వామన రూపుడైన వరాల రామయ్య
● భద్రగిరిలో వైభవోపేతంగా సాగుతున్న అధ్యయనోత్సవాలు ● నేడు పరశురామావతారంలో దర్శనం
భద్రాచలం: బలి చక్రవర్తి గర్వాన్ని అణిచేందుకు వెలిసి.. మూడడుగుల స్థలాన్ని కోరి రాక్షసరాజుకు గర్వభంగం చేసిన వామనావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్యకు భక్తులు జేజేలు పలికారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు శనివారం ఐదో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య స్వామిని వామనావతారంలో అలంకరించారు. తొలుత గర్భగుడిలో సుప్రభాత సేవ నిర్వహించి ఆరాధన గావించారు. అర్చక స్వాములు పూజల నడుమ వేద పండితులు రెండు వందల పాశురముల ప్రబంధాలను పఠించారు. వామనావతారంలో అలంకరించిన స్వామి వారికి బేడా మండపంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం నుంచి ఊరేగింపుగా మహిళలు కోలాట ప్రదర్శనల నడుమ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ప్రత్యేక వేదికపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు నీరాజనాలు పలికారు. అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం స్వామివారికి తిరువీధి సేవ జరిపి.. తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు.
నేడు పరశురాముడిగా..
వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఆదివారం పరశురామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ మహావిష్ణువు జమదగ్ని అనే మహర్షికి పుత్రుడిగా జన్మించి పరశురాముడు(భార్గవరాముడు) అని పిలవబడుతూ దుష్టులైన కార్తవీర్యార్జునుని, దుర్మార్గులైన రాజులను 21సార్లు దండెత్తి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారని ప్రతీతి.
Comments
Please login to add a commentAdd a comment