Bonala festivals
-
బోనాల ఉత్సవాలకు నిరంతర విద్యుత్
హైదరాబాద్, సాక్షి: నగరంలో బోనాల సందర్భంగా నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని.. ప్రముఖ ఆలయాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సీజీఎంలు, ఎస్ఈలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జులై 2 నాటికి సంబంధిత సీఈలు/ఏస్ఈలు ఆలయ ప్రాంగణాలను సందర్శించి 24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ దేవాలయానికి ఒక నోడల్ అధికారి/ఏఈని కేటాయించాలన్నారు. ఆర్అండ్బీ, ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకోవడంతో పాటు డీటీఆర్లు, అదనపు లైట్లు, ఎయిర్ కండిషనింగ్, సౌండ్ సిస్టంకు తగినట్లు విద్యుత్ లోడ్ ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ సామగ్రిని సమకూర్చుకోవాలన్నారు. ప్రజలు గుమిగూడే చోట విద్యుత్ స్తంభాలు షాక్ కొట్టకుండా ముందే చెక్ చేయాలన్నారు. విద్యుత్ లీకేజీలను పూర్తిగా అరికట్టాలన్నారు. అన్ని పంపిణీ కేంద్రాల్లోనూ టంగ్ టెస్టర్ ద్వారా ఎర్తింగ్‌ను చెక్ చేయడంతో పాటు ప్రతి గంటకోసారి రీడింగ్ తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి డైరెక్టర్లు నందకుమార్, డాక్టర్ నర్సింహులు, సీజీఎంలు కె.సాయిబాబా, ఎల్.పాండ్య, వి.శివాజీ, పి.భిక్షపతి, పి.ఆనంద్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో బోనాల పండగ.. పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా నిలిచిందని, ప్రవాస భారతీయులు సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. గత 9 ఏళ్లలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ప్రవాస తెలంగాణ వాసు ల నివాసాల్లో బోనాలను అలంకరించుకొని భారత్ జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత స్థానిక దేవాలయానికి వెళ్లారు. అక్కడ బోనాలను సమర్పిం చిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఐటీ పరిశ్రమలో తెలంగాణలో3.5 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 9.5 లక్షలకుపైగా ఉన్నాయన్నారు. దేశంలో రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే దేశంలో రెండు ఐటీ ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి తెలంగాణలోనే ఉంటుందని కవిత పేర్కొన్నారు. జీఎస్డీపీలో జాతీయ సగటు కంటే తెలంగాణ ఎక్కువ నమోదు చేసిందని చెప్పారు. ఆ్రస్టేలియా రాజకీయాల్లో భారతీయులు రాణిస్తుండడం గర్వకారణమన్నారు. బోనాల ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి ఆ్రస్టేలియా విభాగం అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి, బీటీఏ ప్రెసిడెంట్ కిషోర్, నాయకులు విజయ్ కోరబోయిన తదితరులు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో బోనాల జాతర
-
ఆస్ట్రేలియాలో ఘనంగా బోనాల జాతర
ఆస్ట్రేలియాలో బోనాల జాతర ఘనంగా జరిగింది. తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో మెల్బోర్న్ సిటీ రాక్బ్యాంక్ ప్రాంతానికి చెందిన దుర్గా మాత దేవాలయంలో బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో మహిళలు అమ్మ వారికి బోనాలు, తొట్టెల సమర్పించి మొక్కుల్ని చెల్లించుకున్నారు . ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో పోతురాజుల నృత్యంతో సందడి నెలకొంది. బోనాల పాటలకు మనదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల భక్తులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ వేడుకల్ని ఆస్ట్రేలియా మెల్బోర్న్లో తెలంగాణ న్యూస్ సంస్థ నిర్వాహకులు మధు, రాజు వేముల, ప్రజీత్ రెడ్డి కోతి,దీపక్ గద్దెలు గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం అంగరంగ వైభవంగా బోనాల జాతర జరపడంపై భక్తులు.. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. -
బోనాల తూప్రాన్
ఉజ్జయిని మహంకాళి పండగ కోసం భారీగా ఏర్పాటు ∙పోతరాజులకు, బ్యాండు మేళాలకు పెరిగిన డిమాండ్ ∙పెరిగిన ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కమిటీలు తూప్రాన్ : గ్రామీణ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాల తీరే వేరు. సంబరాలు అంబరాన్ని అంటేలా కార్యక్రమాలు జరుగుతాయి. చిన్నా,పెద్దా, ఆడామగ అంతా వేడుకల్లో పాలుపంచుకుంటారు. ఈక్రమంలో అమ్మవారికి సమర్పించే తొట్టెల కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించేందుకు కొన్ని నెలలుగా యువకులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పోతరాజులు, బ్యాండు, న్యత్యకారులు, దేవాతమూర్తుల విగ్రహాల ప్రదర్శనకు అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ప్రస్తుతం పల్లెలకూ పాకింది. అ యితే, ఏటా ఖర్చులు పెరుగుతున్నాయని యు వకులు వాపోతున్నారు. అయినా, కార్యక్రమా లు అదిరిపోయేలా చేస్తామని చెబుతున్నారు. పట్టణంలో డీజేలకు క్రేజ్ జిల్లావ్యాప్తంగా ఏటా తూప్రాన్ మండల కేంద్రంలో బోనాలు మూడు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఆరేళ్ల క్రితం డీజే సౌండ్ సిస్టంతో మహిళ డ్యాన్సుర్లు ఆడేవారు. దీనిపై పోలీసులు అభ్యంతరం తెలపడంతో బ్యాండు మేళాలలకు క్రేజ్ పెరిగింది. స్టార్‌వార్స్ యూత్, ఛత్రపతి యువసేన, జయరాం యూత్, భజరంగ్బళి యువసేన, సాయి యూత్, కాణిపాక యూత్ తదితర యూత్ సభ్యులు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గతంలో పట్టణంలో దాదాపు 15 తొట్టెల కార్యక్రమాలు జరగగా.. ఈసారి మరో ఏడు పెరగవచ్చని యువకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, బోనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయని వారు చెబుతున్నారు. సికింద్రాబాద్‌తో పాటు తూప్రాన్‌లో... హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ముగిసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం అనవాయితీ. కానీ, ఈ ఏడు సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల రోజునే తూప్రాన్‌లో అంటే ఈనెల 31న నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో ఘనంగా తొట్టెల కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్న యువకులు ఆందోళన చెందుతున్నారు. ఒకే రోజున సికింద్రాబాద్, తూప్రాన్‌లో నిర్వహిస్తుండంతో బ్యాండు మేళాలు, నృత్యాకారులకు డిమాండ్ ఏర్పడింది. గతంలో కంటే రెండింతలు ఎక్కవగా డిమాండ్ చేస్తున్నారని వారు తెలిపారు. ఖర్చులు ఇలా... బోనాల ఉత్సవాల కోసం యువకులు కమిటీగా ఏర్పడి రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. బ్యాండు కోసం రూ.40 వేల నుంచి రూ.60 వేలు, పోతరాజులు, శివసత్తుల కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు, నృత్యకారులు ఒక్కొక్కరికీ రూ.1,500, దేవాతామూర్తుల విగ్రహల ప్రదర్శన కోసం విగ్రహనికి డిమాండ్‌ను బట్టి రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు చెల్లిస్తున్నారు. ఎక్కువ ధరలు బోనాల సందర్భంగా మార్కెట్లో బ్యాండుమేళాలు, పోతరాజులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వారు ధరలు ఒక్కసారిగా పెంచేశారు. అమ్మవారికి ఘనంగా తొట్టేల సమర్పించాలకున్నా.. పెరిగిన ధరలు ఇబ్బందిగా ఉన్నాయి. – సాయిప్రకాశ్, ఛత్రపతి యువసేన ఇబ్బంది పడుతున్నాం పోతరాజులు, బ్యాండు మేళాలు మార్కెట్లో దొరకడంలేదు. హైదరాబాద్‌లో పండగ ఉండటంతో వారికి డిమాండ్ ఏర్పాడింది. డబ్బులు ఎంత ఖర్చు చేద్దామనుకున్న ఫలితం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. – తరుణ్, స్టార్‌వార్స్ యూత్ అసోసియేషన్ ఘనంగా నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం బోనాల రోజున అమ్మవారికి తొట్టెలు నిర్వహిస్తున్నాం. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు అందరికీ అడ్వాన్సులు ఇచ్చేశాం. ఈసారి రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా, కార్యక్రమాలు ఘనంగా చేస్తాం. – శివసాయి, భజరంగ్‌దల్ యూవసేన