
లోకసభ స్పీకర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ లేఖ
ఢిల్లీ : ప్రతిపక్ష పార్టీలపై చూపెడుతున్న వివక్షపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారాయన. లోక్‌సభ స్పీకర్‌కు ఆయన రాసిన లేఖలో సారాంశం ఇలా ఉంది..
లోక్‌సభలో ఉపసభాపతి నియామకం జరగకపోవడం
2019 నుండి ఉపసభాపతి పదవి ఖాళీగా ఉంది. రాజ్యాంగంలోని 93వ అధికరణం ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉండగా ఉపసభాపతి లేకపోవడం ఒక ప్రమాదకరమైన దృష్టాంతాన్ని ఏర్పరుస్తోంది, ఇది సభ నిష్పక్షపాతతను మరియు పనితీరును ప్రభావితం చేస్తోంది.
ప్రధాన ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశాన్ని నిరాకరించడం
ప్రోటోకాల్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత వేదికపై నిలబడినప్పుడు వారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాల్సిన సంప్రదాయాన్ని పదేపదే పట్టించుకోవడం లేదు. ఇది గత పార్లమెంటరీ ప్రవర్తనలకు భిన్నంగా ఉండటమే కాకుండా, సభలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తగ్గిస్తుంది.
ప్రతిపక్ష నేతలు మరియు ఎంపీల మైక్రోఫోన్లు ఆఫ్ చేయడం
ప్రతిపక్ష ఎంపీలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకురాగానే వారి మైక్రోఫోన్లు ఆఫ్ చేయడం ఒక సాధారణ ఘటనగా మారిపోయింది, అయితే అధికార పక్ష సభ్యులు మాత్రం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని పొందుతున్నారు. ఈ విధానం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అవుతుంది.
సభానిర్వహణ సలహా కమిటీ (BAC) నిర్ణయాలను పట్టించుకోకపోవడం
ప్రభుత్వం BACలోని ఇతర పక్షాలతో సంప్రదించకుండా, వారికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గత వారం గౌరవ ప్రధానమంత్రి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సభలో ప్రవేశపెట్టడం ఇందులో భాగమే.5)బడ్జెట్ మరియు వివిధ మంత్రిత్వ శాఖలకు గ్రాంట్ల కోసం డిమాండ్ చర్చలో కీలక మంత్రిత్వ శాఖలను మినహాయించడం:
ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను బడ్జెట్ కేటాయింపులు మరియు గ్రాంట్ల కోసం డిమాండ్ చర్చల నుండి మినహాయిస్తున్నారు. ఇది ఆర్థిక నిర్ణయాలపై పార్లమెంటరీ పర్యవేక్షణను తగ్గిస్తోంది.
193వ నియమం ప్రకారం చర్చల్లో కోత
అత్యవసరమైన ప్రజా సమస్యలపై ఓటింగ్ లేకుండా చర్చించేందుకు అనుమతించే 193వ నియమాన్ని ఇప్పుడు చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా దేశానికి అత్యంత ప్రాధాన్యమైన అంశాలపై బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో జోక్యం
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు స్వతంత్రంగా పనిచేసి నిపుణులకు చట్టపరమైన పర్యవేక్షణను అందించాలి. అయితే, స్పీకర్ కార్యాలయం కమిటీ నివేదికల్లో సవరణలు సూచించిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీని వల్ల వాటి స్వతంత్రత దెబ్బతింటోంది.
వాయిదా తీర్మానాలను నిర్లక్ష్యం చేయడం మరియు తిరస్కరించడం
గతంలో జీరో అవర్ లో చర్చకు అనుమతించే వాయిదా తీర్మానాలను ఇప్పుడు పట్టించుకోవడం లేదు. వాటిని తక్షణమే తిరస్కరిస్తున్నారు. ఇది అత్యవసరమైన జాతీయ సమస్యలను ప్రస్తావించే ఎంపీల హక్కులను పరిమితం చేస్తోంది.
ప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు తీర్మానాలను నిర్లక్ష్యం చేయడం
ప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు తీర్మానాలు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. కార్యనిర్వాహక అధికారానికి బయట ఉన్న ఎంపీలు చట్టాలను ప్రతిపాదించే అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే, వీటిపై తగినంత చర్చకు సమయం ఇవ్వకపోవడ వల్ల చట్టసభలో చర్చలు కుదించబడుతున్నాయి.
సంసద్ టీవీ
ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లు మరియు ఎంపీలు మాట్లాడినప్పుడు లోక్ సభ అధికారిక టీవీ ఛానల్ సంసద్ టీవీ వారి ముఖాలను చూపకుండా కెమెరా యాంగిల్‌ను మార్చడం ఒక సర్వసాధారణ ఘటనగా మారింది. ఇది పార్లమెంటరీ కార్యకలాపాల పారదర్శకతను దెబ్బతీస్తుంది.
సభా కమిటీ
కమిటీల ఏర్పాటు మరియు ఛైర్మన్ నియామకంపై ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సంప్రదింపుల కమిటీ సమావేశాలు:
సంప్రదింపుల కమిటీ సమావేశాలు క్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే, అనేక కమిటీలు నిబంధనలకు విరుద్ధంగా క్రమం తప్పకుండా సమావేశం కావడం లేదు.
ఈ పరిణామాలు తీవ్రమైన ఆందోళనకు కారణమయ్యాయి మరియు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు సమగ్రతను పరిరక్షించేందుకు తక్షణ సవరణ చర్యలు అవసరమని సూచిస్తున్నాయి. పార్లమెంటరీ న్యాయం, పారదర్శకత, పార్లమెంటరీ ప్రమాణాలకు కట్టుబడటాన్ని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మేము తమరికి విజ్ఞప్తి చేస్తున్నాము.