చేనేతల సంక్షేమానికి ప్రాధాన్యం
- నేతన్నల సంక్షేమ కార్యక్రమాలు తక్షణం ప్రారంభించండి
- బతుకమ్మ చీరల పంపిణీపై సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికుల సంక్షేమం కోసం తలపెట్టిన యార్న్, రసాయనాలు, అద్దకాల సబ్సిడీ వంటి కార్యక్రమాలను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపుల్లో చేనేత శాఖకు పెద్ద పీట వేశామన్నారు. డిమాండ్ ఉన్న జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టెస్కో షోరూమ్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ చీరల పంపిణీతో పాటు శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలపై సోమవారం ఆయన బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ఈ నెల 16 నాటికి చీరలన్నీ జిల్లా కేంద్రాలకు చేరతాయని, 17, 18, 19 తేదీల్లో పంపిణీ పూర్తవుతుందని అధికారులు మంత్రికి తెలిపారు. చీరల పంపీణీలో ఏ ఇబ్బందులూ లేకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రెండు నెలల వ్యవధిలో 1.06 కోట్ల అడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేతన్నలకు ఉపాధితో పాటు, పండగ సందర్భంగా అడపడుచులకు సంతోషం పంచిన ట్టవుతుందన్నారు.
త్వరలో చేనేత వార్షిక ప్రణాళిక...
ఇకపై ప్రభుత్వం సేకరించే ప్రతి మీటర్ వస్త్రాన్ని రాష్ట్రం నుంచే తీసుకొంటామని కేటీఆర్ చెప్పారు. త్వరలో చేనేత వార్షిక ప్రణాళికను ప్రకటిస్తా మన్నారు. దీని ద్వారా వచ్చే ఏడాది నుంచి నేతన్నలకు కనీసం ఏడాదిలో 8 నెలల పాటు ప్రభుత్వం సేకరించే వస్త్రాల ఉత్పత్తిపై పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆర్డర్లతో నెలకు కనీసం రూ.15 వేలు చొప్పున 3 నెలలు లభించిందన్నారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ చీరలు, రాజీవ్ విద్యా మిషన్ ద్వారా పంపిణీ చేసే స్కూల్ యూనిఫాంల సేకరణను వ్యవస్థీకృతం చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో తక్షణమే సమావేశాలు జరపాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే చేనేత మగ్గాలు, కార్మికుల పూర్తి సమాచారముందని, పవర్‌లూమ్ కార్మికుల సమాచారం సేకరించి డిజిటలైజ్ చేయా లన్నారు. ఇకపై కేంద్ర మంత్రులను కలిసే సంద ర్భంలో తెలంగాణ చేనేత వస్త్రాలు, గోల్కొండ కళాకృతులను అందిచాలని సూచించారు.