కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ/నల్లగొండ: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 28న మరికొన్ని గ్యారంటీలను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలులోకి తెస్తామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భేటీలో ఆ శాఖ ఈఎన్‌సీ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్–విజయవాడ రహదారిని ఆరులేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని, తెలంగాణలోని 14 రహదారులను స్టేట్ హైవేలుగా మార్చాలని కేంద్రమంతిని కోరానని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని వివరించారు. కేంద్రంతో తరచూ సంప్రదిస్తూ రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని కోమటిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రోడ్ల గుంతలను మట్టితో పూడ్చిందని, తమ ప్రభుత్వంలో అలా జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎవరిపైనా తాము కక్ష సాధింపులకు దిగబోమని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మిస్తామన్నారు. ఈ విషయంపై మంగళవారం అధికారులతో సమీక్ష జరుపుతానని కోమటిరెడ్డి తెలిపారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాను కలిసి రాజీనామాపత్రాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment