
విలేకరులతో మాట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి ఎంపీ టికెట్ అడగడం లేదు
కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే గిట్టని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
కొంత ఆలస్యమైనా నాకు మంత్రి పదవి వస్తుంది
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు: భువనగిరి ఎంపీ టికెట్ తన భార్య లక్ష్మికి అడుగుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు నిజం కాదని, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే గిట్టనివారు తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు.
భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే బాగుటుందని తాను పలుమార్లు చెప్పానని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. కోమటిరెడ్డి కుటుంబం పదవుల కోసం పాకులాడదని, తన భార్య లక్ష్మి కూడా పోటీచేసేందుకు సుముఖంగా లేదని చెప్పారు. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లో.. తమ కుటుంబం నుంచి పోటీచేస్తేనే గెలుస్తామని రిపోర్టు వస్తే..అధిష్టానం పోటీచేయాలని పట్టుబడితే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండవు
తన సోదరుడు మంత్రి వెంకట్‌రెడ్డికి, తన మధ్య విభేదా లు ఉన్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తమ మధ్య ఏ ఒక్క రోజూ ఎడబాటు ఉండదన్నారు. ఇద్దరం కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడని, తాను సూర్యాపేటకు వెళ్తే.. ఒక్క రోజు కూడా బయట తిరగలేడన్నారు. ఆలస్యమైనా తనకు మంత్రి పదవి వస్తుందని, ఆ నమ్మకం ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం ఎంపీపీలు తాడూరి వెంకట్ రెడ్డి, గుత్తా ఉమాదేవి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment