బతుకమ్మ చీరలు: కొట్టుకున్నమహిళలు
బతుకమ్మ చీరలు: కొట్టుకున్నమహిళలు
Published Mon, Sep 18 2017 4:47 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM
- చెప్పులతో కొట్టుకున్న మహిళలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాబాసగా మారింది. క్యూ లైన్లలో తలెత్తిన వివాదం.. ఒకరినొకరు సిగలు పట్టుకుని చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది. కనీసం క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయకుండా, గొడవలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టక పోవడంతో మహిళలు ముష్టియుద్దాలకు దిగారు.
యాకుత్‌పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సరస్వతీ శిశుమందిర్ సోమవారం మొదటిరోజు బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు. మొదలు పెట్టిన కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న మహిళలు కొందరు గొడవపడ్డారు. ఒకరి జుత్తు మరొకరు పట్టుకొని గొడవకు దిగినా అధికారులు ఏమీ చేయలేకపోయారు. దీంతో చీరల పంపిణీ కొంతసేపు నిలిచిపోయింది. అక్కడే ఉన్న పోలీసులు, అధికారులు వారించినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా పరస్పరం దూషణలు చేసుకుంటూ తన్నుకున్నారు. అత్యంత కష్టంతో పోలీసుల జోక్యం చేసుకుని మహిళలు అక్కడి నుంచి పంపించివేయడంతో గొడవ సద్దుమణిగింది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి మూడ్రోజులపాటు కొనసాగనుంది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత, జౌళి శాఖ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,04,57,610 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.222 కోట్లు వెచ్చింది.
Advertisement