ఆ ‘ఐదు’ ఏమాయె..
భద్రాచలం : రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆయా గ్రామాల వారు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా వారి గోడుకు తెర పడటం లేదు. సుదూరంగా ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లలేక పోతున్నామని, భౌగోళికంగా తెలంగాణతో ముడిపడి ఉన్న తమను తెలంగాణాలోనే కలిసి ఉంచాలనే వారి విన్నపాలు కన్నీటి సంద్రమవుతున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో దీనిపై చర్చించాలని నిర్ణయించినా ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు.
సీఎంల భేటీలో ప్రస్తావన..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలు, ఆయా గ్రామాల వారు ఏపీలో ఉండేందుకు చూపుతున్న విముఖతతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై ప్రధానంగా స్పందించారు. జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గత జూలైలో హైదరాబాద్‌లో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఈ అంశం ప్రాథమికంగా చర్చకు వచ్చింది. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు పరిశీలించి సమస్యపై దృష్టి సారించాలని నిర్ణయించారు. అయితే ఇది జరిగి ఆరు నెలలు దాటినా ఇప్పటి వరకు కనీసం ఒక్క అడుగు సైతం ముందుకు పడలేదు. దీనికి తోడు ఇటీవల అమరావతిలో జరిగిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశంలో కనీసం ప్రస్తావనకు కూడా రాలేదు.
వినతులు, ఉద్యమాలు..
తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనకు ముందు భద్రాచలం డివిజన్‌లో యటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం పంచాయతీ లు అంతర్భాగంగా ఉండేవి. రాష్ట్ర విభజనతో పోలవరం ముంపు పేరుతో ఈ ఐదు పంచాయతీలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. అయితే తిరిగి తమ గ్రామాలను ఏపీలో కలపాలని కోరుతూ ఆయా గ్రామాల వారు పదేళ్లుగా రాస్తోరోకోలు, మానవహారాలు, బంద్‌లు చేపట్టారు. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులే కాక గవర్నర్, రాష్ట్రపతికి సైతం వినతిపత్రాలు సమర్పించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు, రెవెన్యూ, తదితర పనుల కోసం సుదూరంగా ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఇబ్బంది కలుగుతోందని, గోదావరి వరదల సమయంలోనూ సత్వర సహాయక చర్యలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం స్పందించాలి
ఏపీలో కలిసిన ఐదు పంచాయతీల ప్రజల సమస్య పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ఇరు రాష్ట్రాలు దీనిపై దృష్టి సారించాలి. ఆయా గ్రామాల వారి ఆవేదనను అర్థం చేసుకోవాలి. భద్రాచలం అభివృద్ధికి సైతం ఇదే ప్రధాన అడ్డంకిగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఏపీపై ఒత్తిడి పెంచాలి.
– ఆకోజు సునీల్, బీఆర్‌ఎస్ మండల
అధ్యక్షుడు, భద్రాచలం
ఎటూ తేలని విలీన పంచాయతీల సమస్య
తిరిగి తెలంగాణలో కలపాలని ఏళ్లుగా డిమాండ్
సీఎంలు సానుకూలంగా స్పందించినా తెగని పంచాయితీ
ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్
భద్రాచలం అభివృద్ధికి ఇదే ప్రత్యామ్నాయం..
రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలంలో తగినంత స్థలం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. రామాలయ అభివృద్ధితో పాటుగా ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న భద్రాచలంలో జనాభా సైతం నానాటికి పెరుగుతోంది. దీనికి అనుగుణంగా వసతులు, స్థలాలు లేకపోవడంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర మంత్రులు, ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment