
సాక్షి, హైదరాబాద్: భువనగిరి పార్లమెంటు స్థానానికి సీపీఐ అభ్యర్థిగా గోదా శ్రీరాములుగౌడ్‌ను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకుంది. భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా తొలుత పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిని ప్రతిపాదించగా, ఆయన పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో గోదా శ్రీరాములుతోపాటు మరో ఇద్దరి పేర్లను పార్టీ నాయకులు ప్రతిపాదించారు. వారి నుంచి శ్రీరాములు పేరును అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం శ్రీరాములు యాదాద్రి– భువనగిరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
సీపీఎంతో పొత్తుపైనా చర్చ
సీపీఎంతో పొత్తు గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ చర్చల్లో టీఆర్‌ఎస్, బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకోవాలని, బీఎల్‌ఎఫ్ నుంచి వైదొలగాలని సీపీఎంకు సీపీఐ సూచించింది. దీనిపై మరో రెండురోజుల్లో నిర్ణయం చెబుతామని సీపీఎం తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే చెరో రెండు స్థానాల్లో పోటీచేయాలని సీపీఎం, సీపీఐలు నిర్ణయించిన నేపథ్యంలో మిగిలిన స్థానాలకు కాంగ్రెస్‌కు మద్ధతివ్వాలని సీపీఐ నిర్ణయించింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేకవాదం, లౌకికవాద అనుకూలశక్తులతో నడవాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment