bhuvangiri
-
సంక్రాంతికి ఎఫెక్ట్.. టోల్ గేట్ వద్ద ప్రత్యేకంగా..
సాక్షి, యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాల నుంచి ప్రజలు గ్రామాల బాట పట్టారు. సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైవేలపై వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టోల్‌బూత్‌ల మధ్య ట్రాఫిక్ క్లియర్ కోసం టోల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వివరాల ప్రకారం.. సంక్రాంతి సందర్బంగా జాతీయ రహదారి -65పై హైదరాబాద్-విజయవాడ వైపు వాహనాల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో పంతంగి, కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు టోల్ బూత్‌లను టోల్ సిబ్బంది టోల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. దీంతో, ట్రాఫిక్ కొంత మేరకు తగ్గింది. ఇక, సంక్రాంతి సందర్బంగా విజయవాడ బస్టాండ్‌కు ప్రయాణీకుల రద్దీ పెరిగింది. బస్టాండ్‌లో ప్లాట్‌ఫ్లామ్‌లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ప్రయాణీకులు చేరుకుంటున్నారు. కాగా, ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. -
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
ఢిల్లీ: భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం ఉందని, భువనగిరి స్టేషన్ తెలంగాణలోని ప్రముఖంగా రాకపోకలు సాగిస్తున్న రైల్వే స్టేషన్ అని. ఇందుకు సంబంధించి ఆధునీకరణ పనులు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో గురువారం భేటీ అయిన వెంకట్‌రెడ్డి.. పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు వేల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అలాగే, భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడింది. ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్‌కు రోజూ అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు స్టేషన్లపై దృష్టి సారించాలి. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనుల పొడిగింపుపై వినతి ఎంఎంటీఎస్ ను ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాల్సిన అవసరం చాలా ఉంది. ఎంఎటీఎస్ రెండోదశకు 2/3 వంతున పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం కారణంగా ఇది కార్యరూపం దాల్చడం లేదు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భాగస్వామ్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థనపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.. కేంద్రమే మొత్తం ఖర్చు భరించి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారని,. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను కూడా ఆధునికీకరస్తామని చెప్పారన్నారు. -
చంద్రబాబు కాన్వాయ్కి ప్రమాదం
సాక్షి, భువనగిరి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. సడన్ బ్రేక్ కారణంగా ఒక్కసారిగా కాన్వాయ్‌లోని ముందున్న ఎస్కార్ట్ వాహనాన్ని చంద్రబాబు వాహనం బలంగా ఢీ కొట్టింది. అయితే చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో మరో వాహనంలో వారిని తరలించారు. అమరావతి నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
భువనగిరి ఖిలాపై ట్రైనీ ఐఏఎస్‌ల సందడి
]సాక్షి, భువనగిరి: ట్రైనీ ఐఏఎస్‌ల బృందం ఆదివా రం భువనగిరి ఖిల్లాను సదర్శించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల ఇన్స్టిట్యూట్కు శిక్షణ నిమిత్తం వచ్చిన 13మంది ఖిలాను చూసేందుకు వచ్చారు. రాక్ క్లైంబింగ్ నిర్వహించి కోటపై కట్టడాలను పరిశీలించారు. కోట చరిత్రను భావి తరాలకు అందిల్సాన బా ధ్యత అందరిపై ఉందన్నారు. భువనగిరి రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల నిర్వాహకుడు బచేనపల్లి శేఖర్‌బాబు, కోచ్ పరమేశ్వర్, రాకేశ్, వినోద్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. రాక్ క్లైంబింగ్ -
జరంత మంచి జేయాలె..!
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో నిర్వహించిన ‘సాక్షి రోడ్డు షో’లో భిన్న దృశ్యాలు కనిపించాయి. దశాబ్దాల తరబడి పాలకులు చేసిన నిర్లక్ష్యానికి ఆనవాళ్లుగా.. ఎటు చూసినా బీడుబారిన భూములే. కనుచూపు మేరలో కనిపించని పచ్చదనం. వందల ఎకరాల్లో పంటల సాగుకు నోచుకోని నేల. కోరలు చాచిన కరువు. ఎండిపోయిన చెరువులు, నోళ్లు తెరిచి బీళ్లు... ఇవీ భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 163వ జాతీయ రహదారి వెంట కనిపించిన దృశ్యాలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మినహా అంతకుముందు ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని పలువురు చెప్పారు. వైఎస్ పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారని, సాగునీటి కల్పనకు కృషి చేశారని.. నాటి పనులను ప్రస్తుత టీఆర్ఎస్ సర్కారు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. బీబీనగర్ మండలం కేపాల్ నుంచి జనగామ మండలం యశ్వంతాపూర్ వరకు నిర్వహించిన రోడ్డు షోలో.. అభివృద్ధికి చిరునామాగా నిలవాల్సిన జాతీయ రహదారి వెంట కరవు తాండవించడం కనిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కేపాల్ నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, జనగామ వరకు జాతీయ రహదారిపై వివిధ వర్గాల ప్రజలు వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే..- సాక్షి, నెట్వర్క్ భిన్నాభిప్రాయాలు లోక్‌సభ ఎన్నికలపై అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన రోడ్డు షోలో.. రైతులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, మహిళలతో పాటు పలువురిని పలకరించింది ‘సాక్షి’ బృందం. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు?, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది?, దేశ భద్రతకు బీజేపీ తీసుకుంటున్న చర్యలపై మీ స్పందన ఏమిటి? తదితర ప్రశ్నలను వేసింది. ‘ఇవి లోక్‌సభ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీలకే అవకాశమివ్వాలని, జాతీయ పార్టీలే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంద’ని పలువురు చెప్పా రు. కొందరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసిన టీఆర్ఎస్కే మద్దతునిస్తామని చెప్పగా, ఆ పార్టీ 16 సీట్లు గెలుచుకుని కేంద్రంలో కీలకంగా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 4కి.మీ. కొండమడుగు మెట్టు నుంచి గూడూరు టోల్‌ప్లాజా రోడ్లు మెరుగుపరిచే వారికే.. బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు నుంచి గూడూరు టోల్‌ప్లాజా వరకు 4 కిలోమీటర్ల మేర సాగిన రోడ్డుషోలో.. ప్రధానంగా మండలంలోని కొండమడుగు మెట్టు, బీబీనగర్‌లోని ప్రధాన చౌరస్తాల వద్ద అండర్ పాస్‌లు లేని విషయాన్ని పలువురు ‘సాక్షి’ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యపై కొన్నేళ్లుగా అధికారులకు విన్నవిస్తున్నా స్పందన లేదని, కాబట్టి ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటెయ్యాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కొందరు చెప్పారు. ఆలేరులో బాహుపేట నుంచి జనగామ జిల్లా పెంబర్తి కమాన్ వరకు జాతీయ రహదారిలో ఇది చాలా పెద్ద సమస్య. అండర్ పాస్‌లు లేకపోవడంతో ప్రధాన రహదారుల గుండా వాహనదారులు నేరుగా దాటుతూ, ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. మండల పరిధిలోని జాతీయ రహదారి అంతటా ఇదే పరిస్థితి. ఈ సమస్యపై పలువురు మాట్లాడుతూ సత్వరమే దీనిని పరిష్కరించాలని కోరారు. ఒడిదుడుకుల ప్రయాణం.. భువనగిరి మండలం జమ్మాపురం నుంచి వరంగల్ – హైదరాబాద్ రహదారి మార్గంలో పగిడిపల్లి వరకు 9 కిలోమీటర్ల ప్రయాణంలో పలువురిని పలకరించినపుడు పార్టీలు, రాజకీయాల గురించి కాకుండా తమ రోడ్డు సమస్యను ప్రస్తావించారు. ‘ఈ రహదారికి ఇరుపక్కలా రాయగిరి, గచ్చుబావి, భువనగిరి ప్రాంతాలు ఉన్నాయి. ఈ రహదారి పొడవునా ఉన్న గచ్చుబావి నుంచి టీచర్స్ కాలనీ వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు లేదు. ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినప్పటికీ ప్రమాదపు అంచుల్లో ప్రయాణిస్తున్నట్లే ఉంటోంది. రామచంద్రాపురం చౌరస్తా వద్ద బ్రిడ్జి లేకపోవడంతో ఈ రోడ్డు మార్గం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు’ అని పలువురు తెలిపారు. ఈ సమస్యను దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోలేదని పలువురు వాపోయారు. 9కి.మీ.జమ్మాపురం నుంచి పగిడిపల్లి వరకు హామీలను బట్టి ఓటు రోడ్డు, మంచినీరు తదితర సమస్యలను పరిష్కరిస్తామని ఎవరు గట్టిగా హామీ ఇస్తే ఓటు వాళ్లకే వేస్తాం. తాళ్లగూడెం గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు సరిగా లేదు. వెంచర్ మధ్య నుంచి వెళ్లడానికి వాళ్లు అనుమతివ్వడం లేదు. జాతీయ రహదారి దాటడానికి అండర్ పాస్ బ్రిడ్జి కట్టాలి– ఊర్మిళ, తాళ్లగూడెం టీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యే పోటీ.. ‘సాగునీటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. రిజర్వాయర్ల నిర్మాణం జరిగినప్పటికీ చెరువుల్లోకి నీళ్లు రావడం లేదు. బోర్లపైనే ఆధారపడాల్సి వస్తుంది.మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నప్పటికి నల్లా కనెక్షన్లు అన్ని ఇళ్లకూ ఇవ్వలేదు. ఏ అర్హత ప్రకారంగా నల్లా కనెక్షన్లు ఇచ్చారో తెలియడం లేదు. నల్లాలో వస్తున్న నీళ్లు కూడా తాగడానికి పనికి రావడం లేదు. మాకు నీటి సమస్య మాత్రం తీరడం లేదు’ అని భువనగిరి పట్టణవాసులు స్పందించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం నిరుపేదల్లో ఆశలు రేకెత్తిస్తోందని, కాబట్టి దేశవ్యాప్తంగా ఇది పని చేస్తే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే పేదలకు మేలు జరిగే అవకాశాలున్నాయని అన్నారు.భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్– టీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేం’ అని ఇంకొందరు చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తమ రచ్చబండ చర్చలను బట్టి తెలుస్తోందని కొందరు వృద్ధులు తెలిపారు. నోట్ల రద్దు కష్టాలు అన్నీఇన్నీ కావు.. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తమకు ఎలాంటి సంక్షేమ పథకాలనూ అందించలేదని చిరు వ్యాపారులు వాపోయారు. ముద్ర రుణాలు ఆర్భాటపు ప్రకటనే తప్ప ఆచరణలో ఎవరికీ రుణాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ప్రత్యేకించి పెద్ద నోట్ల రద్దు నాటి కష్టాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నామని కొందరు గుర్తుచేశారు. ఏ వస్తువుకు జీఎస్టీ పడుతుందో, ఏ వస్తువుకు జీఎస్టీ పడడం లేదో స్పష్టంగా తెలియక మోసపోతున్నామని సామాన్య ప్రజలు వాపోతున్నారు. జీఎస్టీ మొత్తానికి వ్యాపారులు పేదలను కొట్టడానికే ఉపయోగపడుతోందని, వారిని కేంద్రం నియంత్రించలేకపోతోందని అన్నారు. నోట్ల రద్దు అర్థరహితం తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉంది. ప్రతిపక్షాలు పూర్తిగా బలహీన పడ్డాయి. కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన వారుటీఆర్ఎస్లో చేరడం ప్రజాతీర్పునువ్యతిరేకించడమే. ఇక మోదీ విషయానికి వస్తే నోట్ల రద్దు వంటి అర్థరహితమైన నిర్ణయాలు, నియంతృత్వం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. కాంగ్రెస్ పాలనలోనే అంతో ఇంతో నయం. మార్పు ఖాయం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన మార్పు చోటు చేసుకోనుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడి ప్రజలు కూడా కాంగ్రెస్ వైపేమొగ్గు చూపుతున్నారు. నిజామాబాద్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు వందల సంఖ్యలోనామినేషన్లు వేశారు. ఆంజనేయులు, బీబీనగర్ సుస్థిర పాలన కోసం.. కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తుంది. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం. కేంద్రంలో సుస్థిర పాలన అందాలంటే జాతీయ పార్టీలకే ఓటేయాలి. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన బాగుంది. ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందేలా కృషి చేస్తున్నారు సీఎం. సాగునీటి కోసం గతంలో ఏ ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకోలేదు.కంటాల ప్రభాకర్, బాహుపేట -
భువనగిరి.. ఎవరి జాగీరు?
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం విభిన్న ప్రాంతాల కలబోత. ఉత్తర – దక్షిణ తెలంగాణ ప్రాంతాలు కలగలిసిన ఏకైక నియోజకవర్గం. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలలో ఈ సెగ్మెంట్ విస్తరించి ఉంది. యాదాద్రి, కొమురవెల్లి పుణ్యక్షేత్రాలు దీని పరిధిలోనే ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఈ లోక్‌సభ స్థానం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్, 2014లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి స్థానంలో పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పి.వి.శ్యాంసుందర్, సీపీఐ తరఫున గోద శ్రీరాములు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపుపై టీఆర్ఎస్, కాంగ్రెస్ ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో విజయం ఖాయమని టీఆర్ఎస్ అంచనా. సంప్రదాయ ఓటు బ్యాంకు, అభ్యర్థికి ఉన్న సంబంధాలతో విజయం దక్కుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. గట్టి పోటీ ఇచ్చి పట్టు నిలుపుకోవాలని బీజేపీ, సీపీఎం ప్రయత్నిస్తున్నాయి. -గ్రౌండ్ రిపోర్టు-పిన్నింటి గోపాల్ టీఆర్ఎస్: అన్నీ అనుకూలాంశాలే రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా టీఆర్ఎస్ బలంగా ఉంది. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ, ఇబ్రహీంపట్నం స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఆరు సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడం టీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ ఇమేజ్ అదనపు బలం కానున్నాయి. అధికార పార్టీగా గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉండడం టీఆర్ఎస్కు అనుకూలించనుంది. భువనగిరి సెగ్మెంట్లో బీసీ వర్గాల ప్రభావం గణనీయంగా ఉంది. అధికార పార్టీ అభ్యర్థి ఈ వర్గానికి చెందిన వారు కావడం టీఆర్ఎస్కు కలిసొస్తోంది. అభివృద్ధిలో పరుగులు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో భువనగిరి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లతో సాగునీరు అందిస్తాం. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను సాధించి త్వరలో ప్రారంభించబోతున్నాం. భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం, పాస్‌పోర్టు కేంద్రం, నకిరేకల్‌లో డ్రైపోర్టు, జాతీయ రహదారుల అభివృద్ధి, ఇబ్రహీంపట్నంలో ఏరోస్పేస్ పార్క్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాం. ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి చిత్తుగా ఓడిపోవడం ఖాయం. కేసీఆర్ నాయకత్వంలో 16 ఎంపీ సీట్లు గెలుస్తాం.– బూర నర్సయ్యగౌడ్, టీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్: ఆశలు.. అంచనాలు గ్రామ స్థాయిలో పార్టీకి సంస్థాగతంగా ఓటు బ్యాంకు ఉంది. టీఆర్ఎస్ అనుకూల పవనాల్లోనూ ఇటీవలి ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని నకిరేకల్, మునుగోడు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరారు. కోమటిరెడ్డి సోదరుల సొంత నియోజకవర్గం నకిరేకల్ కావడంతో ఎన్నికల్లో తమకు ఈ సెగ్మెంట్లో అనుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009లో ఇక్కడ గెలిచారు. 2014లో ఓడిపోయారు. రెండుసార్లు పోటీ చేసిన అనుభవంతో భువనగిరిలోని గ్రామస్థాయిలో సమన్వయం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్‌కు కొంత బలంగా కనిపిస్తోంది. అయితే నియోజకవర్గ స్థాయి నేతలు ఎన్నికలపై పెద్దగా పట్టుదలగా లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. ప్రశ్నించే గొంతుకనవుతా.. భువనగిరి ప్రజలు గెలిపిస్తే లోక్‌సభలో తెలంగాణ గొంతుకనవుతా. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశా. తెలంగాణ కోసం 14 రోజులు దీక్ష చేశా. నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే పోటీ చేస్తున్నా. సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ డమ్మీ. కేసీఆర్, కేటీఆర్ ముందు ఏమీ మాట్లాడలేరు. ఆయనకు ఆపరేషన్లు చేయడంలో అనుభవం ఉంది కానీ అభివృద్ధి చేయడంలో లేదు. నిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయడంలో విఫలమయ్యారు. భువనగిరిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు, బస్సులు ఆగవు. మంత్రి జగదీశ్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో చెల్లకుండా పోయి సూర్యాపేటలో చెల్లినట్లే నేను భువనగిరిలో చెల్లుతాను.– కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ: పట్టణప్రాంతాలపై దృష్టి కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభావంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఎన్నికల్లో గణనీయ సంఖ్యలో ఓట్లు పొందాలని భావిస్తోంది. భువనగిరి మున్సిపాలిటీలో విజయం సాధించిన కాషాయ పార్టీ.. సెగ్మెంట్లోని పట్టణ ప్రాంతాల్లో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 1,83,249 ఓట్లు దక్కాయి. వ్యక్తిగతంగా బీజేపీ అభ్యర్థికి ఇక్కడ సానుకూలత ఉంది. మూసీ నది ప్రక్షాళన ఉద్యమం పార్టీకి అనుకూలంగా మారొచ్చని అంచనా. అయితే గ్రామస్థాయిలో సంస్థాగత నిర్మాణం లేదు. పార్టీలోని ఇతర సీనియర్ నేతలెవరూ అభ్యర్థికి సరిగా సహకరించడంలేదు. రాష్ట్ర స్థాయి నేతలు సైతం ప్రచారానికి రావడం లేదు. యువతకు ఉపాధి..అందరికీ విద్య, వైద్యం ప్రధాని మోదీ సాయంతో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. సాగునీటికి పెద్దపీట వేస్తాం. ప్రాజెక్టులకు అధిక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తాం. నియోజకవర్గంలోని ఐదు లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో నిండి ఉన్న నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాం. ఐటీ కారిడార్‌తో ఉద్యోగ అవకాశాలు పెంపొందిస్తాం. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసి పేద, మధ్య, ఉన్నత వర్గాలకు వాటిని అందుబాటులోకి తెస్తాం. నరేంద్రమోదీ మరోసారి ప్రధాన మంత్రి కావడం ఖాయం. బీజేపీ గెలుపుతో అభివృద్ధి మరింత సాధ్యమవుతుంది.– పి.వి.శ్యాంసుందర్‌రావు, బీజేపీ అభ్యర్థి సీపీఐ: పూర్వ వైభవానికి యత్నం గతంలో ఈ సెగ్మెంట్లో ఆధిక్యత చూపిన కమ్యూనిస్టు పార్టీలు పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్నాయి. సీపీఎం పొత్తుతో సీపీఐ తరపున గోద శ్రీరాములు పోటీ చేస్తున్నారు. మునుగోడు, ఆలేరు, నకిరేకల్, జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో సంప్రదాయంగా ఉన్న బలంపై రెండు పార్టీలు నమ్మకంతో ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థికి 54,035 ఓట్లు వచ్చాయి. అప్పట్లో సీపీఐ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. తాజా ఎన్నికల్లో బలం చూపాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పేదలే మమ్మల్ని గెలిపిస్తారు నదీ జలాల సాధనే ప్రధాన సమస్య. సీపీఐ కొన్నేళ్లుగా నదీజలాల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తోంది. భూపోరాటాలు చేసి సాధించుకున్న వేలాది ఎకరాలు సాగునీరు లేక బీడుపడ్డాయి. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు వలస పోతున్నారు. కమ్యూనిస్టులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజీలేని పోరాటాలు చేసి పేదలకు ఆనాటి నుంచి అండగా నిలిచారు. వారే మమ్మల్ని గెలిపిస్తారు. – గోద శ్రీరాములు, సీపీఐ అభ్యర్థి అసెంబ్లీ సెగ్మెంట్లలో బలాబలాలు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ సమానంగా ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.కిషన్‌రెడ్డి 376 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ తరపున బరిలో నిలిచిన మల్రెడ్డి రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. రంగారెడ్డి తిరిగి కాంగ్రెస్ తరపున పని చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఈసారి బలం చూపాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. జనగామ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 29,568 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యకు 62,024 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ పూర్తిగా స్తబ్ధుగా మారింది. నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం లేకపోవడం ప్రతికూలం. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలోనే మెజారిటీ సాధించేలా టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఆలేరు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ స్థానాన్ని 33,289 ఓట్ల మెజారిటీతో రెండోసారి గెలుచుకుంది. బూడిద భిక్షమయ్య (కాంగ్రెస్)కు 61,581 ఓట్లు వచ్చాయి. ఆయన ఇటీవల టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా ప్రభుత్వంలోని పదవుల భర్తీలో అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తుండడంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత.. పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ తెచ్చేందుకు యత్నిస్తున్నారు. భువనగిరి భువనగిరిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శేఖర్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆధిక్యం కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం ఈ సెగ్మెంట్లో భారీ మెజారిటీపై ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెంచుకునేందుకు ఎన్నికల వ్యూహం అమలు చేస్తోంది. ఇక్కడ బీజేపీ బలం చూపేందుకు ప్రయత్నిస్తోంది. నకిరేకల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య 8,259 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన ఇటీవలే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో నాయకత్వలోపం కనిపిస్తోంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ ఆధిక్యం వస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఊరు ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉంది. వ్యక్తిగత సంబంధాలతో ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్‌కు ఆధిక్యత సాధించేందుకు ఆ పార్టీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నారు. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 22,457 ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 74,504 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం తెచ్చేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. గతంలో భువనగిరి ఎంపీగా రెండుసార్లు పోటీ చేసిన అనుభవంతో కాంగ్రెస్ గెలుపు కోసం రాజగోపాల్‌రెడ్డి లోక్‌సభ సెగ్మెంట్ మొత్తంలో పర్యవేక్షణ చేస్తున్నారు. మునుగోడు, నకిరేకల్ సెగ్మెంట్లపై ప్రధానంగా దృష్టి సారించారు. టీఆర్ఎస్లో ఇక్కడ సమన్వయం కరువైంది. తుంగతుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇక్కడ వరుసగా రెండోసారి విజయం సాధించింది. ఈసారి ఇక్కడ టీఆర్ఎస్కు ఆధిక్యం పెంచాలని ఎమ్మెల్యే కిశోర్ ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి దయాకర్ లోక్‌సభ ఎన్నికల్లో బలం చూపాలని యత్నిస్తున్నారు. ఈ సెగ్మెంట్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారం పోటాపోటీగా జరుగుతోంది. కష్టాలు పట్టించుకోవాలి అవుసలి వృత్తి పెద్ద కష్టంగా మారింది. నగల దుకాణాలు పుట్టగొడుగుల్లా వస్తుండడంతో మా దగ్గర బంగారు నగలు తయారు చేయించుకునే వారే లేరు. చిన్న చిన్న పనుల కోసం మాత్రం వస్తారు. పూట గడవడమే కష్టంగా మారింది. గెలిచే వారు మా కష్టాలు పట్టించుకుంటే బాగుండు.– పర్వతపు రాజు, నక్కర్తమేడిపల్లి,ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టీఆర్ఎస్సే వత్తది ఎంపీ ఎలచ్ఛన్లో టీఆర్ఎస్సే కొట్టుకు వత్తది. ముసలోళ్లకు పింఛన్లు, ఎవసాయానికి పెట్టుబడి, ప్రతి ఓళ్లకు ఏదోరకంగా సాయం చేస్తున్నరు. ఈ ఎలచ్ఛన్లో టీఆర్ఎస్ గెలుత్తదని అందరు మాట్లాడుకుంటున్నారు. – మానెగళ్ల కనకయ్య, తరిగొప్పుల, జనగామ నియోజకవర్గం భువనగిరి లోక్సభలోనిఅసెంబ్లీ సెగ్మెంట్లు ♦ భువనగిరి ♦ ఆలేరు ♦ మునుగోడు ♦ నకిరేకల్ ♦ తుంగతుర్తి ♦ జనగామ♦ ఇబ్రహీంపట్నం 2014 లోక్‌సభఎన్నికల్లో పోలైన ఓట్లు టీఆర్ఎస్ 4,48,164 కాంగ్రెస్ 4,17,620 బీజేపీ 1,83,249 సీపీఎం 54,035 మొత్తం ఓటర్లు 14,92,251 లోక్‌సభ ఓటర్లు పురుషులు 8,18,572 స్త్రీలు 8,08,925 ఇతరులు 30 మొత్తం 16,27,527 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ తీరు టీఆర్ఎస్ 5,95,210 కాంగ్రెస్ 5,36,933 బీజేపీ 43,398 మొత్తం ఓటర్లు 14,65,768 -
భువనగిరి సీపీఐ అభ్యర్థిగా శ్రీరాములు
సాక్షి, హైదరాబాద్: భువనగిరి పార్లమెంటు స్థానానికి సీపీఐ అభ్యర్థిగా గోదా శ్రీరాములుగౌడ్‌ను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకుంది. భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా తొలుత పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిని ప్రతిపాదించగా, ఆయన పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో గోదా శ్రీరాములుతోపాటు మరో ఇద్దరి పేర్లను పార్టీ నాయకులు ప్రతిపాదించారు. వారి నుంచి శ్రీరాములు పేరును అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం శ్రీరాములు యాదాద్రి– భువనగిరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీపీఎంతో పొత్తుపైనా చర్చ సీపీఎంతో పొత్తు గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ చర్చల్లో టీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకోవాలని, బీఎల్ఎఫ్ నుంచి వైదొలగాలని సీపీఎంకు సీపీఐ సూచించింది. దీనిపై మరో రెండురోజుల్లో నిర్ణయం చెబుతామని సీపీఎం తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే చెరో రెండు స్థానాల్లో పోటీచేయాలని సీపీఎం, సీపీఐలు నిర్ణయించిన నేపథ్యంలో మిగిలిన స్థానాలకు కాంగ్రెస్‌కు మద్ధతివ్వాలని సీపీఐ నిర్ణయించింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేకవాదం, లౌకికవాద అనుకూలశక్తులతో నడవాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
చికిత్స పొందుతున్న యవకుడి మృతి
బొమ్మలరామారం :రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందాడు. వివరాలు.. మండలంలోని మాచన్‌పల్లి గ్రామ సమీపంలోని నాయకుని తండా చౌరస్తా వద్ద ఆదివారం డీసీఎం బైక్ ఢీ కొన్న ఘటనలో పులిమామిడి నవీన్ చారి(22) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నవీన్ చారి సోమవారం రాత్రి మతిచెందాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నూతన జిల్లాలకు తాత్కాలిక భవనాలు సిద్ధం
భువనగిరి : నూతన జిల్లాల ఏర్పాటుకు అవసరమైన తాత్కాలిక భవనాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర వెల్లడించారు. హరితహారంలో పాల్గొనడానికి నల్లగొండ జిల్లా భువనగిరి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ప్రతి జిల్లా నుంచి నూతన జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. జిల్లా కేంద్రం భవనాల కోసం లక్షా యాభైవేల చదరపు అడుగుల స్థలం సిద్ధంగా ఉందన్నారు. ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ , పోలీస్, వ్యవసాయ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. దశల వారీగా అన్ని విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. ప్రతి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ విభాగంలో చాలా కాలంగా అపరిష్కృతంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగాంగా సాదాబైనామాలను పరిశీలించి యజమానులను గుర్తించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తున్నామన్నారు. రెవెన్యూ రికార్డులను మాభూమి పోర్టల్‌లో అన్లైన్ చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సమస్యలు సీఎం దృష్టిలో ఉన్నాయన్నారు. ఇటీవల 25 మంది తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. ఇంకా మరికొంత మందికి పదోన్నతి కల్పిస్తామన్నారు. వీఆర్వోల పదోన్నతుల ఫైలు పెండింగ్‌లో ఉందన్నారు. ఏసీబీకి పట్టుబడ్డ కేసుల్లో తానేమి రక్షించే సహాయం చేయలేనని స్పష్టం చేశారు. విధినిర్వహణలో సక్రమంగా ఉంటే రివార్డులు, పదోన్నతులు ఇస్తామన్నారు. ఆయన వెంట భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి ఉన్నారు. -
వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందంటూ..
నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. అయితే, వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. బూధాన్ పోచంపల్లి మండలం కప్రాయిపల్లికి చెందిన బి.రాములమ్మ (35) అనారోగ్యంతో సోమవారం రాత్రి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందగా... వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందని, తమకు న్యాయం చేయాలని ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద డిమాండ్ చేస్తున్నారు. -
ఏటా.. నష్టమే!
- భువనగిరి డివిజన్‌ను వీడని వడగండ్ల బీభత్సం - శని, ఆదివారాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం - వరి, మామిడి, నిమ్మతోటలకు తీవ్రనష్టం - సకాలంలో ఆదుకోని ప్రభుత్వం భువనగిరి, న్యూస్‌లైన్ : ప్రకృతి వైపరీత్యానికి భువనగిరి డివిజన్ రైతాంగం కకావికలం అవుతోంది. ఏటేటా రబీ సీజన్ పంట చేతికి వచ్చే ఏప్రిల్, మే నెలలో కురుస్తున్న వడగండ్ల వర్షాలతో వరి, మామిడి, సపోట, నిమ్మతోటలు దెబ్బతింటున్నాయి. ఇన్ని కష్టాలను భరించి పండించిన పంటను అమ్ముకుందామని మార్కెట్‌కు వస్తే.. అక్కడా రక్షణ కరువైంది. వర్షానికి కొట్టుకుపోతుండడంతో రైతులు కోలుకోలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మాత్రం అందడం లేదు. గత నెల 8, 9 తేదీల్లో డివిజన్లోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూ రు, గుండాల, ఆత్మకూర్.ఎం, ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల్లో వడగండ్ల వర్షాలకు సుమారు 17వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఈ నెల 2వ తేదీన కురిసిన వడగండ్లతో భువనగిరి పట్ణణం చందుపట్ల తదితర గ్రామాల్లో నష్టం వాటిల్లింది. వరిచేలలో గట్టిగింజ రాలిపోయి తాలు మాత్రమే మిగిలింది. మామిడితోటలదీ ఇదే పరిస్థితి వడగండ్లు, ఈదురుగాలుల ధాటికి డివిజన్లోని 1800 ఎకరాల్లో మామిడితోటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే మొత్తంగా 10 వేల ఎకరాలలో మామిడి తోటలకు నష్టం వాటి ల్లినట్టు రైతులు తెలుపుతున్నారు. ఈదురుగాలులు వీయడం వల్ల పిందెలు, కాయలు రాలిపోయాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన తోటలు కాత రాకముందే నష్టాల పాలు కావడంతో పండ్లు అమ్ముకోవాల్సిన రైతు దిక్కుతోచని స్థితిలో పడుతున్నాడు. తోట లను కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమత మ వుతున్నారు. నిమ్మరైతులదీ ఇదే పరిస్థితి. కాయలు రాలిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. హెక్టార్‌కు రూ.25వేల పెట్టుబడి.. వరిసాగు రైతులకు హెక్టార్‌కు సుమారు రూ. 25వేల వరకు పెట్టుబడి అవుతుంది. తీరా పంట కోతకు వచ్చే సమయంలో వర్షార్పణం కావడంతో తీరని నష్టం మిగులుతోంది. అధికారులు యాభైశాతంపైగా నష్టం వాటిల్లిందని లెక్క రాస్తే హెక్టార్‌కు రూ.10 వేల పరిహారం ఇస్తారు. అది ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు రైతు చేతికందుతుందో తెలి యని పరిస్థితి. రెండేళ్ల క్రితం జరిగిన నష్టానికి ఇంతవరకు పరిహారం అందలేదు. ఇప్పుడు జరిగిన నష్టానికి ఎన్ని నెలలు పడుతుందోనని రైతులు వాపోతున్నారు. రైతులు పంట రుణాలు తీసుకునే సమయంలో పంటల బీమా పథకం కింద ప్రీమియం తీసుకుంటున్నారు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా చెల్లించడంలేదు. మార్కెట్లో పరిస్థితులు దారుణం.. ఆరుగాల శ్రమించి అష్టకష్టాలు పడి అమ్ముకుందామని మార్కెట్‌కు తెచ్చిన ధాన్యానికి సరైన రక్షణ లేకుండా పోయింది. ఈనెల 2న భువనగిరి మార్కెట్లో కురిసిన వర్షానికి సుమారు 100 బస్తాల ధాన్యం కొట్టుకుపోయింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి రైతులకు ఎలాంటి అవకాశమూ లేకుండా పోయింది. మార్కెట్ యార్డులో సరైన వసతులు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.