రూ.8.50 కోట్ల లాభాల్లో డీసీసీబీ
● కౌలు రైతులకూ పంట రుణాలు ఇచ్చేందుకు కృషి ● డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు
ఖమ్మంవ్యవసాయం: వ్యాపారాలు, డిపాజిట్లు, రుణ లావాదేవీలతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఆర్థికంగా బలోపేతమవుతూనే లాభాలు గడిస్తోందని చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన సీఈఓ ఎన్.వెంకటఆదిత్యతో కలిసి బ్యాంకు ప్రగతిని వెల్లడించారు. 2024 మార్చి నాటికి రూ.2,984 కోట్ల లావాదేవీలతో ఉన్న బ్యాంకు డిసెంబర్ 31 నాటికి ఏకంగా రూ. 3,391 కోట్లకు పెరిగిందని తెలిపారు. వ్యాపార పరంగా రూ.1,144 కోట్ల నుంచి రూ.1,247 కోట్లకు, పంట రుణాలు రూ.1,840 కోట్ల నుంచి రూ.2,143 కోట్లకు పెరిగాయని వివరించారు. తద్వారా లావాదేవీలు రూ.406 కోట్ల మేర పెరగగా, 2024 మార్చి నాటికి రూ.3.90 కోట్ల లాభాల్లో ఉన్న బ్యాంకు డిసెంబర్ 31నాటికి రూ.8.50 కోట్లకు చేరిందని తెలిపారు. డీసీసీబీ ద్వారా 1.69 లక్షల మంది రైతులకు రూ.900కోట్ల మేర రుణమాఫీకి సిఫారసు చేస్తే 92 వేల మందిని అర్హులుగా గుర్తించారన్నారు. ఇందులో 77,750 మంది రైతులకు చెందిన రూ.326 కోట్లు మాఫీ వర్తించిందని తెలిపారు. మిగిలిన రైతులు ఇతర బ్యాంకుల్లో రుణాలు కలిగి ఉండటంతో డీసీసీబీ నుంచి మాఫీ వర్తించలేదని చైర్మన్ చెప్పారు.
రూ.2 లక్షల ప్రమాద బీమా
బ్యాంకు ద్వారా రైతు సేవలో భాగంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు చైర్మన్ వివరించారు. ఏటా రూ.14 ప్రీమియంతో రూ.2లక్షల బీమా వర్తిస్తుందని, ఈ ప్రీమియం కూడా బ్యాంకే చెల్లిస్తుందని తెలిపారు. గతంలో రూ.19తో ఉన్న ప్రీమియాన్ని ఈ ఏడాది రూ.14కు తగ్గించామన్నారు. గత ఏడాది 1.27 లక్షల మంది రైతుల కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.24.18 లక్షలు అందగా, ఈ ఏడాది 1.20 లక్షల మంది కుటుంబాలకు రూ.16.70 లక్షలు చెల్లించామని ఆయన వివరించారు.
గ్యారంటీ ఇస్తే వారికీ రుణాలు
భూమి లేని కౌలు రైతులకూ పంట రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. పీఏసీఎస్‌ల చైర్మన్లు, సర్పంచ్‌లు గ్యారంటీ ఇస్తే రుణాలు ఇచ్చేందుకు ఆలోచనలో ఉన్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మార్ట్‌గేజ్ సమస్య అడ్డుగా ఉందని తెలిపారు. కాగా, పాడి గేదెలు, చేపల పెంపకం, కోళ్ల పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూని ట్లకు నాబార్డ్ సహకారంతో రుణాలు ఇచ్చేందుకు కృషి జరుగుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment