- తొలిరోజు 8 వేల కేంద్రాల్లో..
- పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
- చీరల నాణ్యతపై పలు జిల్లాల్లో నిరసన
- నాసిరకం చీరలు పంపిణీ చేయలేదన్న
- చేనేత శాఖ ఎండీ శైలజా రామయ్యర్
సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని మహిళలకు చీరలు ఇవ్వాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తొలిరోజు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల చీరలను పంపిణీ చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ 1.04 కోట్ల బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలిరోజు 25 శాతం మేర పూర్తి చేశారు. మొత్తం 8 వేల కేంద్రాల్లో చీరలు పంపిణీ చేశారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట, హుస్నాబాద్‌లో పాల్గొనగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, గంభీరావుపేటలో కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పలువురు మంత్రులు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు కూడా ఇందులో పాల్గొన్నారు.
మరోవైపు నాసిరకం చీరలు ఇస్తున్నారంటూ కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. జగిత్యాల, సిరిసిల్ల, నల్లగొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో కొన్నిచోట్ల మహిళలు చీరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల చీరలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. అయితే బతుకమ్మ చీరల పంపిణీ పకడ్బందీగా చేస్తున్నామని, ఎక్కడా నాసిరకం చీరలు పంపిణీ చేయడం లేదని చేనేత శాఖ ఎండీ శైలజా రామయ్యర్ తెలిపారు. ఇదే విషయమై మంత్రి కేటీఆర్ కూడా సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, బట్ట కాల్చి మీద వేసే స్థాయికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దిగజారాయని ఆరోపించారు.
25 లక్షల బతుకమ్మ చీరల పంపిణీ
Published Tue, Sep 19 2017 2:06 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM
Advertisement
Advertisement