బాలసాని ఇంట్లో మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ దూకుడు పెంచింది. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన రోజే ఖమ్మంలో చోటు చేసుకున్న పరిణామాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయాన్ని వేడెక్కించాయి. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడం, వెంటనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం.. ఆ తర్వాత ముగ్గురు కార్పొరేటర్లు, పలువురు నేతల ఇంటికి వెళ్లడం చకచకా సాగాయి. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జరిగిన ఈ పరిణామాలు ఉత్కంఠగా కొనసాగాయి. ఇరువురు నేతలు గుంభనంగా చేసిన రాజకీయంతో బీఆర్‌ఎస్ షాక్‌కు గురైంది.
నిర్బంధ రాజకీయం తట్టుకోలేకనే..
నిర్బంధ రాజకీయం తట్టుకోలేకనే తాము బీఆర్‌ఎస్‌ను వీడి తుమ్మల, పొంగులేటి బాటలో నడుస్తున్నట్లు కార్పొరేటర్ కమర్తపు మురళి, చావా నారాయణ విలేకరుల సమావేశంలో తెలిపారు. దీంతో నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో ఇంకా ఎవరు అసంతృప్తిగా ఉన్నారు?, ఎవరు కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ జరుగుతోంది.
ఒకే రోజు ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లయింది. మంత్రి పువ్వాడ ప్రగతి భవన్‌లో బీ ఫామ్ తీసుకుంటన్న సమయంలోనే ఖమ్మంలో జరిగిన రాజకీయం ఆ పార్టీని ఉలికిపాటుకు గురి చేసింది. ఆ తర్వాత మంత్రి హుటాహుటిన ఖమ్మం చేరుకొని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, రఘునాథపాలెం మండలంలోని పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
బాలసాని రాజీనామా చేసి..
బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని ముందుగా ఆపార్టీకి రాజీనామా చేసి, కేసీఆర్‌కు లేఖ పంపారు. పార్టీపై అసంతృప్తిగా ఉండడం, భద్రాచలం నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి తప్పించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బాలసానితో ఇటీవల పొంగులేటి, తుమ్మల పలుమార్లు వేర్వేరుగా చర్చలు జరిపినట్లు తెలిసింది.
తుమ్మలకు కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం సీటుపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాలసాని ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. బాలసాని కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉండడంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తుమ్మల, పొంగులేటి నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వా నించారు. పార్టీ బలోపేతానికి తాను కృషి చేసినా అనుభవం లేని వారికి పలు బాధ్యతలు ఇచ్చి తనను అవమానించారని బాలసాని ఎమ్మెల్సీ తాతా మధునుద్దేశించి ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.
ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి..
బాలసాని పార్టీ మారుతారని బీఆర్‌ఎస్ అధిష్టానం ముందే ఊహించినా ముగ్గురు కార్పొరేటర్లు, పలువురు నేతలు ఇదే బాట పట్టడంతో అటు హైదరాబాద్, ఇటు ఉమ్మడి జిల్లాలో ఆసక్తికర చర్చ జరిగింది. తుమ్మల, పొంగులేటి బాలసాని ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించాక కార్పొరేటర్లు కమర్తపు మురళి, చావా మాధురి నారాయణ, రావూరి కరుణసైదుబాబు ఇంటికి వెళ్లి వారిని కూడా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
అనంతరం అల్లీపురంలోని బీఆర్‌ఎస్ నేతలు సంక్రాంతి నాగేశ్వరరావు, పత్తిపాటి వీరయ్య, మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు ఇంటికి తుమ్మల, పొంగులేటి వెళ్లారు. సుడా డైరెక్టర్లు కోసూరి రమేష్‌గౌడ్, ఎండీ ఖాదర్‌బాబా, మాజీ కార్పొరేటర్ భర్త పోట్ల వీరేందర్, ఏలూరి శ్రీనివాస్ కూడా తుమ్మల, పొంగులేటి వెంట నడవనున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment