హైదరాబాద్, సాక్షి: నగరంలో బోనాల సందర్భంగా నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని.. ప్రముఖ ఆలయాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సీజీఎంలు, ఎస్‌ఈలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
జులై 2 నాటికి సంబంధిత సీఈలు/ఏస్‌ఈలు ఆలయ ప్రాంగణాలను సందర్శించి 24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ దేవాలయానికి ఒక నోడల్ అధికారి/ఏఈని కేటాయించాలన్నారు. ఆర్‌అండ్‌బీ, ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకోవడంతో పాటు డీటీఆర్‌లు, అదనపు లైట్లు, ఎయిర్ కండిషనింగ్, సౌండ్ సిస్టంకు తగినట్లు విద్యుత్ లోడ్ ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
అవసరమైన చోట ప్రత్యామ్నాయ సామగ్రిని సమకూర్చుకోవాలన్నారు. ప్రజలు గుమిగూడే చోట విద్యుత్ స్తంభాలు షాక్ కొట్టకుండా ముందే చెక్ చేయాలన్నారు. విద్యుత్ లీకేజీలను పూర్తిగా అరికట్టాలన్నారు. అన్ని పంపిణీ కేంద్రాల్లోనూ టంగ్ టెస్టర్ ద్వారా ఎర్తింగ్‌ను చెక్ చేయడంతో పాటు ప్రతి గంటకోసారి రీడింగ్ తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డైరెక్టర్లు నందకుమార్, డాక్టర్ నర్సింహులు, సీజీఎంలు కె.సాయిబాబా, ఎల్.పాండ్య, వి.శివాజీ, పి.భిక్షపతి, పి.ఆనంద్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment