► పంపిణీకి సర్వం సిద్ధం
► 1.04 కోట్ల మంది ఆడపడుచులకు అందించేందుకు చర్యలు
► 7 కోట్ల మీటర్ల వస్త్రం..
► రూ.222 కోట్ల వ్యయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి మూడ్రోజులపాటు కొనసాగనుంది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత, జౌళి శాఖ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,04,57,610 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.222 కోట్లు వెచ్చింది. చీరల తయారీకీ సూమారు 7 కోట్ల మీటర్ల వస్త్రాన్ని వినియోగించారు. ఇందులో సగానికిపైగా చీరలను ప్రభుత్వం రాష్ట్రం నుంచే సేకరించింది. గత రెండు నెలలుగా రాష్ట్రంలోని మరమగ్గాలన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేసి ఈ చీరలను ఉత్పత్తి చేశాయి. అత్యధికంగా సిరిసిల్ల నుంచి 52 లక్షల చీరలను సమీకరించింది. మిగిలిన చీరలను జాతీయ స్థాయి టెండరింగ్ ప్రక్రియ ద్వారా సేకరించారు. వచ్చే ఏడాది నుండి పూర్తిగా ఇక్కడి నేతన్నల నుంచే చీరలు సేకరిస్తామని ప్రభుత్వం తెలిపింది.
కొంగు, బార్డర్లపై ప్రత్యేక శ్రద్ధ
బతుకమ్మ చీరల తయారీలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చేనేత విభాగం డైరెక్టర్ శైలజా రామయ్యర్ ఆధ్వర్యంలో వందల డిజైన్లతో చీరలను తయారు చేయించారు. ఈ డిజైన్ల నుంచి సీఎం కార్యాయల మహిళా ఉన్నతాధికారులు కొన్ని చీరలను ఎంపిక చేశారు. ఇలా మహిళల అభిరుచి మేరకు చీరల డిజైన్ల ఎంపిక జరిగింది. పండుగ రోజు మహిళలందరూ ఒకే విధమైన చీరలతో కనిపించకుండా 500పైగా డిజైన్లు, వందల రకాల రంగుల్లో తయారు చేయించారు. వస్త్రాల నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు, బార్డర్లు, ప్యాకేజీ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. సూరత్ నుంచి వచ్చే చీరల నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించేందుకు శైలజా రామయ్యర్ స్వయంగా అక్కడికి వెళ్లి వచ్చారు.
పంపిణీకి ప్రత్యేక కేంద్రాలు: కేటీఆర్
బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు కోటి నాలుగు లక్షల మంది అడబిడ్డలకు చీరలు అందించడం సంతోషం గా ఉందన్నారు. చీరల పంపిణీకి ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో ఎన్నికల తర హాల్లో ప్రత్యేక పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 18 ఏళ్లు నిండి, తెల్ల రేషన్ కార్డులో పేరున్న ప్రతి సోదరికి చీర ఇస్తామ న్నారు. ఇప్పటికే జిల్లా గోడౌన్లకు 80% చీరలు చేరాయని, 18, 19, 20 తేదీల్లో మొత్తం చీరల పంపీణి జరుగుతుందని వెల్లడించారు.
నేటి నుంచి బతుకమ్మ చీరలు
Published Mon, Sep 18 2017 2:01 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM
Advertisement