బతుకమ్మ చీరలు సిద్ధం | Bathukamma Sarees Ready For Distribution | Sakshi
Sakshi News home page

బతుకమ్మ చీరలు సిద్ధం

Published Fri, Oct 9 2020 1:34 AM | Last Updated on Fri, Oct 9 2020 1:34 AM

Bathukamma Sarees Ready For Distribution - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘బతుకమ్మ చీరలు’పంపిణీ కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ నెల 17న మొదలయ్యే బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని ఆలోపే చీరల పంపిణీని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశారు. క్షేత్రస్థాయిలో చీరల పం పిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించగా, గ్రామ కార్యదర్శులు, రేషన్‌షాప్‌ డీలర్లు, సెర్ప్, మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో లబ్ధిదారులకు అందజేస్తారు. పంపిణీలో కోవిడ్‌ నిబంధనలు పాటించాలని కలెక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 

287 డిజైన్లతో చీరలు 
బతుకమ్మ చీరలను ఆకర్షణీయమైన రంగుల్లో బంగారు, వెండి జరీ అంచులతో, 287 డిజై న్లతో 100 శాతం పాలిస్టర్‌ ఫిలమెంట్‌ నూలు తో తయారు చేశారు. సాధారణ చీరలను 6.30 మీటర్లు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని వయోవృద్ధులైన మహిళల కోసం 9 మీటర్ల పొడవైన చీరలను తయారు చేశారు. బతుక మ్మ చీరలకు బహుళ ఆదరణ లభిస్తుండటం తో వీటికి బ్రాండింగ్‌ ఇవ్వాలని ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని టెస్కో విక్రయ కేంద్రాల్లోనూ వీటిని విక్రయించాలని నిర్ణయించారు. బతుకమ్మ చీరల స్టాక్‌ ను జిల్లాలకు చేరవేశామని, పంపిణీ సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు టెస్కో జనరల్‌ మేనేజర్‌ యాదగిరి ‘సాక్షి’కి తెలిపారు. డిమాండ్‌ను తట్టుకునేందుకు టెస్కో వద్ద 1.50 లక్షల చీరల బఫర్‌ స్టాక్‌ ఉందన్నారు. 

మరమగ్గాల కార్మికులకు ఉపాధి 
సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్‌లో 26 వేలకుపైగా మరమగ్గాలపై పనిచేస్తున్న సుమారు 15 వేల మంది కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ ద్వారా ఉపాధి లభించింది. గతంలో నెలకు రూ.8వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం పొందిన కార్మికులు ప్రస్తుతం రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఆర్జిస్తున్నారు. బతుకమ్మ చీరలను డిజైన్లలో తయారు చేసేందుకు మరమగ్గాల యజమానులు మూడు వేలకుపైగా డాబీలు కొనుగోలు చేసి ఆధునికీకరణ సాధించారు. స్కూల్‌ యూనిఫారాలు, అంగన్‌వాడీ, ఐసీడీసీ సిబ్బందికి అందచేసే చీరలు, కేసీఆర్‌ కిట్‌ చీరలు కూడా మరమగ్గాలపైనే తయారు చేస్తున్నారు.

సంవత్సరం     లబ్ధిదారులు         ఖర్చు
                                          (రూ.కోట్లలో) 

2017          95,48,439           222 
2018         96,70,474           280 
2019         96,57,813           313 
2020         కోటి మంది            317.81

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement