుకమ్మ చీరల పేరుతో నాసిరకం చీరలను ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మళ్లీ మంచి చీరల్ని పంపిణీ చేయాలని కోరారు. బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వ ధనాన్ని నాశనం చేస్తున్నారని, డబ్బులిస్తే తామే మంచి చీరల్ని కొనుక్కుంటామని మహిళలు తెలిపారు.
[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]