సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని హస్తం గుర్తుపై పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు సమాయత్తం అవుతున్నారు. పార్టీ పెద్దలు ఎవరికి టికెట్ కేటాయిస్తారనే అంశంపై స్పష్టత లేకున్నా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవడం, సభలు, సమావేశాల నిర్వహణలో బిజీ అవుతున్నారు. ఈ విషయంలో కొత్తగూడెం నియోజకవర్గ ఆశావహులు ముందు వరుసలో ఉన్నారు.
జనరల్ స్థానంలో పోటాపోటీ..
జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇందులో కొత్తగూడెం ఒక్కటే జనరల్‌గా ఉంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు నేతల మధ్య పోటీ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా బలమైన అనుచరగణం కలిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి హస్తం గుర్తుపై పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కొత్తగూడెంలో క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కొత్తగూడెంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. హంగూ ఆర్భాటం లేకుండా చాపకింద నీరులా ఇతర పార్టీలకు చెందిన కేడర్‌ను కాంగ్రెస్‌లో చేర్పిస్తున్నారు. పొంగులేటి నియోజకవర్గంలో అందుబాటులో లేనప్పుడు ఆయన అనుచర గణం తమ పని తాము చేసుకుపోతోంది. అయితే పొంగులేటి వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం, ఖమ్మంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడం గమనార్హం.
అడపదడపా పోట్ల పర్యటన..
టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు.. బీఆర్‌ఎస్ మీదుగా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వర్గం నేతగా కొనసాగుతున్నారు. కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది ఇక్కడ క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేయడం తప్ప నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిలో పెద్దగా కార్యక్రమాలు చేపట్టలేదు. పార్టీ పిలుపు మేరకు అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
ఎడవల్లి ఎడతెగని ప్రయత్నాలు..
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని గత 15 ఏళ్లుగా ఎడవల్లి కృష్ణ ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన మూడు ఎన్నికల్లో వివిధ గుర్తులపై ఆయన పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అనుచరుడిగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. క్రమం తప్పకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గంలో అందరి కంటే ముందుగా టికెట్ కోసం గాంధీభవన్‌లో దరఖాస్తు సమర్పించారు.
మార్మోగుతున్న ఇల్లెందు పేరు..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌లో ఇల్లెందు పేరు మార్మోగుతోంది. మంగళవారం సాయంత్రం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 115 నియోజకవర్గాలకు సంబంధించి 306 దరఖాస్తులు రాగా, ఇందులో రికార్డు స్థాయిలో ఇల్లెందు స్థానం నుంచి ఏకంగా 40 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గాంధీభవన్‌లో ఇల్లెందు హాట్ టాపిక్‌గా మారింది. కాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు గాంధీభవన్‌లో దరఖాస్తు సమర్పించే అవకాశం ఉంది. ఖమ్మం, కొత్తగూడెంతో పాటు పాలేరుకు కూడా ఆయన దరఖాస్తు సమర్పిస్తారని సమాచారం. పొంగులేటితో పాటు ఆయన అనుచరులు సైతం రేపు గాంధీభవన్‌లో తమ నియోజకవర్గాలకు సంబంధించి దరఖాస్తు చేసే అవకాశం ఉంది. దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 25 వరకు అవకాశం ఉంది.
బల ప్రదర్శనకు సిద్ధం..
టికెట్ కోసం పోటీ నెలకొన్న వేళ.. బలప్రదర్శనకు ఎడవల్లి కృష్ణ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బుధవారం కొత్తగూడెంలో ప్రజా చైతన్యం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరితో పాటు ఏఐసీసీ కీలక నేతలు హాజరవుతున్నారు. రేణుకాచౌదరి గత కొంతకాలంగా జిల్లా రాజకీయాలతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పరంగా ఆమె కార్యక్రమాలన్నీ ఢిల్లీ, హైదరాబాద్, ఖమ్మం వరకే పరిమితం అవుతున్నాయి. అయితే టికెట్ల కేటాయింపు అంశం ముదురుపాకాన పడిన సమయాన రేణుకాచౌదరి జిల్లాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధ, గురువారాల్లో కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో ఆమె పర్యటన ఖరారైంది. అయితే ప్రధాన కార్యక్రమాలన్నీ కొత్తగూడెం నియోజవర్గ పరిధిలోనే ఉండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment