భువనగిరి.. ఎవరి జాగీరు? | Bhuvangiri Constituency Review on Lok Sabha Election | Sakshi
Sakshi News home page

భువనగిరి.. ఎవరి జాగీరు?

Published Fri, Apr 5 2019 8:08 AM | Last Updated on Fri, Apr 5 2019 8:08 AM

Bhuvangiri Constituency Review on Lok Sabha Election - Sakshi

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం విభిన్న ప్రాంతాల కలబోత. ఉత్తర – దక్షిణ తెలంగాణ ప్రాంతాలు కలగలిసిన ఏకైక నియోజకవర్గం. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలలో ఈ సెగ్మెంట్‌ విస్తరించి ఉంది. యాదాద్రి, కొమురవెల్లి పుణ్యక్షేత్రాలు దీని పరిధిలోనే ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఈ లోక్‌సభ స్థానం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్, 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి స్థానంలో పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఆర్‌ఎస్‌ తరపున సిట్టింగ్‌ లోక్‌సభ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పి.వి.శ్యాంసుందర్, సీపీఐ తరఫున గోద శ్రీరాములు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపుపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో విజయం ఖాయమని టీఆర్‌ఎస్‌ అంచనా. సంప్రదాయ ఓటు బ్యాంకు, అభ్యర్థికి ఉన్న సంబంధాలతో విజయం దక్కుతుందని కాంగ్రెస్‌ ఆశాభావంతో ఉంది. గట్టి పోటీ ఇచ్చి పట్టు నిలుపుకోవాలని బీజేపీ, సీపీఎం ప్రయత్నిస్తున్నాయి.
-గ్రౌండ్‌ రిపోర్టు-పిన్నింటి గోపాల్‌

టీఆర్‌ఎస్‌: అన్నీ అనుకూలాంశాలే
రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ, ఇబ్రహీంపట్నం స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. అయితే కాంగ్రెస్‌ నుంచి గెలిచిన నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఆరు సెగ్మెంట్లలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండడం టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అంశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్‌ ఇమేజ్‌ అదనపు బలం కానున్నాయి. అధికార పార్టీగా గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉండడం టీఆర్‌ఎస్‌కు అనుకూలించనుంది. భువనగిరి సెగ్మెంట్‌లో బీసీ వర్గాల ప్రభావం గణనీయంగా ఉంది. అధికార పార్టీ అభ్యర్థి ఈ వర్గానికి చెందిన వారు కావడం టీఆర్‌ఎస్‌కు కలిసొస్తోంది.

అభివృద్ధిలో పరుగులు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో భువనగిరి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లతో సాగునీరు అందిస్తాం. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను సాధించి త్వరలో ప్రారంభించబోతున్నాం. భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం, పాస్‌పోర్టు కేంద్రం, నకిరేకల్‌లో డ్రైపోర్టు, జాతీయ రహదారుల అభివృద్ధి, ఇబ్రహీంపట్నంలో ఏరోస్పేస్‌ పార్క్‌ వంటి అభివృద్ధి పనులు చేపట్టాం. ఎన్నికల్లో కాంగ్రెస్‌ మరోసారి చిత్తుగా ఓడిపోవడం ఖాయం. కేసీఆర్‌ నాయకత్వంలో 16 ఎంపీ సీట్లు గెలుస్తాం.– బూర నర్సయ్యగౌడ్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి

 కాంగ్రెస్‌: ఆశలు.. అంచనాలు
గ్రామ స్థాయిలో పార్టీకి సంస్థాగతంగా ఓటు బ్యాంకు ఉంది. టీఆర్‌ఎస్‌ అనుకూల పవనాల్లోనూ ఇటీవలి ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని నకిరేకల్, మునుగోడు స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచింది. ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓడిపోయారు. కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరారు. కోమటిరెడ్డి సోదరుల సొంత నియోజకవర్గం నకిరేకల్‌ కావడంతో ఎన్నికల్లో తమకు ఈ సెగ్మెంట్‌లో అనుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009లో ఇక్కడ గెలిచారు. 2014లో ఓడిపోయారు. రెండుసార్లు పోటీ చేసిన అనుభవంతో భువనగిరిలోని గ్రామస్థాయిలో సమన్వయం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్‌కు కొంత బలంగా కనిపిస్తోంది. అయితే నియోజకవర్గ స్థాయి నేతలు ఎన్నికలపై పెద్దగా పట్టుదలగా లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది.

