సాక్షి, విశాఖపట్నం: మార్కెట్‌ను మామిడి పండ్లు ముంచెత్తుతున్నాయి. నగరంలో రోడ్లు, వీధుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. పైగా చౌకధరకే లభిస్తున్నాయి. అంతేకాదు.. గతం కంటే రుచి, నాణ్యతతో ఉంటున్నాయి. తొలుత వీటి ధర ప్రియంగా ఉండడమే కాదు.. పులుపు, చప్పదనంతో రుచి తక్కువగా ఉండేవి.
ఆకర్షణీయమైన రంగుకు ఆకర్షితులైన మామిడి ప్రియులు వీటిని కొనుగోలు చేసి పెదవి విరిచే వారు. కానీ పక్షం రోజుల నుంచి మార్కెట్లోకి మంచి రుచి కలిగిన మామిడి పండ్లు వస్తున్నాయి. వీటి ధర కూడా అందుబాటులోనే ఉంటోంది. నెల కిందట కిలో రూ.60–70 ధర పలికిన మామిడి పండ్లు.. ఇప్పుడు రూ.25–30కే దొరుకుతున్నాయి.
ప్రస్తుతం బంగినపల్లి, సువర్ణరేఖ, రసాలు వంటి పండ్లు మూడు, నాలుగు కిలోలు రూ.100కే లభ్యమవుతున్నాయి. మరికొన్ని రకాలైతే రూ.100కు ఐదారు కిలోలు చొప్పున విక్రయిస్తున్నారు. రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసి కొందరు, తోపుడు బండ్లపై మరికొందరు, పోగులుగా పెట్టి ఇంకొందరు ఎక్కడికక్కడే అమ్ముతున్నారు. చౌకగా లభిస్తున్న మామిడి పండ్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.
ఈ ఏడాది ఎగుమతులు లేకే..
ఏటా ఈ ప్రాంతంలో పండిన మామిడి పండ్లు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. ఎగుమతి చేయగా మిగిలిన పండ్లను స్థానిక మార్కెట్లకు తరలిస్తుంటారు. వాస్తవానికి నిరుడు, ఈ ఏడాది మామిడి పంట ఆశాజనకంగా లేదు. 50 శాతానికి మించి దిగుబడి లేదు. మామిడి దిగుబడి తగ్గిన సంవత్సరం ధరలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాపు తగ్గినా ధర మాత్రం సరసంగానే ఉంటోంది.
ఎగుమతులు క్షీణించడం వల్లే ఈ ఏడాది మామిడి ధర తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. విశాఖ నగరంలో మామిడి పండ్లను విక్రయించే వారు కాకినాడ జిల్లా తుని, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తదితర ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నారు. 20 కిలోల మామిడి పండ్లు రూ.150–200 కొని నగరంలో కిలో రూ.20–30కి విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం మామిడి పండ్లు పక్వానికి వచ్చిన కావడం వల్ల రుచిగా ఉంటున్నాయని, ధర కూడా అందుబాటులో ఉండడం వల్ల వీటి విక్రయాలు బాగున్నాయని అక్కయ్యపాలెంలో రాజు అనే అమ్మకందారుడు చెప్పాడు. తాను రోజుకు 400–500 కిలోలు విక్రయిస్తున్నానని, గతంలో కిలో, రెండు కిలోలు తీసుకెళ్లిన వారిప్పుడు రెట్టింపునకు పైగా కొనుగోలు చేస్తున్నారని తెలిపాడు. మరికొద్ది రోజుల పాటు చౌక ధరలే కొనసాగుతాయని, నెలాఖరు వరకు మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment