ఏ పథకాన్ని అమలు చేయాలన్న దానిపై సమీక్షించిన మంత్రి తుమ్మల
త్వరలో సీఎంతో భేటీలో చీరల డిజైన్ల ఖరారు
బడ్జెట్, ఇతర అంశాలపై అధికారుల కసరత్తు
63 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ చేసే దిశగా...
సాక్షి, హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) సభ్యులుగా ఉన్న మహిళలకు ఒకే డిజైన్‌తో ఉండే చీరలు పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా విధి విధానాలు ఖరారు చేయా లని నిర్ణయించింది. చీరల పంపిణీ పథకాన్ని ఏ తరహాలో అమలు చేయాలనే అంశానికి సంబంధించి చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారు. మరో వారం రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డితో జరిగే భేటీలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత, చీరల పంపిణీ పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రేషన్‌కార్డులో పేర్లు కలిగిన 18 ఏళ్లు పైబడిన యువతులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. అయితే రాష్ట్రంలో గ్రామీణ పేదరి క నిర్మూలన సంస్థ (సెర్ప్), మెప్మా పరిధిలోని 63 లక్షల మంది మహిళా సభ్యులకు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే స్వయం సహాయక సంఘా ల మహిళలకు పంపిణీ చేసేది బతుకమ్మ చీరలు కాదని, రాష్ట్రమంతటా ఒకే డిజైన్ కలిగిన చీరలను పంపిణీ చేస్తామని చేనేతశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని, సరఫరాలో కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా స్థానికంగా ఉండే నేత కారి్మకులను భాగస్వాములను చేస్తూ నాణ్యత కలిగిన చీరలను ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఒక్కో మహిళకు ఒకటా.. రెండా..?
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒక్కొక్కరికీ ఏటా ఎన్ని చీరలు పంపిణీ చేయాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్‌హెచ్‌జీల్లో పెరిగే సభ్యు ల సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకొని ఏటా రెండేసి చీరల చొప్పున పంపిణీ చేస్తే 1.3 కోట్ల చీరలు అవసరమవుతాయని ప్రాథమికంగా లెక్కలు వేశా రు. ఒక్కో చీర తయారీకి అయ్యే ఖర్చు, ఏటా కేటాయించాల్సిన బడ్జెట్ తదితరాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ చీరలను పండుగ సమయా ల్లో ఇవ్వాలా, ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఇవ్వా లా అకోణంలోనూ అధికారులు ఆలోచిస్తున్నారు. 2017లో బతుకమ్మ చీరల పథకం ప్రారంభంకాగా సగటున రూ.325 కోట్ల బడ్జెట్‌తో కోటి చీరలు పంపిణీ చేస్తూ వచ్చారు. గత ఏడాది 30 రకాల డిజైన్లు, 20 విభిన్న రంగుల్లో 240 వెరైటీల్లో చీరలను తయారు చేయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) డిజైనర్లతో బతుకమ్మ చీరలు డిజైన్ చేయించారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు పంపిణీ చేసే చీరల డిజైన్లను కూడా నిఫ్ట్ డిజైనర్ల సూచనలు, సలహాల ఆధారంగా ఖరారు చేస్తారు.
ప్రస్తుతం సొంతంగా ఎస్‌హెచ్‌జీల కొనుగోలు
ప్రస్తుతం రాష్ట్రంలోని ఎస్‌హెచ్‌జీల మహిళలకు ప్రత్యేక యూనిఫారం లేకున్నా స్థానికంగా గ్రామ, మండల సమాఖ్యలు మూకుమ్మడిగా నిర్ణయించుకొని తమకు నచ్చిన డిజైన్ చీరలను యూనిఫారాలుగా ఎంచుకుంటున్నాయి. ఎస్‌హెచ్‌జీల సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఒకే డిజైన్ చీరలు ధరించి హాజరవుతున్నారు. గ్రామ, మండల సమాఖ్య నిధుల నుంచి లేదా సొంతంగా తలాకొంత మొత్తం పోగు చేసి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే పంపిణీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఒకటి లేదా రెండు డిజైన్లను ఎంపిక చేసి చీరల తయారీకి ఆర్డర్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా పది డిజైన్లను సిద్ధం చేసిన చేనేత విభాగం త్వరలో సీఎంతో జరిగే భేటీలో ఒకటి రెండు డిజైన్లను ఖరారు చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment