నూతన జిల్లాలకు తాత్కాలిక భవనాలు సిద్ధం
నూతన జిల్లాలకు తాత్కాలిక భవనాలు సిద్ధం
Published Fri, Jul 22 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
భువనగిరి : నూతన జిల్లాల ఏర్పాటుకు అవసరమైన తాత్కాలిక భవనాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర వెల్లడించారు. హరితహారంలో పాల్గొనడానికి నల్లగొండ జిల్లా భువనగిరి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ప్రతి జిల్లా నుంచి నూతన జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. జిల్లా కేంద్రం భవనాల కోసం లక్షా యాభైవేల చదరపు అడుగుల స్థలం సిద్ధంగా ఉందన్నారు. ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ , పోలీస్, వ్యవసాయ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. దశల వారీగా అన్ని విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. ప్రతి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ విభాగంలో చాలా కాలంగా అపరిష్కృతంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగాంగా సాదాబైనామాలను పరిశీలించి యజమానులను గుర్తించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తున్నామన్నారు. రెవెన్యూ రికార్డులను మాభూమి పోర్టల్‌లో అన్‌లైన్ చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సమస్యలు సీఎం దృష్టిలో ఉన్నాయన్నారు. ఇటీవల 25 మంది తహసీల్దార్‌లకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. ఇంకా మరికొంత మందికి పదోన్నతి కల్పిస్తామన్నారు. వీఆర్వోల పదోన్నతుల ఫైలు పెండింగ్‌లో ఉందన్నారు. ఏసీబీకి పట్టుబడ్డ కేసుల్లో తానేమి రక్షించే సహాయం చేయలేనని స్పష్టం చేశారు. విధినిర్వహణలో సక్రమంగా ఉంటే రివార్డులు, పదోన్నతులు ఇస్తామన్నారు. ఆయన వెంట భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి ఉన్నారు.
Advertisement