ఏటా.. నష్టమే!
- భువనగిరి డివిజన్‌ను వీడని వడగండ్ల బీభత్సం
- శని, ఆదివారాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
- వరి, మామిడి, నిమ్మతోటలకు తీవ్రనష్టం
- సకాలంలో ఆదుకోని ప్రభుత్వం
భువనగిరి, న్యూస్‌లైన్ : ప్రకృతి వైపరీత్యానికి భువనగిరి డివిజన్ రైతాంగం కకావికలం అవుతోంది. ఏటేటా రబీ సీజన్ పంట చేతికి వచ్చే ఏప్రిల్, మే నెలలో కురుస్తున్న వడగండ్ల వర్షాలతో వరి, మామిడి, సపోట, నిమ్మతోటలు దెబ్బతింటున్నాయి. ఇన్ని కష్టాలను భరించి పండించిన పంటను అమ్ముకుందామని మార్కెట్‌కు వస్తే.. అక్కడా రక్షణ కరువైంది. వర్షానికి కొట్టుకుపోతుండడంతో రైతులు కోలుకోలేకపోతున్నారు.
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మాత్రం అందడం లేదు. గత నెల 8, 9 తేదీల్లో డివిజన్‌లోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూ రు, గుండాల, ఆత్మకూర్.ఎం, ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల్లో వడగండ్ల వర్షాలకు సుమారు 17వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఈ నెల 2వ తేదీన కురిసిన వడగండ్లతో భువనగిరి పట్ణణం చందుపట్ల తదితర గ్రామాల్లో నష్టం వాటిల్లింది. వరిచేలలో గట్టిగింజ రాలిపోయి తాలు మాత్రమే మిగిలింది.
మామిడితోటలదీ ఇదే పరిస్థితి
వడగండ్లు, ఈదురుగాలుల ధాటికి డివిజన్‌లోని 1800 ఎకరాల్లో మామిడితోటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే మొత్తంగా 10 వేల ఎకరాలలో మామిడి తోటలకు నష్టం వాటి ల్లినట్టు రైతులు తెలుపుతున్నారు. ఈదురుగాలులు వీయడం వల్ల పిందెలు, కాయలు రాలిపోయాయి.
వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన తోటలు కాత రాకముందే నష్టాల పాలు కావడంతో పండ్లు అమ్ముకోవాల్సిన రైతు దిక్కుతోచని స్థితిలో పడుతున్నాడు. తోట లను కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమత మ వుతున్నారు. నిమ్మరైతులదీ ఇదే పరిస్థితి. కాయలు రాలిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.
హెక్టార్‌కు రూ.25వేల పెట్టుబడి..
వరిసాగు రైతులకు హెక్టార్‌కు సుమారు రూ. 25వేల వరకు పెట్టుబడి అవుతుంది. తీరా పంట కోతకు వచ్చే సమయంలో వర్షార్పణం కావడంతో తీరని నష్టం మిగులుతోంది. అధికారులు యాభైశాతంపైగా నష్టం వాటిల్లిందని లెక్క రాస్తే హెక్టార్‌కు రూ.10 వేల పరిహారం ఇస్తారు. అది ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు రైతు చేతికందుతుందో తెలి యని పరిస్థితి.
రెండేళ్ల క్రితం జరిగిన నష్టానికి ఇంతవరకు పరిహారం అందలేదు. ఇప్పుడు జరిగిన నష్టానికి ఎన్ని నెలలు పడుతుందోనని రైతులు వాపోతున్నారు. రైతులు పంట రుణాలు తీసుకునే సమయంలో పంటల బీమా పథకం కింద ప్రీమియం తీసుకుంటున్నారు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా చెల్లించడంలేదు.
మార్కెట్‌లో పరిస్థితులు దారుణం..
ఆరుగాల శ్రమించి అష్టకష్టాలు పడి అమ్ముకుందామని మార్కెట్‌కు తెచ్చిన ధాన్యానికి సరైన రక్షణ లేకుండా పోయింది. ఈనెల 2న భువనగిరి మార్కెట్‌లో కురిసిన వర్షానికి సుమారు 100 బస్తాల ధాన్యం కొట్టుకుపోయింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి రైతులకు ఎలాంటి అవకాశమూ లేకుండా పోయింది. మార్కెట్ యార్డులో సరైన వసతులు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.