సాక్షిప్రతినిధి, ఖమ్మం: సుమారు ఆరు నెలలుగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చింది. ఆయన తన అనుచరవర్గంతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఢిల్లీ వేదికగా ప్రకటించారు. వచ్చేనెల 2న ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో తన మద్దతుదారులతో కలిసి రాహుల్‌గాంధీ సమక్షాన కాంగ్రెస్ కండువా కప్పుకుంటామని వెల్లడించారు. హస్తినలో ఏఐ సీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని సోమవారం ఆయన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతోపాటు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు.
2014లో ఎంపీగా గెలిచి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో తాను ఎంపీగా గెలవడంతోపాటు సీపీఎం మద్దతుతో వైరా, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక వైఎస్సార్‌సీపీ మద్దతుతో భద్రాచలం నియోజకవర్గాన్ని కూడా సీపీఎం దక్కించుకుంది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యాన ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అయితే పార్టీలో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో అసంతృప్తికి లోనవుతూ వచ్చారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో అప్పటికే ఎంపీగా ఉన్న పొంగులేటికి టికెట్ దక్కకపోగా, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు వస్తాయని ప్రచారం జరిగినా అవీ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో కొనసాగారు.
చివరకు ‘చేయి’ అందుకుని..
దాదాపు నాలుగేళ్ల అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఏడాది జనవరి 1న ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆత్మీయుల సమావేశంలో తన అసంతృప్తిని బయటపెట్టారు. అయితే, ఈ సమావేశంలో అసంతృప్తిని మాత్రమే వ్యక్తం చేయగా, నియోజకవర్గాల వారీ ఆత్మీయ సమావేశాల్లో మాత్రం సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. తనకు కనీస గౌరవం ఇవ్వలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో పొంగులేటి బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరతారని.. లేదంటే కొత్త పార్టీ పెడతారని ప్రచారం సాగింది. ఇంతలోనే సర్వేలు చేయించుకున్న ఆయన, అనుచరగణం ముక్తకంఠంతో చెప్పడంతో కాంగ్రెస్‌లో చేరికకు నిర్ణయించుకున్నారు.
రాహుల్‌కు నేతల పరిచయం
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి వెంట పలువురు నేతలు ఢిల్లీకి తరలివెళ్లారు. ఈ సందర్భంగా సమావేశం అనంతరం పొంగులేటి.. జిల్లా నేతలను రాహుల్‌గాంధీకి పరిచయం చేశారు. ఆ తర్వాత మాజీ మంత్రి జూపల్లితో కలిసి ప్రియాంకగాంధీతో సమావేశమయ్యారు. పొంగులేటి వెంట వెళ్లిన వారిలో భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నేతలు మువ్వా విజయ్‌బాబు, తెల్లం వెంకట్రావు, పిడమర్తి రవి, జారె ఆదినారాయణ, బానోతు విజయాబాయి, తుళ్లూరి బ్రహ్మయ్య, మచ్చా శ్రీనివాసరావు, తుంబూరి దయాకర్‌రెడ్డి, మద్దినేని బేబి స్వర్ణకుమారి, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, రామసహాయం నరేష్‌రెడ్డి, డాక్టర్ కోటా రాంబాబు, ఊకంటి గోపాలరావు, డాక్టర్ రాజారమేష్, జూపల్లి రమేష్, ఐలూరి వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.
2న ఖమ్మంలో సభ..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన బృందంతో కలిసి ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తదితరులతో సోమవారం సమావేశమయ్యాక విలేకరులతో మాట్లాడారు. వచ్చేనెల 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్‌లో చేరతామని, ఈ సభకు రాహుల్‌గాంధీ హాజరవుతారని తెలిపారు. ఆ దిశగా భారీ సభ నిర్వహణకు ఖమ్మం ఎస్‌ఆర్ గార్డెన్స్ వెనుక పొంగులేటి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు మొదలుపెట్టగా, సభ విజయవంతం, జనసమీకరణ కోసం ఇప్పటికే నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల ను నియమించారు. ఈ ఏడాది జనవరి 18న నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను తలదన్నేలా తమ సభ ఉంటుందని పొంగులేటి చెబుతున్నారు. రాష్ట్రస్థాయిలో చేరికల పరంగా ఇదే భారీ సభ కానుండటంతో పొంగులేటితో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా ఈ సభలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment