పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు
● ట్రైబల్ మ్యూజియం వద్ద క్రీడా పరికరాలు, బోటింగ్ ● పరిశీలించిన ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయ ఆవరణలోని ట్రైబల్ మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా మరిన్ని ఏర్పాట్లు చేయాలని పీఓ బి.రాహుల్ సూచించారు. బోటింగ్‌తో పాటు చిన్న పిల్లలు ఆడుకునేలా పరికరాలు సమకూర్చాలని తెలిపారు. ట్రైబల్ మ్యూజియం వద్ద క్రీడా స్థలాల ఏర్పాటు, బోటింగ్ కోసం రూపొందిస్తున్న కృత్రిమ చెరువు పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మ్యూజియం సందర్శనకు వచ్చే వారి పిల్లలకు ఆటవిడుపుగా బోటింగ్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ మేరకు పనులను ఫిబ్రవరి 5 నాటికి పూర్తిచేసి, పాతకాలపు మాదిరి ఇళ్లపై బొమ్మలు, మ్యూజియం ముందు ఫౌంటెయిన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
క్రికెట్ బాక్స్ ఏర్పాటు..
మ్యూజియం ఆవరణలో క్రికెట్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ రాహుల్ తెలిపారు. ఆసక్తి గల వారు ఐటీడీఏలోని భవిత కేంద్రంలో ఈనెల 27వ తేదీ సాయంత్రం లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, అధికారులు శ్రీనివాస్, హరికృష్ణ, శ్రీనివాస్, మహేష్, వీరస్వామి పాల్గొన్నారు.
మహిళల స్వయం ఉపాఽధికి చేయూత..
గిరిజన మహిళల స్వయం ఉపాఽధికి ప్రభుత్వం తరఫున ఐటీడీఏ చేయూతనిస్తోందని పీఓ రాహుల్ తెలిపారు. ఎంఎస్‌ఎంఈ పథకం ద్వారా మగ్గం కేంద్రం సొసైటీ సభ్యురాలు నాగమణికి రూ.2.12 లక్షల సబ్సిడీ చెక్కును అందజేసి ఆయన మాట్లాడారు. యూనిట్ ధర రూ.27.70లక్షల్లో సొసైటీ సభ్యులు చెల్లించిన మొత్తం పోగా బ్యాంకు రుణం, అందులో సబ్సిడీ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ పాల్గొన్నారు.
జాబితాలో పేరు లేదని ఆందోళన చెందొద్దు
భద్రాచలంఅర్బన్ : సంక్షేమ పథకాల జాబితా ల్లో పేర్లు లేని వారు ఆందోళన చెందొద్దని పీఓ రాహుల్ సూచించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న నాలుగు పథకాలు అర్హులందరికీ అందుతాయని, ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకే గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత జాబితాలో పేరులేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment