బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నాయకులను ఆదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
నేతల మెరుపు ధర్నా.. అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆదివారం బీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేకువజాము నుంచే పోలీసులు పట్టణాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరిని పోలీసు స్టేషన్లకు తరలించారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో రాత్రి పొద్దుపోయే వరకు నిర్బంధించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత కంచర్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్, ఎస్‌ఎస్‌యూఐ కార్యకర్తలు.. భువనగిరిలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే.
ఆ దాడికి నిరసనగా బీఆర్‌ఎస్ భువనగిరిలోని వినాయక చౌరస్తా వద్ద ఆదివారం మహాధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి బీఆర్‌ఎస్ నేతలు భువనగిరికి చేరుకుని మూడు చోట్ల ధర్నాలు చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వివేకానందుని విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్ తదితరులు ఒక్కసారిగా ధర్నాకు దిగారు.
దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించాయి. అక్కడ ఉద్రిక్తత నెలకొనటంతో పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అశ్వికదళంతో ప్రధాన రహదారితో పాటు పలు వీధుల్లో గస్తీ నిర్వహించారు. పోలీసుల తీరుపై పైళ్ల శేఖర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నేతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు.
కారులో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు
భువనగిరిలో వినాయక చౌరస్తా వద్ద నిర సన తెలుపుతున్న వల్లపు విజయ్‌ను పో లీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్యులు చెప్పారని బీఆర్‌ఎస్ కార్యకర్తలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment