కందుకూరు మండలం కొత్తూరు గోదాముకు చేరుకున్న బతుకమ్మ చీరలు
సాక్షి, రంగారెడ్డి : బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. రెండేళ్లుగా మహిళలకు అందజేస్తున్న విషయం తెలిసిందే. మూడో ఏడాది కూడా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. చీరలను జిల్లాకు చేర్చుతోంది. వీటిని మొయినాబాద్, కందుకూరు మండలం కొత్తూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) గోదాముల్లో అధికారులు భద్రపరుస్తున్నారు. ఈ ఏడాది సుమారు ఐదు లక్షల చీరలు మహిళలకు అందజేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వచ్చేనెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండి.. ఆహార భద్రత కార్డు (రేషన్)లో పేరున్న ప్రతి మహిళకు ఒక చీర చొప్పున పంపిణీ చేస్తారు. రేషన్ కార్డుల ప్రకారం జిల్లాలో గతేడాది 6.59 లక్షల మంది మహిళలు ఉండగా.. వీరిలో 4.78 లక్షల మంది చీరలు అందుకున్నారు. మిగిలిన వారు తీసుకోలేదు. గతంతో పోల్చితే ఈసారి చీరలు తీసుకునే లబ్ధిదారుల సంఖ్య ఐదు శాతం పెరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు జిల్లాకు 2.93 లక్షల చీరలు వచ్చాయి. మిగిలిన చీరలు మరో వారం రోజుల్లో చేరుకుంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇంకా ఖరారుకాని విధివిధానాలు..
బతుకమ్మ సంబరాలు వచ్చేనెల చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఈలోగా మండలాలకు చీరల చేరవేత, లబ్ధిదారులకు పంపిణీ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలు రానున్నాయి. గోదాంల నుంచి ప్రతి మండలానికి తరలించేందుకు వీలుగా రూట్ ఆఫీసర్లను నియమించనున్నారు. అక్కడి నుంచి గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు చేరుస్తారు. రాష్ట్ర స్థాయిలో చీరల పంపిణీకి ప్రభుత్వం తేదీలు ఖరారు చేయనుంది. నిర్దేశిత తేదీల్లో రేషన్ దుకాణాల్లో చీరలను పంపిణీ చేయనున్నారు. సిరిసిల్లలో పవర్‌లూంలో వీటిని తయారు చేస్తున్నారు. కాగా, గతంలో రెండుసార్లు పెద్దగా నాణ్యత లేవని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు తీసుకోలేదు. ఈ సారి ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment