కొండమడుగు మెట్టు వద్ద ప్రమాదకరంగా జాతీయ రహదారి
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో నిర్వహించిన ‘సాక్షి రోడ్డు షో’లో భిన్న దృశ్యాలు కనిపించాయి. దశాబ్దాల తరబడి పాలకులు చేసిన నిర్లక్ష్యానికి ఆనవాళ్లుగా.. ఎటు చూసినా బీడుబారిన భూములే. కనుచూపు మేరలో కనిపించని పచ్చదనం. వందల ఎకరాల్లో పంటల సాగుకు నోచుకోని నేల. కోరలు చాచిన కరువు. ఎండిపోయిన చెరువులు, నోళ్లు తెరిచి బీళ్లు... ఇవీ భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 163వ జాతీయ రహదారి వెంట కనిపించిన దృశ్యాలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మినహా అంతకుముందు ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని పలువురు చెప్పారు. వైఎస్ పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారని, సాగునీటి కల్పనకు కృషి చేశారని.. నాటి పనులను ప్రస్తుత టీఆర్‌ఎస్ సర్కారు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. బీబీనగర్ మండలం కేపాల్ నుంచి జనగామ మండలం యశ్వంతాపూర్ వరకు నిర్వహించిన రోడ్డు షోలో.. అభివృద్ధికి చిరునామాగా నిలవాల్సిన జాతీయ రహదారి వెంట కరవు తాండవించడం కనిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కేపాల్ నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, జనగామ వరకు జాతీయ రహదారిపై వివిధ వర్గాల ప్రజలు వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే..- సాక్షి, నెట్‌వర్క్
భిన్నాభిప్రాయాలు
లోక్‌సభ ఎన్నికలపై అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన రోడ్డు షోలో.. రైతులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, మహిళలతో పాటు పలువురిని పలకరించింది ‘సాక్షి’ బృందం. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు?, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది?, దేశ భద్రతకు బీజేపీ తీసుకుంటున్న చర్యలపై మీ స్పందన ఏమిటి? తదితర ప్రశ్నలను వేసింది. ‘ఇవి లోక్‌సభ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీలకే అవకాశమివ్వాలని, జాతీయ పార్టీలే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంద’ని పలువురు చెప్పా రు. కొందరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసిన టీఆర్‌ఎస్‌కే మద్దతునిస్తామని చెప్పగా, ఆ పార్టీ 16 సీట్లు గెలుచుకుని కేంద్రంలో కీలకంగా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
4కి.మీ. కొండమడుగు మెట్టు నుంచి గూడూరు టోల్‌ప్లాజా
రోడ్లు మెరుగుపరిచే వారికే..
బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు నుంచి గూడూరు టోల్‌ప్లాజా వరకు 4 కిలోమీటర్ల మేర సాగిన రోడ్డుషోలో.. ప్రధానంగా మండలంలోని కొండమడుగు మెట్టు, బీబీనగర్‌లోని ప్రధాన చౌరస్తాల వద్ద అండర్ పాస్‌లు లేని విషయాన్ని పలువురు ‘సాక్షి’ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యపై కొన్నేళ్లుగా అధికారులకు విన్నవిస్తున్నా స్పందన లేదని, కాబట్టి ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటెయ్యాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కొందరు చెప్పారు. ఆలేరులో బాహుపేట నుంచి జనగామ జిల్లా పెంబర్తి కమాన్ వరకు జాతీయ రహదారిలో ఇది చాలా పెద్ద సమస్య. అండర్ పాస్‌లు లేకపోవడంతో ప్రధాన రహదారుల గుండా వాహనదారులు నేరుగా దాటుతూ, ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. మండల పరిధిలోని జాతీయ రహదారి అంతటా ఇదే పరిస్థితి. ఈ సమస్యపై పలువురు మాట్లాడుతూ సత్వరమే దీనిని పరిష్కరించాలని కోరారు.
ఒడిదుడుకుల ప్రయాణం..
భువనగిరి మండలం జమ్మాపురం నుంచి వరంగల్ – హైదరాబాద్ రహదారి మార్గంలో పగిడిపల్లి వరకు 9 కిలోమీటర్ల ప్రయాణంలో పలువురిని పలకరించినపుడు పార్టీలు, రాజకీయాల గురించి కాకుండా తమ రోడ్డు సమస్యను ప్రస్తావించారు. ‘ఈ రహదారికి ఇరుపక్కలా రాయగిరి, గచ్చుబావి, భువనగిరి ప్రాంతాలు ఉన్నాయి. ఈ రహదారి పొడవునా ఉన్న గచ్చుబావి నుంచి టీచర్స్ కాలనీ వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు లేదు. ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినప్పటికీ ప్రమాదపు అంచుల్లో ప్రయాణిస్తున్నట్లే ఉంటోంది. రామచంద్రాపురం చౌరస్తా వద్ద బ్రిడ్జి లేకపోవడంతో ఈ రోడ్డు మార్గం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు’ అని పలువురు తెలిపారు. ఈ సమస్యను దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోలేదని పలువురు వాపోయారు.
9కి.మీ.జమ్మాపురం నుంచి పగిడిపల్లి వరకు హామీలను బట్టి ఓటు
రోడ్డు, మంచినీరు తదితర సమస్యలను పరిష్కరిస్తామని ఎవరు గట్టిగా హామీ ఇస్తే ఓటు వాళ్లకే వేస్తాం. తాళ్లగూడెం గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు సరిగా లేదు. వెంచర్ మధ్య నుంచి వెళ్లడానికి వాళ్లు అనుమతివ్వడం లేదు. జాతీయ రహదారి దాటడానికి అండర్ పాస్ బ్రిడ్జి కట్టాలి– ఊర్మిళ, తాళ్లగూడెం
టీఆర్‌ఎస్–కాంగ్రెస్ మధ్యే పోటీ..
‘సాగునీటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాం.
రిజర్వాయర్ల నిర్మాణం జరిగినప్పటికీ చెరువుల్లోకి నీళ్లు రావడం లేదు. బోర్లపైనే ఆధారపడాల్సి వస్తుంది.మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నప్పటికి నల్లా కనెక్షన్లు అన్ని ఇళ్లకూ ఇవ్వలేదు. ఏ అర్హత ప్రకారంగా నల్లా కనెక్షన్లు ఇచ్చారో తెలియడం లేదు. నల్లాలో వస్తున్న నీళ్లు కూడా తాగడానికి పనికి రావడం లేదు. మాకు నీటి సమస్య మాత్రం తీరడం లేదు’ అని భువనగిరి పట్టణవాసులు స్పందించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం నిరుపేదల్లో ఆశలు రేకెత్తిస్తోందని, కాబట్టి దేశవ్యాప్తంగా ఇది పని చేస్తే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే పేదలకు మేలు జరిగే అవకాశాలున్నాయని అన్నారు.భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్– టీఆర్‌ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేం’ అని ఇంకొందరు చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తమ రచ్చబండ చర్చలను బట్టి తెలుస్తోందని కొందరు వృద్ధులు తెలిపారు.
నోట్ల రద్దు కష్టాలు అన్నీఇన్నీ కావు..
కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తమకు ఎలాంటి సంక్షేమ పథకాలనూ అందించలేదని చిరు వ్యాపారులు వాపోయారు. ముద్ర రుణాలు ఆర్భాటపు ప్రకటనే తప్ప ఆచరణలో ఎవరికీ రుణాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ప్రత్యేకించి పెద్ద నోట్ల రద్దు నాటి కష్టాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నామని కొందరు గుర్తుచేశారు. ఏ వస్తువుకు జీఎస్టీ పడుతుందో, ఏ వస్తువుకు జీఎస్టీ పడడం లేదో స్పష్టంగా తెలియక మోసపోతున్నామని సామాన్య ప్రజలు వాపోతున్నారు. జీఎస్టీ మొత్తానికి వ్యాపారులు పేదలను కొట్టడానికే ఉపయోగపడుతోందని, వారిని కేంద్రం నియంత్రించలేకపోతోందని అన్నారు.
నోట్ల రద్దు అర్థరహితం
తెలంగాణలో టీఆర్‌ఎస్ బలంగా ఉంది. ప్రతిపక్షాలు పూర్తిగా బలహీన పడ్డాయి. కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన వారుటీఆర్‌ఎస్‌లో చేరడం ప్రజాతీర్పునువ్యతిరేకించడమే. ఇక మోదీ విషయానికి వస్తే నోట్ల రద్దు వంటి అర్థరహితమైన నిర్ణయాలు, నియంతృత్వం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. కాంగ్రెస్ పాలనలోనే అంతో ఇంతో నయం.
మార్పు ఖాయం
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన మార్పు చోటు చేసుకోనుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడి ప్రజలు కూడా కాంగ్రెస్ వైపేమొగ్గు చూపుతున్నారు. నిజామాబాద్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు వందల సంఖ్యలోనామినేషన్లు వేశారు. ఆంజనేయులు, బీబీనగర్
సుస్థిర పాలన కోసం..
కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తుంది. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం. కేంద్రంలో సుస్థిర పాలన అందాలంటే జాతీయ పార్టీలకే ఓటేయాలి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన బాగుంది. ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందేలా కృషి చేస్తున్నారు సీఎం. సాగునీటి కోసం గతంలో ఏ ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకోలేదు.కంటాల ప్రభాకర్, బాహుపేట
Comments
Please login to add a commentAdd a comment