
భువనగిరి ఖిల్లాపై నిర్మించబడిన రాజప్రసాదం
నేటికీ చెక్కు చెదరని కట్టడాలు
నిత్యం పర్యాటకులతో సందడి
పూర్వవైభవానికి చర్యలు
స్వదేశీ దర్శన్ కింద రూ.118 కోట్లు మంజూరు
మొదలైన తొలి విడత పనులు
భువనగిరి: హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి పట్టణంలోని భువనగిరి ఖిల్లా అనేక పోరాటాలకు, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ చెక్కు చెదరని నిర్మాణంగా ఉంది. సముద్ర మట్టానికి 610 మీటర్ల ఎత్తులో ఏకశిలా రాతిగుట్టపై నాటి రాజులు కోట నిర్మించారు. కోట కింది భాగంలో గుర్రాల కోసం కొట్టాలు, ధాన్యాన్ని నిల్వ చేయడానికి ధాన్యాగారాలు, సైనికుల కోసం సైనిక గారాలున్నాయి. రాజ భవనాల కింద శిలాగర్భంలో అనేక రహస్య మార్గాలున్నాయని స్థానికులు చెబుతుంటారు. చాళుక్యుల శిల్పరీతిని ప్రతిబింబించే రాజప్రసాదాలు, కాకతీయ శైలిలో అనేక శిలాకృతులను చెక్కారు.
త్రిభువనమల్ల విక్రమాదిత్య పేరుతో..
కాకతీయుల కాలంలో భువనగిరి కోట (Bhuvanagiri Fort) ప్రముఖంగా ప్రసిద్ధి చెందింది. పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన ఆరవ త్రిభువనమల్ల విక్రమాదిత్య ఖిల్లాపై కోట నిర్మించారు. అతని పేరుమీదుగా దీనికి త్రిభవనగిరి (Tribhavanagiri) అనే పేరు వచ్చింది. ఈ పేరు క్రమంగా భువనగిరిగా మార్పు చెందింది. అలాగే త్రిభువనమల్లుకి స్థానికులైన గొల్ల దంపతులు ఈ కొండను చూపించారని అరణ్యంలో తీగలతో కప్పబడి ఉన్న ఈ కొండ కోట నిర్మాణానికి అనుకూలంగా ఉందని భావించి దర్గం నిర్మించారు. దీంతో స్థానికులైన బోనయ్య గిరమ్మ దంపతుల పేరుగానే ఈ పట్టణానికి భువనగిరిగా పేరు వచ్చిందని మరో కథనం కూడా ఉంది.
ఈ కోట పరిసర ప్రాంతాల్లో మధ్యరాతియుగం, నవీన శిలాయుగం, మధ్య పాతరాతియుగం నాటికి చెందిన బాణాలు, రాతి గొడ్డళ్లు, కత్తులు, సమాధుల ఆనవాళ్లు లభ్యమయ్యాయి. భువనగిరి కోట కొంతకాలం కుతబ్‌షాహీల పరిపాలనతో కూడా ఉంది. 1687లో మొఘలులు (Mughal Empire) గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట కొంత కాలం మొఘలుల పాలనలోకి వెళ్లింది. అనంతరం కల్లు గీత కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న (Sardar Sarvayi Papanna) 1708లో ఓరుగల్లును గెలుచుకొని తర్వాత భువనగిరి కోటను జయించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.

ఖిల్లాపై చెక్కుచెదరని నిర్మాణాలు
భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అని పిలుస్తారు. నిజాం రాజు తన సొంత ఖర్చుతో ఈ ద్వారాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇది గోల్కొండ కోటలోని బాలాహిస్సార్ మొదటి ద్వారం ఫతే దర్వాజాను పోలి ఉంటుంది. ఎత్తైన గోడలు, విశాలమైన గదులు, ఇస్లాం సంస్కృతి నిర్మాణ శైలిలో కనిపిస్తాయి. అండాకారపు ఏకశిలాపర్వతం గల కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేలుగా, పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగులాగా కనిపిస్తుంది.

ఏనుగుల మోట వాగులు, బైరవకొలను, సప్త కన్యలు అనే పేరుతో నీటి కొలనులు ఉన్నాయి. దిగుడు మెట్ల బావులు, వంట గదులు, అశ్వ శాలలు, ఎనిమిది దిక్కుల్లో ఫిరంగులున్నాయి. ఖిల్లాపైన మూడు అత్యవసర ద్వారాలున్నాయి. ఇందులో రెండు మూసుకుపోగా ఒకటి మాత్రం నామమాత్రంగా ఉంది. శిలాశాసనాలు, దేవాలయాలకు చెందిన శిథిలాలు కూడా ఉన్నాయి. కొండ మధ్య భాగంలో మండపంతో పాటు ఖిల్లా చుట్టూ రక్షణ గోడలలో మూడు అంచెలలో ఎలాంటి మట్టి లేకుండా పూర్తిగా రాతితోనే నిర్మించారు.

సందర్శకుల సందడి..
భువనగిరి ఖిల్లాను సందర్శించేందుకు నిత్యం ఎంతో మంది వస్తుంటారు. ఇందులో ప్రధానంగా జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఖిల్లాలో సందర్శకులతో సందడి కనిపిస్తుంది. భువనగిరి ఖిల్లాను అ మెరికా, రష్యా, ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఆ్రస్టేలియా, బ్రిటన్, దేశాలకు చెందిన వారితో పాటు దేశంలోనే అన్ని రాష్టాలకు చెందిన వారు కూడా సందర్శిస్తుంటారు. చారిత్రక చరిత్ర కలిగిన ఖిల్లాపై ఎన్నో బాలీవుడ్ సినిమాలకు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరించారు.

ఖిల్లా అభివృద్ధికి చర్యలు
భువనగిరి ఖిల్లా అభివృద్ధికి 2024లో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ కింద రూ.118 కోట్లు కేటాయించింది. ఇటీవల మళ్లీ అధికారంలోకి వచ్చిన కేంద్రం ప్రభుత్వం తిరిగి ఖిల్లా అభివృద్ధికి మొదటి విడత కింద రూ.58 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఖిల్లాపై రోప్ వేతో పాటు కింది భాగంగా బీటీ రోడ్డు, ఖిల్లాపై విశ్రాంతి ప్రదేశాలు, పార్కులు, ఆట సామగ్రి, కింది భాగంలో పార్కింగ్ కోసం ప్రదేశాలు ఏర్పాటు చేయడం, విద్యుత్ కాంతులు వెదజల్లేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం వంటి వాటిని ప్రణాళిక కింద తీసుకున్నారు. ఈ అభివృద్ధి పనులను చేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించి చేపట్టేందుకు టెండర్లు దశలో ఉన్నాయి.
చదవండి: అద్భుతం కోరుట్ల మెట్లబావి.. రాతి స్తంభాల కింద సొరంగం
Comments
Please login to add a commentAdd a comment