ప్రశ్నించే గొంతుకనవుతా..
భువనగిరి ప్రజలు గెలిపిస్తే లోక్‌సభలో తెలంగాణ గొంతుకనవుతా. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశా. తెలంగాణ కోసం 14 రోజులు దీక్ష చేశా. నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే పోటీ చేస్తున్నా. సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ డమ్మీ. కేసీఆర్, కేటీఆర్‌ ముందు ఏమీ మాట్లాడలేరు. ఆయనకు ఆపరేషన్‌లు చేయడంలో అనుభవం ఉంది కానీ అభివృద్ధి చేయడంలో లేదు. నిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయడంలో విఫలమయ్యారు. భువనగిరిలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, బస్సులు ఆగవు. మంత్రి జగదీశ్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో చెల్లకుండా పోయి సూర్యాపేటలో చెల్లినట్లే నేను భువనగిరిలో చెల్లుతాను.– కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి

బీజేపీ: పట్టణప్రాంతాలపై దృష్టి
కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభావంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఎన్నికల్లో గణనీయ సంఖ్యలో ఓట్లు పొందాలని భావిస్తోంది. భువనగిరి మున్సిపాలిటీలో విజయం సాధించిన కాషాయ పార్టీ.. సెగ్మెంట్‌లోని పట్టణ ప్రాంతాల్లో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 1,83,249 ఓట్లు దక్కాయి. వ్యక్తిగతంగా బీజేపీ అభ్యర్థికి ఇక్కడ సానుకూలత ఉంది. మూసీ నది ప్రక్షాళన ఉద్యమం పార్టీకి అనుకూలంగా మారొచ్చని అంచనా. అయితే గ్రామస్థాయిలో సంస్థాగత నిర్మాణం లేదు. పార్టీలోని ఇతర సీనియర్‌ నేతలెవరూ అభ్యర్థికి సరిగా సహకరించడంలేదు. రాష్ట్ర స్థాయి నేతలు సైతం ప్రచారానికి రావడం లేదు.

యువతకు ఉపాధి..అందరికీ విద్య, వైద్యం
ప్రధాని మోదీ సాయంతో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. సాగునీటికి పెద్దపీట వేస్తాం. ప్రాజెక్టులకు అధిక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తాం. నియోజకవర్గంలోని ఐదు లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో నిండి ఉన్న నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాం. ఐటీ కారిడార్‌తో ఉద్యోగ అవకాశాలు పెంపొందిస్తాం. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసి పేద, మధ్య, ఉన్నత వర్గాలకు వాటిని అందుబాటులోకి తెస్తాం. నరేంద్రమోదీ మరోసారి ప్రధాన మంత్రి కావడం ఖాయం. బీజేపీ గెలుపుతో అభివృద్ధి మరింత సాధ్యమవుతుంది.– పి.వి.శ్యాంసుందర్‌రావు, బీజేపీ అభ్యర్థి

సీపీఐ: పూర్వ వైభవానికి యత్నం
గతంలో ఈ సెగ్మెంట్‌లో ఆధిక్యత చూపిన కమ్యూనిస్టు పార్టీలు పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్నాయి. సీపీఎం పొత్తుతో సీపీఐ తరపున         గోద శ్రీరాములు పోటీ చేస్తున్నారు. మునుగోడు, ఆలేరు, నకిరేకల్, జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో సంప్రదాయంగా ఉన్న బలంపై రెండు పార్టీలు నమ్మకంతో ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థికి 54,035 ఓట్లు వచ్చాయి. అప్పట్లో సీపీఐ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. తాజా ఎన్నికల్లో బలం చూపాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

పేదలే మమ్మల్ని గెలిపిస్తారు
నదీ జలాల సాధనే ప్రధాన సమస్య. సీపీఐ కొన్నేళ్లుగా నదీజలాల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తోంది. భూపోరాటాలు చేసి సాధించుకున్న వేలాది ఎకరాలు సాగునీరు లేక బీడుపడ్డాయి. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు వలస పోతున్నారు. కమ్యూనిస్టులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజీలేని పోరాటాలు చేసి పేదలకు ఆనాటి నుంచి అండగా నిలిచారు. వారే మమ్మల్ని గెలిపిస్తారు.
– గోద శ్రీరాములు, సీపీఐ అభ్యర్థి

అసెంబ్లీ సెగ్మెంట్లలో బలాబలాలు
ఇబ్రహీంపట్నం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ సమానంగా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.కిషన్‌రెడ్డి 376 ఓట్ల తేడాతో  గెలిచారు. కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో బీఎస్పీ తరపున బరిలో నిలిచిన మల్‌రెడ్డి రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. రంగారెడ్డి తిరిగి కాంగ్రెస్‌ తరపున పని చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. ఈసారి బలం చూపాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

జనగామ
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 29,568 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యకు 62,024 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ పూర్తిగా స్తబ్ధుగా మారింది. నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం లేకపోవడం ప్రతికూలం. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలోనే మెజారిటీ సాధించేలా టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది.

ఆలేరు
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఈ స్థానాన్ని 33,289 ఓట్ల మెజారిటీతో రెండోసారి గెలుచుకుంది. బూడిద భిక్షమయ్య (కాంగ్రెస్‌)కు 61,581 ఓట్లు వచ్చాయి. ఆయన ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా ప్రభుత్వంలోని పదవుల భర్తీలో అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ భావిస్తుండడంతో.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొంగిడి సునీత.. పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

భువనగిరి
భువనగిరిలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శేఖర్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆధిక్యం కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈ సెగ్మెంట్‌లో భారీ మెజారిటీపై ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ఓటింగ్‌ శాతం పెంచుకునేందుకు ఎన్నికల వ్యూహం అమలు చేస్తోంది. ఇక్కడ బీజేపీ బలం చూపేందుకు ప్రయత్నిస్తోంది.

నకిరేకల్‌
అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య 8,259 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో నాయకత్వలోపం కనిపిస్తోంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి భారీ ఆధిక్యం వస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఊరు ఈ సెగ్మెంట్‌ పరిధిలోనే ఉంది. వ్యక్తిగత సంబంధాలతో ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యత సాధించేందుకు ఆ పార్టీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నారు.  

మునుగోడు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 22,457 ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 74,504 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం తెచ్చేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. గతంలో భువనగిరి ఎంపీగా రెండుసార్లు పోటీ చేసిన అనుభవంతో కాంగ్రెస్‌ గెలుపు కోసం రాజగోపాల్‌రెడ్డి లోక్‌సభ సెగ్మెంట్‌ మొత్తంలో పర్యవేక్షణ చేస్తున్నారు. మునుగోడు, నకిరేకల్‌ సెగ్మెంట్లపై ప్రధానంగా దృష్టి సారించారు. టీఆర్‌ఎస్‌లో ఇక్కడ సమన్వయం కరువైంది.

తుంగతుర్తి
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇక్కడ వరుసగా రెండోసారి విజయం సాధించింది. ఈసారి ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం పెంచాలని ఎమ్మెల్యే కిశోర్‌ ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి దయాకర్‌ లోక్‌సభ ఎన్నికల్లో బలం చూపాలని యత్నిస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రచారం పోటాపోటీగా జరుగుతోంది.

కష్టాలు పట్టించుకోవాలి
అవుసలి వృత్తి పెద్ద కష్టంగా మారింది. నగల దుకాణాలు పుట్టగొడుగుల్లా వస్తుండడంతో మా దగ్గర బంగారు నగలు తయారు చేయించుకునే వారే లేరు. చిన్న చిన్న పనుల కోసం మాత్రం వస్తారు. పూట గడవడమే కష్టంగా మారింది. గెలిచే వారు మా కష్టాలు పట్టించుకుంటే బాగుండు.– పర్వతపు రాజు, నక్కర్తమేడిపల్లి,ఇబ్రహీంపట్నం నియోజకవర్గం

టీఆర్‌ఎస్సే వత్తది
ఎంపీ ఎలచ్ఛన్లో టీఆర్‌ఎస్సే కొట్టుకు వత్తది. ముసలోళ్లకు పింఛన్లు, ఎవసాయానికి పెట్టుబడి, ప్రతి ఓళ్లకు ఏదోరకంగా సాయం చేస్తున్నరు. ఈ ఎలచ్ఛన్లో టీఆర్‌ఎస్‌ గెలుత్తదని అందరు మాట్లాడుకుంటున్నారు.
– మానెగళ్ల కనకయ్య, తరిగొప్పుల, జనగామ నియోజకవర్గం

భువనగిరి లోక్‌సభలోనిఅసెంబ్లీ సెగ్మెంట్లు

భువనగిరి ఆలేరు మునుగోడు
నకిరేకల్‌ తుంగతుర్తి
జనగామఇబ్రహీంపట్నం

2014 లోక్‌సభఎన్నికల్లో పోలైన ఓట్లు
టీఆర్‌ఎస్‌    4,48,164
కాంగ్రెస్‌    4,17,620
బీజేపీ    1,83,249
సీపీఎం     54,035
మొత్తం ఓటర్లు    14,92,251

లోక్‌సభ ఓటర్లు
పురుషులు 8,18,572
స్త్రీలు         8,08,925
ఇతరులు   30
మొత్తం 16,27,527

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌ తీరు
టీఆర్‌ఎస్‌    5,95,210
కాంగ్రెస్‌     5,36,933
బీజేపీ    43,398
మొత్తం ఓటర్లు    14,65,768

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement