బతుకమ్మ కానుకలకు స్వస్తి..?
ఈసారి మహిళలకు చీరల పంపిణీ లేనట్టే
ప్రత్యామ్నాయ బహుమతులపై ప్రభుత్వ యోచన!
చుంచుపల్లి: బతుకమ్మ పండుగకు మహిళలకు అందించే చీరలకు ప్రభుత్వం ఈసారి స్వస్తి పలికినట్లేనని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది అక్టోబర్‌లో పంపిణీ చేస్తుండగా, రెండు నెలల ముందు నుంచే లబ్ధిదారుల సంఖ్య, చీరల కొనుగోలు ప్రక్రియపై కసరత్తు జరిగేది. కానీ ఈసారి బతుకమ్మ చీరలకు సంబంధించి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. చీరల స్థానంలో ప్రత్యామ్నాయంగా నగదు లేదా ఇంకేమైనా బహుమతులు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017 నుంచి బతుకమ్మ కానుకగా చీరలను అందించింది. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాలవారికి చీరలు పంపిణీ చేసింది.
సిరిసిల్ల, షాద్‌నగర్, నారాయణపేట్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో తయారైన చేనేత చీరలను కొనుగోలు చేసి అందించింది. జిల్లాలో 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలోని 3,66,088 మంది మహిళలకు రేషన్ షాపులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ద్వారా ఈ బతుకమ్మ కానుకలు నేరుగా అందించేవారు. అయితే ఈ బతుకమ్మ చీరలు నాణ్యమైనవి కాదని, కొనుగోలు ప్రక్రియలో అవినీతి జరిగిందని గతంలో కాంగ్రెస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి నాణ్యతలేని చీరలను పంపిణీ చేసి అభాసుపాలు కాకుండా చీరలకు బదులు వేరే బహుమతులు ఇవ్వాలనే భావనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment