జనగర్జన సభాస్థలిలో పూర్తయిన ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ జనగర్జన సభను పురస్కరించుకుని కాంగ్రెస్‌లో కోలాహలం నెలకొంది. ఖమ్మంలో ఆదివారం జరగనున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తికాగా.. ఖమ్మం నగరం మొదలు సభా ప్రాంగణం వరకు భారీ కటౌట్లు, పార్టీ తోరణాలతో ముస్తాబు చేశారు. ఓవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు, మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో ఇదే వేదికగా చేరనుండడంతో పార్టీలో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సభకు భారీగా జన సమీకరణ చేస్తుండగా.. దాదాపు ఐదు లక్షల మందిని తరలించేందుకు ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక సభ నిర్వహించే ఎస్‌ఆర్ గార్డెన్స్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో సభా వేదిక, బారికేడ్లు, డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటు పూర్తయ్యాయి. ఆవరణలో ఎక్కడి నుంచైనా వేదికను వీక్షించేలా భారీ డిజిటల్ స్క్రీన్లు సిద్ధం చేశారు.
సమీప జిల్లాల నుంచి కూడా...
ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాల నుంచి జన సమీకరణకు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే మాజీ ఎంపీ పొంగులేటి, అనుచరులు దృష్టి సారించారు. ఇక భట్టి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు కూడా జనాన్ని తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల సన్నాహక సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు శనివారం కూడా జన సమీకరణపై పలు ప్రాంతాల్లో సమీక్షలు చేశారు.
కటౌట్లు, డిజిటల్ ఫ్లెక్సీలు
జనగర్జన సభా వేదికతో పాటు అక్కడకు వెళ్లే మార్గంలో ఇరుపక్కలా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అలాగే, మూడురంగుల కాంగ్రెస్ జెండాలతో నగరాన్ని ముస్తాబుచేశారు. అలాగే, సభావేదికపైనే కాక చుట్టూ భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. ఇక సభా ప్రాంగణంలో డిజిటల్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దాదాపు 200 మంది కూర్చునేలా ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు.
పార్కింగ్‌కు ఏర్పాట్లు
ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు.. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న తెలంగాణ జనగర్జన సభకు భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరవుతారని అంచనా. దాదాపు 5 లక్షల మంది వాహనాల్లోవస్తారనే భావనతో పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశారు. వైరా వైపు నుంచి వచ్చే వాహనాలను వి.వెంకటాయపాలెం నుంచి ఎస్‌ఆర్ గార్డెన్స్ వరకు రోడ్డుకు ఇరువైపులా వంద ఎకరాల స్థలంలో పార్కింగ్ కోసం చదును చేశారు. ఇక వరంగల్, ఖమ్మం రూరల్, కోదాడ, ఇల్లెందు, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం రఘునాథపాలెం బైపాస్ రోడ్డు నుంచి బల్లేపల్లి వరకు రోడ్డు వెంట స్థలలు సిద్ధం చేయగా... ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అక్కడే హెలిప్యాడ్..
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హెలికాప్టర్‌లో రానుండటంతో హెలిప్యాడ్‌ను కూడా సభా వేదికకు సమీపానే ఏర్పాటు చేశారు. ఎస్‌ఆర్ గార్డెన్స్ వెనుకాల పొంగులేటికి సంబంధించిన వంద ఎకరాల స్థలంలో సభాస్థలి ఏర్పాటు చేయగా.. ఓ పక్క ఉన్న గుట్టపై హెలీప్యాడ్‌ను నిర్మించారు. అక్కడి నుంచి సభా వేదికకు రాహుల్‌గాంధీ నేరుగా చేరుకునేలా ప్రత్యేక బారికేడ్లతో రోప్‌వే ఏర్పాటు చేశారు. కాగా, సభాస్థలి వద్ద ఏర్పాట్లను శనివారం సాయంత్రం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment