handicrafts
-
వస్త్రాల ఎగుమతులు రూ.1.82 లక్షల కోట్లు
టెక్స్టైల్స్, అప్పారెల్ (వస్త్రాలు, దుస్తులు) ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) తొలి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్–అక్టోబర్) 21.35 బిలియన్ డాలర్లకు (రూ.1.82 లక్షల కోట్లు) వృద్ధి చెందాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 20 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే ఏడు శాతం వృద్ధి నమోదైంది. 8,733 మిలియన్ డాలర్ల(USD) ఎగుమతులు (మొత్తం ఎగుమతుల్లో 41 శాతం) రెడీమేడ్(readymade) వస్త్ర విభాగంలోనే నమోదయ్యాయి.కాటన్ టెక్స్టైల్స్ విభాగం నుంచి 7,082 మిలియన్ డాలర్లు (33 శాతం), మనుషుల తయారీ టెక్స్టైల్స్ ఎగుమతులు 3,105 మిలియన్ డాలర్లు (15 శాతం) చొప్పున ఉన్నట్టు కేంద్ర టెక్స్టైల్స్(Textile) శాఖ గణాంకాలు విడుదల చేసింది. వూల్ విభాగంలో 19 శాతం, హ్యాండ్లూమ్ విభాగంలో 6 శాతం చొప్పున ఎగుమతులు క్షీణించగా, మిగిలిన అన్ని విభాగాల్లో ఎగుమతుల వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. మరోవైపు ఇదే కాలంలో టెక్స్టైల్స్, అప్పారెల్ దిగుమతులు ఒక శాతం క్షీణించి 5,425 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ప్రకటించింది. అత్యధికంగా మ్యాన్ మేడ్ టెక్స్టైల్స్ దిగుమతులు 1,859 మిలియన్ డాలర్లు (34 శాతం)గా ఉన్నాయి. కాటన్ టెక్స్టైల్స్ విభాగంలో, ప్రధానంగా కాటన్ ఫైబర్(Cotton Fiber) దిగుమతులు పెరిగినట్టు టెక్స్టైల్స్ శాఖ నివేదిక వెల్లడించింది. ఇది దేశీ తయారీ సామర్థ్యం పెరగడాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!అంతర్జాతీయంగా 3.9 శాతం వాటా..2023–24లో టెక్స్టైల్స్, అప్పారెల్ దిగుమతులు 8.94 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 15 శాతం తగ్గాయి. 2023 సంవత్సరం టెక్స్టైల్స్ ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా ఆరో అతిపెద్ద దేశంగా నిలిచింది. ‘టెక్స్టైల్స్, అప్పారెల్ అంతర్జాతీయ మార్కెట్లో మన దేశ వాటా 3.9 శాతంగా ఉంది. యూఎస్ఏ, ఈయూ 47 శాతం వాటాతో భారత్‌కు అతి పెద్ద ఎగుమతి కేంద్రాలుగా ఉన్నాయి. టెక్స్టైల్స్, అప్పారెల్ పరంగా వాణిజ్య మిగులుతో మన దేశం ఉంది.’అని టెక్స్టైల్స్ శాఖ వెల్లడించింది. -
నేరాలకు దూరంగా... ఉపాధికి దగ్గరగా..!
ఆరిలోవ(విశాఖ తూర్పు): వివిధ కేసుల్లో శిక్ష పడి జైలులో ఉన్న ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఖైదీలకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పించి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తోంది. తాజాగా ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతోపాటు జైలు నుంచి విడుదలయ్యాక నేర ప్రవృత్తిని విడనాడి అందరిలాగే పనిచేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల విశాఖ కేంద్ర కారాగారంలో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో వివిధ విభాగాలకు చెందిన సోషల్ వర్కర్లను సభ్యులుగా నియమిస్తారు. దీనికోసం ఈ నెల 5న సోషల్ కౌన్సెలర్, ఎన్జీవోలు, సోషల్ వర్కర్లు, సైకాలజిస్ట్‌లు, వెల్ఫేర్ ఆఫీసర్లు, బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేంద్ర కారాగారంలో సమావేశం నిర్వహించారు. వారిలో ఐదుగురిని ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు. సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏం చేస్తారంటే... ► ఖైదీలకు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి ప్రవర్తనలో మంచి మార్పు తీసుకువస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కృషి చేస్తారు. ► ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రతినిధులు వచ్చి ఖైదీలకు వివిధ చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయినవారికి సర్టీఫికెట్ అందజేస్తారు. ► ఈ శిక్షణ వల్ల ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత సమాజంలో పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ► ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన సర్టిఫికెట్ ఉన్న ఖైదీలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ► ఈ చర్యల వల్ల ఖైదీల్లో నేరప్రవృత్తి తగ్గుతుందని, ఆర్థికంగా ఎదిగి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ఏపీ పెవిలియన్‌కు విశేష ఆదరణ
సాక్షి, అమరావతి: ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్–2023లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌కు సందర్శకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ‘వసుధైక కుటుంబం–యునైటెడ్ బై ఇండియా’ పేరుతో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 14న ప్రారంభమైన ఎగ్జిబిషన్ నవంబర్ 27వ తేదీతో ముగియనుంది. రాష్ట్రం నుంచి 195 దేశాలకు 3,137 ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆయా దేశాలతో కుటుంబ సభ్యులుగా మారి వసుధైక కుటుంబంగా ఎలా ఎదిగిందన్న విషయాన్ని తెలియచేసే విధంగా ఏపీ పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎగ్జిబిషన్లో 550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సందర్శకులను కట్టిపడేసే విధంగా ఏపీ పెవిలియన్ తీర్చిదిద్దింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఈ పెవిలియన్‌ను ప్రారంభించారు. భారీగా సందర్శకుల తాకిడి రాష్ట్రంలోని హస్తకళలు, భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులతో పాటు హస్తకళా ఉత్పత్తులతో ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా సందర్శకుల తాకిడి అధికంగా ఉందని, ప్రతిరోజు లక్ష మందికిపైగా సందర్శకులు పెవిలియన్‌ను సందర్శిస్తున్నారని పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ (ఎగుమతులు) జీఎస్ రావు ‘సాక్షి’కి చెప్పారు. కలంకారీ, మంగళగిరి జరీ, ధర్మవరం పట్టు, నెల్లూరు ఉడెన్ కట్లరీ, లేపాక్షి, తోలు బొమ్మలు వంటి వాటికి సందర్శకుల నుంచి మంచి స్పందన వచ్చిదని, పలువురు భారీగా కొనుగోళ్ల ఆర్డర్లు ఇచ్చారని వివరించారు. నాలుగున్నర ఏళ్లుగా ఏపీలో నాడు–నేడు కింద అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇంగ్లిష్ లో వివరిస్తూ ఆర్ట్ రూపంలో ఏర్పాటు చేసిన చిత్రానికి మంచి స్పందన వచ్చిదని, పలువురు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కొనియాడారని చెప్పారు. అధికారులకు అభినందన పెవిలియన్‌లో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ వైఎస్సార్ ఏపీ వన్ కింద ఏవిధంగా త్వరతగతిన అనుమతులు జారీ చేస్తున్నారో తెలియజేసే కియోస్్కని పలువురు సందర్శించారు. 974 కి.మీ. తీర ప్రాంతాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నదీ, మత్స్య ఎగుమతుల్లో ఏపీ నంబర్–1 స్థానంలో ఉందన్న విషయాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద పలువురు ఫొటోలు దిగుతున్నారు. సాయంత్రం వేళ రాష్ట్రంలోని సంప్రదాయ కళలను పరిచయం చేసేవిధంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రగతిని ప్రపంచ దేశాలకు తెలియచేసే విధంగా పెవిలియన్‌ను తీర్చిదిద్దారంటూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ అధికారులను ప్రశంసించారు. కాగా.. సందర్శకులను విశేషంగా ఆకర్షించిన ఏపీ పెవిలియన్‌కి ఐఐటీఎఫ్ జ్యూరీ అవార్డు ప్రకటించింది. -
Kanyaputri Dolls: బిహార్ బొమ్మలట- కొలువుకు సిద్ధమట
ప్రతి సంస్కృతిలో స్థానిక బొమ్మలుంటాయి. మనకు కొండపల్లి, నిర్మల్... బిహార్‌లో కన్యాపుత్రి. అయితే బార్బీలు, బాట్‌మేన్‌ల హోరులో అవన్నీ వెనుకబడ్డాయి. కాని పిల్లలకు ఎటువంటి బొమ్మలు ఇష్టమో తెలిసిన టీచరమ్మ నమితా ఆజాద్ అక్కడ వాటికి మళ్లీ జీవం పోసింది. కొలువు తీర్చింది. సంస్కృతిలో భాగమైన ఆ బొమ్మలను చూడగానే పిల్లలకు ప్రాణం లేచివస్తు్తంది. నమిత చేస్తున్న కృషి గురించి.. ఒక టీచరమ్మ కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మల కోసం బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగం వదిలేసింది. మనుషులు అలాగే ఉంటారు. ఏదైనా మంచి పని చేయాలంటే చేసి తీరుతారు. పట్నాకు చెందిన నమితా ఆజాద్‌ను వారం క్రితం బిహార్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘బిహార్ హస్తకళల పురస్కారం–2023’తో సత్కరించింది. పిల్లల బొమ్మల కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేయడమే అందుకు కారణం. కన్యాపుత్రి బొమ్మలు వీటిని బిహార్‌లో ‘గుడియా’ అని కూడా అంటారు. బిహార్‌లో చంపారన్ జిల్లాలో గుడ్డ పీలికలతో తయారు చేసే బొమ్మలు ఒకప్పుడు సంస్కృతిలో భాగంగా ఉండేవి. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఒక ప్రత్యేకమైన రోజున ఇంటి ఆడపిల్లలు ఈ బొమ్మలను విశేషంగా అలంకరించి దగ్గరలోని చెరువు ఒడ్డున నిమజ్జనం చేస్తారు. వారి అన్నయ్యలు ఆ బొమ్మలను వెలికి తెచ్చి చెల్లెళ్లకు ఇస్తారు. ఆ తర్వాత మిఠాయిలు పంచుకుంటారు. కన్యాపుత్రి బొమ్మలు ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లల్లో ఉంచుతారు. పిల్లలు ఆడుకుంటారు. కొత్త పెళ్లికూతురు అత్తారింటికి వచ్చేటప్పుడు తనతో పాటు కొన్ని అలంకరించిన కన్యాపుత్రి బొమ్మలు తెచ్చుకోవడం ఆనవాయితీ. ‘నా చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మలు ఈ బొమ్మలు చూపిస్తూ ఎన్నో కథలు చెప్పడం జ్ఞాపకం’ అంటుంది నమితా ఆజాద్. వదలని ఆ గుడియాలు నమితా ఆజాద్... చంపారన్ జిల్లాలో పుట్టి పెరిగింది. ఎం.ఏ. సైకాలజీ చేశాక చండీగఢ్‌లోని ‘ప్రాచీన్ కళాకేంద్ర’లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌లో మాస్టర్స్ చేసింది. ఆ సమయంలోనే ఆమెకు బాల్యంలో ఆడుకున్న కన్యాపుత్రి బొమ్మలు గుర్తుకొచ్చాయి. వాటిని తిరిగి తయారు చేయాలని అనుకుంది. ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళలతో కొన్ని బొమ్మలు తయారు చేసి ఒక ప్రదర్శనలో ఉంచితే వెంటనే అమ్ముడుపోయాయి. ఆమెకు ఉత్సాహం వచ్చింది ఆ రోజు నుంచి ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కన్యాపుత్రి బొమ్మలను తయారు చేస్తూ హస్తకళల ప్రదర్శనలో ప్రచారం చేసింది. 2013 నాటికి వాటికి దక్కుతున్న ఆదరణ, వాటి అవసరం అర్థమయ్యాక ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్నే మానేసింది. పిల్లల సైకాలజీ తెలిసి పిల్లల సైకాలజీ తెలిసిన వారికి బొమ్మలు పిల్లల వికాసానికి ఎంతగా ఉపయోగపడతాయో తెలుస్తుంది అంటుంది నమితా. ఆ బొమ్మలతో పశు పక్ష్యాదులను తయారు చేస్తారు కనుక కవాటి వల్ల సమిష్టి కుటుంబాలు, మైక్రో కుటుంబాలు, అన్నా చెల్లెళ్ల బంధాలు, సామాజిక బంధాలు, పర్యావరణ స్పృహ అన్నీ తెలుస్తాయి అంటుంది నమితా. పిల్లలకు సామాజిక సందేశాలు ఇవ్వాలన్నా, కొన్ని పాఠాలు వారికి అర్థమయ్యేలా చెప్పాలన్నా ఈ బొమ్మలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆమె టీచర్లకు నిర్వహించి వర్క్‌షాప్‌ల ద్వారా తెలియచేస్తోంది. నమితా లాంటి సంస్కృతీ ప్రేమికులు ప్రతిచోటా ఉంటే సిసలైన పిల్లల బొమ్మలు వారిని సెల్ఫోన్ల నుంచి వీడియో గేమ్స్ నుంచి కాపాడుతాయి. ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు కన్యాపుత్రి బొమ్మలు ప్లాస్టిక్ లేనివి. అదీగాక మారణాయుధాలు, పాశ్చాత్య సంస్కృతి ఎరగనివి. మన దేశీయమైనవి. టైలర్ల దగ్గర పడి ఉండే పీలికలతో తయారు చేసేవి. అందుకే నమితా ఇప్పుడు ‘ఎన్‘ క్రియేషన్స్ అనే సంస్థ పెట్టి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించి ఈ బొమ్మలు తయారు చేస్తోంది. అంతే కాదు బిహార్ అంతా తిరుగుతూ వాటిని తయారు చేయడం మహిళలకు నేర్పించి వారికి ఉపాధి మార్గం చూపుతోంది. -
Nita Ambani: రిలయన్స్ ‘స్వదేశ్ స్టోర్’ లాంఛ్. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
కేటీఆర్ మనసు దోచుకున్న కార్పెంటర్: మీరు కూడా ఫిదా అవుతారు
ప్రతిభ ఎవడి సొత్తూ కాదు. కానీ అసామాన్య ప్రతిభ మాత్రం కొందరికే సొంతం. రోజూ చేసే పనే అయినా దానిలో బుద్ధి కుశలతను ప్రదర్శించి, మేధో తనాన్ని రంగరించి కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతారు. ఆధునిక పోకడలకు, తమదైన టెక్నాలజీ జోడించి శభాష్ అనుపించుకుంటారు. అలాంటి నైపుణ్యంతో ఒక కార్పెంటర్ వార్తల్లో నిలిచారు. ఈ కళాకారుడు హస్తకళా నైపుణ్యంతో సత్యనారాయణ వ్రత పీఠాన్ని తయారు చేసిన తీరు అద్భుతంగా నిలిచింది. (ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ వీడియో: బిగ్ సెల్యూట్ అంటున్న నెటిజన్లు) నేతన్న నైపుణ్యాన్ని చిన్న అగ్గిపెట్టెలో చీరను మడిచిపెట్టిన చందంగా ఒక కార్పెంటర్ పెట్టెలో పూజా పీఠాన్ని విడిగా అమర్చాడు. ఆ తరువాత ఒక్కో భాగాన్ని తీసి ఒక క్రమంగా పద్దతిలో ఎటాచ్ చేయడం సూపర్బ్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను రాగుల సంపత్ ట్విటర్లో షేర్ చేశారు. దీన్ని తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ఆయనకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి ఫిదా అయిన కేటీర్ చాలా గ్రేట్ స్కిల్ అంటూ కమెంట్ చేశారు. అతనికి ఎలా చేయూత అందించవచ్చో పరిశీలించాల్సిందిగా సంబంధింత అధికారులకు ట్విటర్ ద్వారా సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లును విపరీతంగా ఆకట్టుకుంటోంది. (దుబాయ్‌లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతిపోవాల్సిందే!) Absolutely great skill Request @TWorksHyd to reach out to see how we could help https://t.co/KQe8zKOrCY — KTR (@KTRBRS) August 16, 2023 -
హస్తకళా వేదికను ప్రారంభించిన వైఎస్ఆర్...
-
ఆమె పేరే ఓ బ్రాండ్
గుజరాత్‌లోని కచ్‌లో ఒక మారుమూల గ్రామవాసి పాబిబెన్ రబారి. మేకలు, గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తిగా ఉన్న పాబిబెన్ ఇప్పుడు 300 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. జరీ ఎంబ్రాయిడరీ, బ్యాగుల తయారీతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. హస్తకళాకారిణిగా ఆమె కృషి, సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. పాబిబెన్ బాల్యం తీవ్ర కష్టాలతో గడిచింది. ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడం, తల్లి కొన్ని ఇళ్లలో పాచిపని చేస్తూ తనను, తన చెల్లెలిని పెంచిన విధానాన్ని, మేకలను, గొర్రెలను మేపుకుంటూ బతికిన రోజులను గుర్తు చేసుకుంటుంది ఆమె. ఉన్న కొద్దిపాటి సమయంలో తల్లి సంప్రదాయ ఎంబ్రాయిడరీ పని చేస్తుండేది. అక్కడి వారి కమ్యూనిటీ వివాహ వేడుకల సమయాల్లో తప్పనిసరిగా ధరించే సంప్రదాయ ఎంబ్రాయిడరీ బ్లౌజులు, దుప్పట్లను తయారు చేసేది. ఒక్కో సంప్రదాయ ఎంబ్రాయిడరీ తయారీకి ఏడాదికి పైగా సమయం పట్టేది. ఈ సంప్రదాయం కారణంగా వారి కమ్యూనిటీలో వివాహాలు ఆలస్యం అయ్యేవి. దీంతో కొన్నాళ్లకు ఈ ఎంబ్రాయిడరీని ఆ కమ్యూనిటీ పక్కనపెట్టేసింది. ఈ సమయంలోనే పాబిబెన్ ఈ సంప్రదాయ ఎంబ్రాయిడరీలో ప్రావీణ్యం సాధించింది. ఒక కళారూపం కనుమరుగు కాకుండా కాపాడాలని నిశ్చయించుకుంది. తమ కమ్యూనిటీలో సంప్రదాయ ఎంబ్రాయిడరీని ప్రతిబింబించే కొత్త రూపాన్ని కనిపెట్టింది. ఇది వేగంగా, తక్కువ శ్రమతో కూడుకున్న కళ కావడంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది. పాబిబెన్ మొదట నలుగురైదుగురు మహిళలతో కలిసి వివాహ సమయంలో ధరించే ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లను తయారు చేసేది. చదువు లేకపోయినా తమకు వచ్చిన కళను కాపాడాలని, సాటి మహిళలకు ఉపాధి కల్పించాలనుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలను కలిసింది. కళలకు సంబంధించిన ఆ సంస్థల నుండి కొన్ని ప్రాజెక్ట్ వర్క్‌లను తీసుకుంది. ‘కానీ, నన్ను ఒక ఆలోచన ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. ఈ కళ మా సొంతం. కానీ, మాకు సరైన గుర్తింపు వచ్చేది కాదు. మేం తయారు చేసిన వాటిని వేర్వేరు బ్రాండ్ల కింద అమ్మేవారు. దీనినుంచి బయటపడేందుకు, మా హస్తకళకు మేమే ప్రాచుర్యం తెచ్చుకోవాలని ఉండేది. దీంతో పెద్దస్థాయి అధికారులను కలిశాను. వారి సూచనల మేరకు మా కళకు ఒక ఇంటిని ఏర్పాటు చేశాం. చేతివృత్తుల వారికి మార్కెట్ ప్లేస్‌గా ఆ స్థలాన్ని ప్రారంభించాం. మొదట ఇది చిన్న వ్యాపారంగానే ప్రారంభమైంది కానీ, పనితో పాటు గుర్తింపు కూడా రావాలనుకున్నాను. అది ఈ ఏడేళ్ల సమయంలో సాధించగలిగాం’ అని చెబుతుంది పాబిబెన్. పాబిబెన్ మొదటి ఉత్పత్తి స్లింగ్ బ్యాగ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘పాబీ బ్యాగ్’ అని ఆమె పేరుతోనే ఆ బ్యాగ్‌ను పిలిచేటంత ఘనత సాధించింది ఈ హస్తకళాకారిణి. పాబిబెన్ బ్రాండ్‌తో ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ‘పాబిబెన్.కామ్’ అక్కడి గ్రామీణ మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతోంది. -
హస్తకళాకారులకు జాతీయ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ హస్త కళలు, టైక్స్టైల్స్ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి కేంద్రం అవార్డులు అందజేసింది. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేసినట్లు టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 2017, 2018, 2019లో జాతీయ అవార్డులకు మొత్తం 78 మంది హస్త కళాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. 2018కి తెలంగాణ నుంచి కరీంనగర్‌కు చెందిన గద్దె అశోక్‌కుమార్ (సిల్వర్ ఫిలిగ్రీ)కి అందజేసినట్లు తెలిపింది. ఏపీ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన దాలవాయి కుళాయప్ప (లెదర్ పప్పెట్రీ, 2017), డి.శివమ్మ (లెదర్ పప్పెట్రీ, 2019)లకు అవార్డు అందజేసినట్లు పేర్కొంది. అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువా, ధ్రువపత్రం అందజేసినట్లు తెలిపింది. అలాగే, 2017, 2018, 2019 సంవత్సరాలకు మొత్తం 30 మంది శిల్పగురులను ఎంపిక చేయగా ఏపీ నుంచి బ్లాక్ మేకింగ్‌లో కొండ్ర గంగాధర్ (2018), కలంకారిలో వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి (2019)ను ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరికి బంగారు నాణెం, రూ.2 లక్షల నగదు, తామ్రపత్రం, శాలువా, ప్రశంసాపత్రం అందజేసినట్లు తెలిపింది. పీయూష్ గోయల్ నుంచి అవార్డు అందుకుంటున్న గద్దె అశోక్‌కుమార్ -
రాష్ట్రంలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేస్తాం
చైతన్యపురి (హైదరాబాద్): తెలంగాణలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీనగర్ కాలనీలో పద్మశ్రీ గజం గోవర్ధన నివాసంలో ఏర్పాటు చేసిన చేనేత ఆర్ట్ గ్యాలరీని ఎమ్మెల్సీ ఎల్‌రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాలు, మగ్గాల గురించి కేటీఆర్‌కు గోవర్ధన వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..చేనేత కళను, చేనేత కళాకారులను ప్రోత్సహించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుదేనని తెలిపారు. పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబాలకు నేతన్న ధీమా పథకాన్ని ప్రవేశపెట్టామని, చేయూత, చేనేత మిత్ర పేరుతో నూలు, రసాయనాలపై 40% రాయితీ ఇస్తున్నామని వెల్లడించారు. చేనేత ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించటం తనకు దక్కిన అవకాశంగా భావిస్తున్నానని, ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చేనేత కళాకారుల సంక్షేమానికి పాటుపడుతున్న గజం గోవర్ధనను ఆయన అభినందించారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‌కుమార్, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, చేనేత కళాకారులు పాల్గొన్నారు. -
విలేజ్ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే!
మారుమూల గ్రామాల్లో ఉన్న మహిళలు చదువుకోలేకపోవచ్చు. కానీ, వారి చేతుల్లో అందమైన మన ప్రాచీన కళావైభవం దాగుంటుంది. తరతరాలుగా వస్తున్న ఆ వైభవం ఇప్పటికీ మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఆ కళల పట్ల ఉన్న వారి ప్రతిభను ఆ గ్రామాలకే పరిమితం అవడం లేదు. దేశ సరిహద్దులు దాటుతున్నాయి. మన దేశీయ హస్తకళలకు విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను గమనించి, ప్రాచీన హస్తకళలకు తిరిగి జీవం పోస్తున్న వారెందరో తమతో పాటు వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎదుగుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని సురోలి గ్రామానికి చెందిన పూజా షాహి ఊళ్లో తయారు చేసిన హస్తకళలను అమెరికా–జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తోంది. 2009లో కొంతమందితో మొదలుపెట్టిన చిన్న స్టార్టప్ నేడు లక్షల టర్నోవర్ సాధిస్తోంది. నిరక్షరాస్యులైన ఇక్కడి మహిళలు తయారు చేసిన హస్తకళలను ఇప్పుడు అమెరికా, జర్మనీలకు పంపుతున్నారు. అమ్మమ్మల కాలపు కళగా పేరొందిన క్రొయేషియా కళ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. దీనికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడి గ్రామీణ మహిళల జీవితాలను మార్చేసింది. ‘నేను ఇంటర్మీడియెట్ వరకు చదివాను. చిన్నప్పటి నుండి మా అమ్మ క్రొయేషియా నుండి వివిధ వస్తువులను తయారు చేయడం చూశాను. వాటి నుండి చాలా ప్రేరణ పొందాను. మెల్లగా నా చెయ్యి కూడా క్రొచెట్ అల్లడం మొదలుపెట్టింది. రకరకాల బొమ్మలు, అలంకరణ వస్తువులు క్రొచెట్తో తయారు చేస్తూ, ఆర్డర్ల ద్వారా వాటిని ఇస్తుండేదాన్ని. తర్వాత్తర్వాత నా చుట్టూ మా ఊళ్లో ఉన్న మహిళలపైన దృష్టి పెట్టాను. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటిపని, వంటపని, పిల్లలపని.. దీంట్లో ఉండిపోతారు. ఈ ఆడవాళ్లు డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే వారి అదృష్టం మారుతుందనుకున్నాను. అలా, వారి చేత కూడా సోఫాకవర్లు, టీవీ కవర్లు, ఊయల, వాల్ హ్యాంగర్లు, ఫొటో ఫ్రేములు, కర్టెన్లు, బాటిల్ హోల్డర్లు, వాలెట్లు తయారు చేయించేదాన్ని. ‘జాగృతి యాత్ర’ సంస్థ పరిచయం అయ్యాక ఈ ఉత్పత్తులను ఎలా అమ్మాలి అనే విషయాలపై అవగాహన వచ్చింది. ‘డియోరియా డిజైన్’ పేరుతో కంపెనీ ప్రారంభించాను. ఇది ఇప్పుడు సంపాదన క్రాఫ్ట్‌గా మారింది. 100 రకాల అలంకార వస్తువులు, 50 రకాలకు పైగా ఆభరణాలు, ఉపకరణాలను తయారుచేస్తున్నాం. వీటిని అమెరికా, జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటివరకు 35 వేల మంది మహిళలు శిక్షణ పొందారు. రాబోయే మూడేళ్లలో పదివేల మంది మహిళలు పర్మినెంట్ ఉద్యోగులుగా పనిచేయాలన్న లక్ష్యంగా కృషి చేస్తున్నాను. మా డిజైన్స్‌కి ‘వన్ డిస్ట్రిక్ట్... వన్ ప్రొడక్ట్’ అని పేరు పెట్టారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నన్ను ‘దేవి’ అవార్డుతో సత్కరించి, మా పనిని అభినందించారు. మొదట్లో నా కుటుంబసభ్యులే నాకు మద్దతుగా నిలవలేదు. కానీ, నేడు నా హస్తకళల పనిలో నిమగ్నమవడంతో నేను విజయం సాధించాను అనిపించింది’ అంటారు పూజా షాహి. కుట్టుపనికి అంతర్జాతీయ మార్కెట్ గుర్తింపు మహిళలకు శక్తినిస్తుంది. ఏదైనా చేయగలరని భావించేలా చేస్తుంది. అప్పుడు వారు తమ విలువను అర్థం చేసుకుంటారు’ అంటారు స్వరా బో దబ్ల్యూ ఫౌండర్ ఆశా స్కారియా. కేరళలోని ఎట్టుమనూరు చెందిన ఆశా హస్తకళాకారులను గుర్తించి, వారి కళను మరింత శక్తిమంతం చేస్తుంది. ‘మహిళలు ఇంటి నుండి పనిచేస్తారు. వారు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉపాధిని కల్పించుకోవడంతో పాటు సాధికారికంగా ఉంచుతుంది’ అంటారు ఆమె. స్వరాబ్రాండ్ కళాకారులు తయారుచేసిన చీరలను అంతర్జాతీయంగా మార్కెట్ చేస్తుంది. దేశమంతటా గ్రామీణ మహిళలల్లో దాగున్న ప్రాచీన కుట్టుపని నైపుణ్యాలను పెంపొందింపజేస్తుంది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్, కేరళకు చెందిన కళాకారులతోపాటు దుంగార్పూర్లోని వారితోనూ, మహిళా కళాకారులను సమీకరించిన స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంది. అంతేకాదు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని మహిళలు లేదా మానవ అక్రమ రవాణా నుండి రక్షించబడిన మహిళలకు మద్దతుగా స్వరా పనిచేస్తుంది. కళల పట్ల అభిరుచితో... సుర్భి అగర్వాల్ జోద్‌పూర్‌లో స్పెషాలిటీ హాస్పిటల్‌ను నడుపుతున్న తన కుటుంబ వ్యాపారాన్ని విడిచిపెట్టి కళ పట్ల ఆమెకున్న అభిరుచిని అందిపుచ్చుకుంది. దేశంలోని వెనుకబడిన మహిళలకు సహాయం చేయాలనుకుంది. రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని హస్తకళాకారులతో కలిసి, గృహాలంకరణ ఉత్పత్తులను తయారుచేయడానికి ‘ది ఆర్ట్ ఎక్సోటికా’ను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా హస్తకళాకారులతో కలిసి గృహాలకంరణ ఉత్పత్తులను తయారు చేయిస్తూ, వాటిని అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని నేత కార్మికులకు సహాయం చే యడానికి ఆమె తన గ్యారేజ్ నుంచి వర్క్ ప్రారంభించింది. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు హస్తకళలను, చేనేత ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది సుర్బి. చదవండి: ‘100 రకాల’ డ్రాగన్ రైతు! ఒక్కో మొక్క రూ. 100 నుంచి 4,000 వరకు అమ్మకం! -
వ్యాపారాల్లో మహారాణులు: మష్రూమ్ పౌడర్‌తో థైరాయిడ్కి చెక్
కోచి: వ్యాపారంలో వారికంటూ ఓ చోటు కల్పించుకున్నారు. తమదైన ‘బ్రాండ్’ను సృష్టించుకోవడమే కాదు.. మార్కెట్ అవకాశాలను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. ప్రగతి దిశగా సాగిపోతున్న ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు వారంతా. కోచిలో ఏర్పాటు చేసిన ‘వ్యాపార్ 2022’ పారిశ్రామిక ఎగ్జిబిషన్లో వీరు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. 300 స్టాల్స్ ఏర్పాటు చేస్తే.. అందులో 65 మంది మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటైనవి. వీరిని పలుకరించగా.. ఎన్నో ఆసక్తికర విషయాలు, వ్యాపారంలో గొప్ప దార్శనికత, లక్ష్యం దిశగా వారికి ఉన్న స్పష్టత, ఆకాంక్ష వ్యక్తమైంది. చేతితో చేసిన ఉత్పత్తులు, ఆహారోత్పత్తులు ఇలా ఎన్నింటినో వారు ప్రదర్శనకు ఉంచారు. వీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు అందించడమే కాదు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ తమకంటూ స్థానాన్ని సంపాదించుకున్నారు. ► సహజసిద్ధ రీతిలో పుట్టగొడుగులు (మష్రూమ్స్) సాగు చేస్తూ వాటిని అందరిలా కేవలం మార్కెట్లో విక్రయించడానికి ‘నహోమి’ బ్రాండ్ పరిమితం కాలేదు. విలువ ఆధారిత ఉత్పత్తులను రూపొందించి కొత్త మార్కెట్‌ను సృష్టించుకుంది. ఓయెస్టర్ మష్రూమ్ పౌడర్, ఆయిల్, చాక్లెట్, సోప్, పచ్చళ్లు, కేక్ ఇలా భిన్న ఉత్పత్తులతో కస్టమర్ల ఆదరణ చూరగొంటోంది. ‘‘ఒయెస్టర్ మష్రూమ్ పౌడర్ థైరాయిడ్ నయం చేయడంలో మంచి ఫలితాన్నిస్తోంది. విక్రయం కాకుండా మిగిలిన మష్రూమ్లను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారుస్తాం. పెద్ద విక్రయ సదస్సుల్లో వాటిని విక్రయిస్తుంటాం’’అని నహోమి వ్యవస్థాపకురాలు మినిమోల్ మ్యాథ్యూ తెలిపారు. కేరళలోని తిరువనంతపురం సమీపంలో వితుర ప్రాంతానికి చెందిన ఆమె దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ వ్యాపార మేళాల్లో ఆమె పాల్గొంటుంటారు. ► కేరళలోని కలపెట్టా ప్రాంతానికి చెందిన గీత.. ‘వెస్ట్ మౌంట్ కేఫ్’ పేరుతో వ్యాపార వెంచర్ ప్రారంభించి.. నాణ్యమైన కాఫీ రుచులను ‘అరబికా కాఫీ’ బ్రాండ్‌పై ఫైవ్ స్టార్ హోటళ్లకు, దుబాయి మార్కెట్‌కు అందిస్తున్నారు. అరబికా కాఫీ ప్రీమియం బ్రాండ్. సంపన్న రెస్టారెంట్లు, బ్రాండెడ్ సూపర్ మార్కెట్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ► తలగడలు, పరుపులు తయారు చేసే ‘విఫ్లవర్స్’ ఆవిష్కర్త అరుణాక్షి కాసర్‌గఢ్‌కు చెందిన మహిళ. కరోనా సమయంలో ఏర్పాటైంది ఈ సంస్థ. గతేడాది రూ.50 లక్షల వ్యాపారాన్ని నమోదు చేశారు. ‘‘నేను 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. అందరూ మహిళలే. కర్ణాటక, కేరళ మా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి’’అని అరుణాక్షి తెలిపారు. ► శాఖాహార, మాంసాహార పచ్చళ్లకు ప్రసిద్ధి చెందిన ‘టేస్ట్ ఆఫ్ ట్రావెన్కోర్’ అధినేత సుమారేజి పతనం తిట్టకు చెందిన వారు. 25 రకాల పచ్చళ్లను ఆమె మార్కెట్ చేస్తున్నారు. ఎటువంటి ప్రిజర్వేటివ్‌లు కలపకుండా సహజ విధానంలో పచ్చళ్లు తయారు చేసి విక్రయించడం టేస్ట్ ఆఫ్ ట్రావెన్ కోర్ ప్రత్యేకత. ఈ ప్రత్యేకత వల్లే లులూ గ్రూపు హైపర్మార్కెట్లో తమ ఉత్పత్తులకు చోటు దక్కిందంటారు ఆమె. వ్యాపార సదస్సు 2022 ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు ఎన్నో పలకరిస్తున్నట్టు ఆమె చెప్పారు. ► ఇంజనీరింగ్ చదివిన వందనా జుబిన్ ఏదో ఒక మంచి ఉద్యోగానికి అతుక్కుపోలేదు. ‘మినీఎం’ పేరుతో చాక్లెట్ కంపెనీ ఏర్పాటు చేశారు. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు చాక్లెట్లను నచ్చని వారు ఉండరు. చాక్లెట్లో ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి. అలాగే, చక్కెర రూపంలో కీడు కూడా ఉంది. జుబిన్ ఆ చక్కెరను వేరు చేశారు. చక్కెర రహిత చాక్లెట్లతో ఎక్కువ మందిని చేరుకుంటున్నారు. షుగర్ బదులు తీపినిచ్చే స్టీవియాను ఆమె వినియోగిస్తున్నారు. 25 రకాల చాక్లెట్లను ఆమె మార్కెట్ చేస్తున్నారు. పెద్ద ఈ కామర్స్ సంస్థలతో టైఅప్ చేసుకుని ఎక్కువ మందిని చేరుకోవడమే తన లక్ష్యమని తెలిపారు. -
మరో ఆరు లేపాక్షి షోరూమ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హస్తకళలకు పెద్దఎత్తున ప్రచారం కల్పించడంతోపాటు వాటికి బ్రాండ్ ఇమేజ్ కల్పించడంలో లేపాక్షి ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వీటి తయారీలో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా కళాకారులు 23 రకాల హస్తకళలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ మరింత ఉపాధి చూపడంతోపాటు ఆ కళలను బతికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తరణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ప్రస్తుతమున్న 17 లేపాక్షి ఎంపోరియంలకు అదనంగా ఇప్పుడు మరో ఆరు కొత్త షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విశాఖపట్నం, విశాఖ విమానాశ్రయం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుమల, తిరుపతి, తిరుపతి శ్రీనివాసమ్, విష్ణు నిలయం, తిరుపతి విమానాశ్రయంతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, న్యూఢిల్లీలో లేపాక్షి షోరూమ్‌లు ఉన్నాయి, కొత్తగా విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గండికోట, కడప, తిరుపతిలో కూడా మరిన్ని షోరూమ్‌లు ఏర్పాటుచేయనున్నారు. ఒక్కో షోరూమ్ ఏర్పాటుకు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. హస్తకళల ప్రోత్సాహానికి బహుముఖ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ’ ద్వారా హస్తకళలను ప్రోత్సహించేలా బహుముఖ చర్యలు చేపట్టింది. ప్రధానంగా క్రాఫ్ట్‌మేళా, ఎగ్జిబిషన్, ప్రచారం, మార్కెటింగ్ వంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే.. మరికొంత మందికి ఉపా«ధి కల్పించేందుకు పెద్దఎత్తున శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా ‘కామన్ ఫెసిలిటి సర్వీస్ సెంటర్ (సీఎఫ్‌ఎస్‌సీ)లను ఏర్పాటుచేస్తోంది. వాటికి అవసరమైన మౌలిక వసతులు, యంత్రాలు, పరికరాలను ఏర్పాటుచేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతోంది. ఒకే గొడుగు కిందకు నైపుణ్యాన్ని, తయారీని, విక్రయాలను తీసుకొస్తోంది. ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు ఇక రాష్ట్రంలో పేరెన్నికగన్న హస్తకళా ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతోపాటు తోలు బొమ్మలకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మంచి డిమాండ్ ఉంది. ఈ–కామర్స్ పాŠల్ట్ఫామ్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో కూడా ఆన్లైన్ విక్రయాలు చేస్తున్నారు. ఈ ఏడాది రూ.35 లక్షలు విలువైన హస్తకళా ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మాలని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. -
కళల కాణాచి.. జీవమై మెరిసి
సాక్షి, అమరావతి: కొండపల్లి అడవిలో లభించే తెల్ల పొనుకు చెట్ల నుంచి సేకరించిన చెక్కతో కొండపల్లి హస్త కళాకారులు తయారు చేసే ఎడ్లబండి, కల్లుగీత తాటి చెట్టు, ఏనుగు అంబారీ, దశావతారాలు, అర్జునుడి రథం, దేవతామూర్తుల బొమ్మలు దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. టేకు చెక్కతో అత్యంత నైపుణ్యంతో చేసే కలంకారీ అచ్చులకు ఉన్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. చీరలు, దుప్పట్లు, లుంగీలు, చొక్కాలు, బ్లౌజులపై ఈ అచ్చుల సాయంతో అద్దే డిజైన్లకు మంచి క్రేజ్ ఉంది. విదేశాల నుంచి సైతం ప్రత్యేకంగా ఆర్డర్‌పై కలంకారీ అచ్చులను తయారు చేయించుకుని వెళ్తుండటంతో వీటికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. కొండపల్లి బొమ్మ.. అనంతపురం తోలుబొమ్మ.. గుంటూరు రాతి శిల్పాలు.. పెడన కలంకారీ.. చిలకలపూడి రోల్డ్ గోల్డ్ నగలు.. నరసాపురం లేసు అల్లికలు వంటి ఎన్నో హస్త కళలు మన సొంతం. జగమంతా మోగిన బొబ్బిలి వీణ.. కొండపల్లి కొయ్య బొమ్మ.. ఏటికొప్పాక లక్క బొమ్మలు.. గోదావరి తీరంలో అల్లే లేసులు.. ఏలూరు ఎర్ర తివాచీలు.. పుత్తడిని తలదన్నే బుడితి ఇత్తడి సామానులు.. ఆళ్లగడ్డ, దుర్గి శిల్పాలు.. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో చెక్కలపై చెక్కే అందాలు మన ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన వార సత్వ హస్త కళా సంపద. వీటిలో ఏ కళ వైపు చూసినా వాటికి పురుడు పోసే హస్తకళాకారుల చేతులు చమత్కారం చేస్తుంటాయి. భళా.. హస్తకళ అనిపించుకుంటాయి. 2 లక్షల కుటుంబాలకు హస్తకళలే ఆధారం రాష్ట్రంలో హస్త కళలపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో ఒక్కో హస్తకళ ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షలకు పైగా కుటుంబాలు హస్తకళలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంత మహిళలు సూది, దారాలతో అలవోకగా అల్లే లేసులు, ఏలూరులో తివాచీల తయారీపై ఆధారపడి అత్యధికంగా లక్ష మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఆ తరువాత కృష్ణా జిల్లాలోని పెడన కలంకారీ అచ్చుల తయారీ, బం దరులోని చిలకలపూడి బంగారం, కొండపల్లి కొయ్య బొమ్మల తయారీపై ఉపాధి పొందుతున్న వారి సంఖ్య రెండో స్థానంలో ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలో లేసు అల్లికలు, రామచంద్రపురం తాటి ఆకుల కళాఖండాలు, చిత్తూరులో చెక్క కళాకృతులను బతికిస్తున్న హస్త కళాకారుల సంఖ్య మూడో స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన ఇతడి పేరు కె.వెంకటాచారి. 35ఏళ్లుగా కొయ్య బొమ్మల తయారీలో నిమగ్నమయ్యాడు. ఈ కళనే జీవనోపాధిగా మలుచుకున్న వెంకటాచారి తన ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశాడు. ఇటీవల ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డును ఇచ్చి గౌరవించింది. ఇటీవల ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ సైతం కొండపల్లి బొమ్మల తయారీని ప్రస్తావించడంతో వెంకటాచారి పులకించిపోతున్నాడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన పెడన కలంకారీ అచ్చుల తయారీలో 40ఏళ్లుగా సేవలందిస్తున్నఈయన పేరు కొండ్రు గంగాధర్. కృష్ణా జిల్లా పెడనకు చెందిన గంగాధర్ కుటుంబం మొత్తం ఇదే కళపై ఆధారపడి జీవిస్తోంది. ఎంతో మందికి కలంకారీ అచ్చుల తయారీలో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించిన గంగాధర్‌ను కేంద్ర ప్రభుత్వం 2002లో రాష్ట్రపతి పురస్కారంతో సత్కరించింది. గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘శిల్పగురు’ అవార్డు ఇంకా అందుకోవాల్సి ఉందని గంగాధర్ గర్వంగా చెబుతున్నాడు. కళల కాణాచిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో ఎందరో కళాకారులు హస్త కళలనే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. తాము బతుకుతూ హస్త కళలను బతికిస్తున్నారు. తాతల కాలం నుంచీ చేస్తున్నాం మా తాతల కాలం నుంచి చిలకలపూడిలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలు (ఇమిటేషన్ నగలు) తయారు చేస్తున్నాం. నేను మా నాన్న దగ్గర రోల్డ్‌గోల్డ్ నగల తయారీ నేర్చుకుని ఇదే పనిలో స్థిరపడ్డాను. మా ఇద్దరు పిల్లల చదువులు పూర్తయ్యాక వారితో రోల్డ్ గోల్డ్ నగల వ్యాపారం పెట్టించాను. ఈ వృత్తిని నమ్ముకున్న మాకు ఎలాంటి కష్టం లేదు. మచిలీపట్నంలో దాదాపు 3 వేల కుటుంబాలు రోల్డ్ గోల్డ్ నగల తయారీపై ఆధారపడి బతుకుతున్నాయి. – పెద్దేటి పాండురంగారావు, రోల్డ్ గోల్డ్ ఆభరణాల తయారీదారు, మచిలీపట్నం అమ్మ నుంచి నేర్చుకున్నా మా అమ్మ చంద్రమ్మ నుంచి లేసులు అల్లడం నేర్చుకున్నాను. ఈ కళే నాకు ఉపాధిగా మారింది. పెళ్లయి అత్తారింటికి వచ్చినా అదే వ్యాపకాన్ని కొనసాగిస్తున్నాను. లేసు అల్లికల ద్వారా నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వస్తాయి. వేడి నీళ్లకు చన్నీళ్ల సాయం మాదిరిగా నా కుటుంబానికి ఉపయోగపడుతున్నాయి. మా ప్రాంతంలో లేసు అల్లికలపై దాదాపు 15 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. – పులపర్తి మహాలక్ష్మి, అధ్యక్షురాలు, నరసాపురం లేసు పార్కు, పశ్చిమగోదావరి జిల్లా -
‘చేతి’కి చేదోడు
సాక్షి, అమరావతి: స్వయం ఉపాధినే నమ్ముకున్న చేతివృత్తిదారులు సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా వివక్షకు గురవుతూ కష్ట జీవులైన వీరంతా పండుగ సమయాల్లో కూడా ఇతరులకు సహాయపడే పనుల్లోనే నిమగ్నమవుతున్నారని గుర్తు చేశారు. అయితే వారి శ్రమకు తగిన ఆదాయం లభించని పరిస్థితులు నెలకొన్నాయని, చేతివృత్తిదారులకు చేయూత అందించకుంటే మొత్తం వ్యవస్థలే కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందన్నారు. బీసీలకు గొప్ప సామాజిక న్యాయం అని చెప్పి చెడు చేసిన గత సర్కారుకు, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలని కోరారు. మంచి మనసుతో పనిచేస్తున్న ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. జగనన్న చేదోడు పథకం కింద వరుసగా రెండో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ.285.35 కోట్ల ఆర్థ్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి మాట్లాడారు. ఈ పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. భారీ స్వయం ఉపాధి రంగం స్వయం ఉపాధి రంగంలో అతి ఎక్కువగా దాదాపు 2.85 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. చేతివృత్తిదారులకు మనమంతా తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. వీరికి మంచిచేసే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. షాపులున్న 1,46,103 మంది టైలర్లకు రూ.146.10 కోట్లు వారి అకౌంట్లలోకి బదిలీ చేస్తున్నాం. 98,439 మంది రజక సోదరులు, అక్కచెల్లెమ్మలకు రూ.98.44 కోట్లు ఇస్తున్నాం. 40,808 నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు రూ.40.81 కోట్లు సాయాన్ని నేరుగా అందజేస్తున్నాం. ఆ కష్టాలు స్వయంగా చూశా.. చేతివృత్తిదారుల శ్రమకు తగిన ఆదాయం దక్కని పరిస్థితులున్నాయి. నా పాదయాత్ర సమయంలో వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని అధికారంలోకి రాగానే జగనన్న చేదోడు పథకాన్ని తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ అత్యంత పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రెండున్నరేళ్లలో మొత్తం రూ.583.78 కోట్లు చేతివృత్తిదారులకు అందజేశాం. ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లిచ్చి కమీషన్లు కొట్టేశారు.. గత సర్కారు హయాంలో ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు లాంటివి ఏ కొద్దిమందికో ఇచ్చి అందులోనూ కమీషన్లు కొట్టేశారు. అవి కూడా నాసిరకం, ఉపయోగపడని సామాన్లే. ఎంతో మేలు చేసే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చిన పరిస్థితులను కూడా గత ప్రభుత్వంలో మనం చూశాం. బీసీలకు గొప్ప సామాజిక న్యాయం అంటూ చెడు చేసిన గత ప్రభుత్వానికి, మంచి మనసుతో నిజమైన చేదోడు అందిస్తున్న మన ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉందో గమనించమని కోరుతున్నా. బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ బీసీలంటే పనిముట్లు కాదు.. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్‌లు కాదు. వారు సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మి ఆచరిస్తున్నాం. వారి జీవితాల్లో మార్పులు రావాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మిగతా వారితో పోటీపడి ఎదగాలి. అందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని ఈ రెండున్నరేళ్లుగా మనసా, వాచా తపించాం. మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం లాంటి పథకాలతో పాటు నవరత్నాలతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ప్రతి అడుగులో తోడుగా నిలబడ్డాం. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ వాహనమిత్ర.. ఇలా పలు పథకాలను తెచ్చాం. ఇంగ్లిష్ మీడియం చదువులు, 30 లక్షలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వడం ఇలా ఏది తీసుకున్నా ఎన్నికల ముందు ఏలూరులో ఇచ్చిన మాట ప్రకారం వారిని వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తి.. వారికి ముద్దుబిడ్డ ► ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈరోజు రామోజీరావుకు.. అంటే ఈనాడుకు ముద్దుబిడ్డ. ► బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి ఇవాళ ఏబీఎన్, టీవీ 5కి ముద్దుబిడ్డ. ► బీసీలు జడ్జీలుగా పనికిరారని ఏకంగా కేంద్రానికి లేఖలు రాసిన వ్యక్తి ఈ రోజు మన ఎర్రజెండాల వారికి ఆత్మీయ కామ్రేడ్. ► ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా బాబు బినామీల భూముల రియల్ ఎస్టేట్ కోసం కామ్రేడ్ సోదరులు జెండాలు పట్టుకునే పరిస్థితి. ► అమరావతిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ప్రభుత్వం ఇంటి స్థ్ధలాలను కేటాయిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలన్స్ (సామాజిక సమతుల్యం) దెబ్బ తింటుందని ఏకంగా కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసిన చంద్రబాబుకు మద్దతు పలుకుతున్న మహానుభావుల్లో మన కామ్రేడ్లు ఉన్నారంటే వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో గమనించాలని కోరుతున్నా. – సీఎం జగన్ రెండున్నరేళ్లలో ఏం చేశామో మచ్చుకు కొన్ని.. ► బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన నియమించిన మొట్టమొదటి రాష్ట్రం మనదే. కేబినెట్ కూర్పులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం మంత్రి పదవులిచ్చిన ప్రభుత్వం మనదే. ఐదుగురు డిప్యూటీ సీఎంలకు గానూ నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే. ► శాసనసభ స్పీకర్ పదవి సైతం బీసీలకే ఇచ్చి గౌరవించాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 32 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే అందులో 18 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. నలుగురిని రాజ్యసభకు పంపిస్తే అందులో సగం అంటే రెండు బీసీలకే ఇచ్చాం. ► స్థానిక సంస్థ్ధల ఎన్నికల్లో మొత్తం 650 మండలాలలో వైఎస్సార్ సీపీ 636 చోట్ల క్లీన్ స్వీప్ చేయగా 427 మండల అధ్యక్ష పదవులు అంటే 67 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చాం. 13 జిల్లా పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 9 పదవులు అంటే 69 శాతం ఇచ్చాం. ► 13 నగర కార్పొరేషన్ ౖచైర్మన్ల ఎన్నికలకు వెళ్లి దేవుడి దయతో 13 మనమే గెలిచాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు 12 పదవులు అంటే 92 శాతం ఇచ్చాం. ► 87 మున్సిపాల్టీలలో 84 చోట్ల వైఎస్సార్ సీపీ విజయం సాధించగా 61 ౖచైర్మన్ పదవులు అంటే 73% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ► 196 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 118 అంటే 60 శాతం చైర్మన్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. ► నామినేటెడ్ కింద 137 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకుగానూ 79 పదవులు అంటే 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ► 484 నామినేటెడ్ డైరెక్టర్ల పోస్టుల్లో 281 పోస్టులు అంటే 58 శాతం ఈ వర్గాలకే ఇచ్చాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే చేసిన ప్రభుత్వం మనదే. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.25 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో 83%ం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వగలిగాం. కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల నుంచి లబ్ధిదారులు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పంచుకున్నారు. వారు ఏమన్నారంటే.. బీసీలు ఇది తమ ప్రభుత్వమని భావిస్తున్నారు ఈ రోజు చేదోడు పథక రచనలోనే మీ మనసును ఆవిష్కరించారు. పేదరికంలో ఉన్నవారిని అందులోంచి బయటపడేసేందుకు మీరు పాదయాత్ర అనే తపస్సు చేశారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని మీకెన్ని కష్టాలు వచ్చినా వారిని ఆదుకున్నారు. కష్టాన్ని నమ్ముకుని జీవించే రజకులు కానీ.. ఇతరులు కానీ ఏ పథకం వచ్చినా వారికి అదనంగా ప్రోత్సాహం ఇవ్వాలని రూ.10 వేలు రెండో ఏడాదీ ఇస్తున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ పథకం అమలు చేస్తున్నారు. తన అవసరాన్ని ఎవరికీ చెప్పుకోకుండా కేవలం భగవంతుడికే చెప్పుకున్నా అది జగనన్నకు వినపడింది. ఆ కుటుంబాల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడి ఇది తమ ప్రభుత్వం అని భావిస్తున్నారు. బలహీన వర్గాల వారి కష్టాలను మీరు తీరుస్తున్నారు. మీకు సూర్యభగవానుడు మరింత శక్తిని ఇవ్వాలని, మీ ద్వారా రాష్ట్రంలో పేదలందరికీ మంచి జరగాలని, మీరు తలపెట్టిన యజ్ఞఫలం ప్రజలకు అందే సమయంలో మీకు ఆ భగవంతుడు మరింతగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏ ప్రభుత్వం చేయని సాయం మీరు చేశారు ఆరేళ్లుగా టైలరింగ్ సెంటర్ నడుపుకుంటున్నాను. నా దగ్గర ముగ్గురు పని చేస్తున్నారు. మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మాకు అందలేదు. మీరు చేస్తున్న సాయం మా వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడుతుంది. కరోనా కష్టకాలంలో ఈ సాయం మాకు చాలా ఉపయోగకరం. ఈ డబ్బుతో నేను టైలరింగ్ మెటీరియల్ తెచ్చుకుంటాను. నాకు రూ.5 లక్షల విలువైన ఇంటి స్థలం వచ్చింది. మేం మా తల్లిదండ్రులకు సాయం చేసే పరిస్థితుల్లో లేకపోయినా మీరు మా ఇంటి పెద్దకొడుకులా వారికి కూడా ఇంటి స్థలం ఇచ్చారు. వారి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. – తిరుమలశెట్టి వెంకట రమణమ్మ, టైలర్, కాకినాడ కరోనా టైంలో చాలా సాయం చేశారు నేను 15 ఏళ్లుగా టైలరింగ్ చేస్తున్నాను. మీరు పాదయాత్రలో మా కష్టాలు చూసి మాకు ఆర్థిక సాయం చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన డబ్బుతో నా షాప్ అభివృద్ధి చేసుకున్నాను. ఇప్పుడు రెండో విడత వస్తున్న డబ్బును కూడా సద్వినియోగం చేసుకుంటాను. నా పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన వస్తున్నాయి. రాష్ట్రంలో అనేకమంది పేద పిల్లలకు మీరు మంచి చదువులు చెప్పిస్తున్నారు. కరోనా టైంలో మీరు చాలా సాయం చేశారు. మీరు ప్రతి పథకాన్ని ఆపకుండా నెరవేరుస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. – ఎన్.సరళ, టైలర్, చిన్నాపురం, మచిలీపట్నం నాయీ బ్రాహ్మణులకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు గతంలో సాయం చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు గతంలో మా నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయాల్లో కూడా మాకు స్థానం కల్పించారు. మాకు ఉచిత కరెంట్ ఇచ్చారు. సెలూన్ షాప్లున్న నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. మేం ఎవరూ కూడా బిల్ కట్టడం లేదు. గతంలో కరెంట్ బిల్లు గురించి చాలా ఆందోళన చెందేవాళ్లం. ఇప్పుడా ఇబ్బంది లేదు. గతంలో మేం చాలాసార్లు అందరినీ కలిశాం. ఎవరూ సాయం చేయలేదు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. – స్వామి చంద్రుడు, నాయీబ్రాహ్మణ సంఘ నాయకుడు, కర్నూలు దరఖాస్తు చేసుకోగానే సాయం నేను ఇంట్లో టైలరింగ్ చేసుకుంటున్నాను. ఈ పథకం గురించి వలంటీర్ చెప్పారు. నేను దరఖాస్తు చేసుకోగానే సాయం అందింది. మీరు రెండో విడతగా చేస్తున్న సాయం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మా అమ్మకు ఇంటి స్థలం వచ్చింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందింది. నాకు డ్వాక్రా రుణమాఫీ కూడా జరిగింది. థాంక్యూ అన్నా. – సంతోషికుమారి, టైలర్, విజయనగరం -
జాతీయ ఆదివాసీ దినోత్సవం: గిరిజన కళలకు 'కళ'
సాక్షి, అమరావతి/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): గిరిజన కళలకు ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 146వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ‘జన్ జాతి గౌరవ దివస్’(జాతీయ ఆదివాసీ దినోత్సవం)గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు గిరిజన కళలను ప్రోత్సహించేలా కార్యాచరణ చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్‌లో సోమవారం ప్రారంభించిన గిరిజన హస్తకళల ప్రదర్శన, విక్రయాలు 19 వరకు కొనసాగుతాయి. సవర, కొండరెడ్డి, కొండదొర, నూకదొర, కోయ, జాతపు, కొండ కమ్మర, వాల్మీకి, భగతహ, కొటియా తదితర ఆదిమ గిరిజనులు రూపొందించిన హస్త కళలను ఐదు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. గిరిజన సంప్రదాయ, ప్రత్యేకత కలిగిన ఈ హస్తకళ నైపుణ్యాలను మరో తరానికి అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయి. గిరిజన హస్తకళాకారులకు జీవనోపాధి చూపడంతో పాటు.. సంప్రదాయ గిరిజన హస్తకళలను నిలబెట్టేందుకు 12 ప్రధాన రకాల ఉత్పత్తులతో గిరిజన సంక్షేమ శాఖ స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ గిరిజన ప్రాంతాల నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా థింసా నృత్యం చేస్తున్న సమయంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా కూడా నృత్యం చేశారు. డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు రాష్ట్రంలోని గిరిజన కళాకారులను ప్రోత్సహించేలా ఈ నెల 18 వరకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు ఈ నెల 21న రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి రూ.50 వేలు, రూ.25 వేలు, రూ.15 వేల చొప్పున ఈ నెల 22న జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులను అందిస్తారు. గిరిజన పోరాట యోధుడు.. బిర్సా ముండా ఆదివాసీల కోసం బ్రిటీష్ వారిపై వీరోచితంగా పోరాడిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి రోజైన నవంబర్ 15న ‘జన్ జాతి గౌరవ దివస్’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 1875 నవంబర్ 15న రాంచీలో జన్మించిన బిర్సా ముండా 1900 జూన్ 9న రాంచీ సెంట్రల్ జైల్లోనే మరణించాడు. గిరిజన వ్యవసాయ పద్ధతులను, జీవన విధానాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడిన బ్రిటీష్ వారిపై పోరాటం చేశాడు. ఆయన స్ఫూర్తి భావితరాలకు అందించాలని కేంద్రం ఆయన జయంతిని జన్ జాతి గౌరవ దివస్‌గా నిర్వహిస్తోంది. -
కర్రకు ప్రాణం.. కళకు రూపం
ఆ ప్రాంగణంలో కర్రకు ప్రాణం వస్తుంది. అక్కడివారు చెప్పినట్లు హొయలు పోతుంది. వారి చేతుల్లో మెలి తిరుగుతుంది. వారి నైపుణ్యంతో తనువుకు మెరుగులద్దుకుంటుంది. వివిధ ఆకృతుల్లో ఒదుగుతుంది. చూడవచ్చినవారిని ఆకట్టుకుంటుంది. వారి మనసుల్లోకి.. తరువాత చేతుల్లోకి చేరుతుంది. వారి ఇళ్లకు వెళ్లిఅలరిస్తుంది. అందరికీ కనువిందు చేస్తుంది. మాకు కూడా ఇలా ప్రాణమున్న కర్ర కావాలి అనిపిస్తుంది. సాక్షి, నెల్లూరు: ఉదయగిరి.. రాయలేలిన సీమ. కళలకు కాణాచి. నాటి వైభవ చిహ్నాలతో అలరారు తున్న ప్రదేశం. కాలక్రమంలో అనేక కళలు అంతరించినా.. ఒక వ్యక్తి అకుంఠిత దీక్ష కర్రకు ప్రాణంపోసే కళను బతికించింది. జీవం పోసుకున్న కర్ర.. అనేకమందికి జీవనాధారమైంది. ఈ ప్రాంత ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది. రాష్ట్రాధినేతలు, దేశాధినేతల మనసులు కొల్లగొడుతోంది. ఖండాంతర ఖ్యాతి సాధిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో చెక్క నగిషీ నైపుణ్యం హస్తకళల ప్రాభవానికి ఊపిరి ఊదింది. ఉదయగిరిలోని దిలాపర్ భాయ్ వీధికి చెందిన అబ్దుల్ బషీర్ ఈ కళను బతికించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా అందిన ఆ నైపుణ్యాన్ని పదిమందికి ఉపాధి మార్చారు. కర్రతో కళాకృతులు చేసే ఈ హస్తకళను స్థానికంగా కొందరు మహిళలకు నేర్పారు. అడవికర్రలతో పలు రకాల వస్తువులను తయారు చేయడంపై వారికి శిక్షణ ఇచ్చారు. తొలుత ఆయన ప్రయత్నానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటన్నింటిని అధిగమిస్తూ అడుగులు వేసిన ఆయన మొదట తన కుమార్తెలు గౌసియాబేగం , షాహీదాలకు ఈ కళను నేర్పించారు. ఆ వస్తువుల నైపుణ్యానికి అబ్బురపడిన తిరుపతి లేపాక్షి వారు బషీర్‌ను రాష్ట్రస్థాయి అవార్డుతో సత్కరించారు. దీంతో ఈ కళకు కొంత ప్రాచుర్యం లభించింది. తన తండ్రి నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న గౌసియాబేగం.. కొందరు మహిళలతో బృందం ఏర్పాటు చేసుకుని.. చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీ సహకారంతో ఉడెన్, కట్లరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. హస్తకళలు, జౌళిశాఖ ఆర్థికసాయంతో సొంతంగా ఓ రేకుల షెడ్డు, కొన్ని యంత్రాలు సమకూర్చుకుని నైపుణ్యానికి మరింత పదును పెట్టి ఉత్పత్తి పెంచారు. కొయ్యలతో తయారుచేసిన వివిధ ఆకృతుల వస్తువులు ప్రదర్శనల్లో స్టాల్స్ ఈకళాకారులు ఉదయగిరికి సమీపంలో దుర్గం అటవీ ప్రాంతం నుంచి అవసరమైన ముడి కర్రను తెచ్చుకుంటారు. నర్డి, బిల్ల, బిక్కి, కలివి, దేవదారు, కర్రతో గరిటెలు, ఫోర్క్‌లు, పాత్రలు, ట్రేలు, స్లిక్స్, హెయిర్ క్లిప్స్, బొమ్మలు, చిన్న డైనింగ్ టేబుళ్లు, మ్యాట్లు, చిన్న గ్లాసులు, హాట్ బాక్స్‌లు, ప్లేట్లు, బుట్టలు.. ఇలా 150కి పైగా వస్తువులు తయారు చేస్తున్నారు. గౌసియాబేగం వీటిని వివిధ ప్రాంతాల్లో జరిగే ప్రదర్శనల్లో స్టాల్ ఏర్పాటుచేసి అక్కడ విక్రయించేవారు. వచ్చిన సొమ్మును వస్తువులు తయారు చేసిన మహిళలంతా సమానంగా పంచుకునేవారు. ఈ కృషి ఫలితంగా గౌసియాబేగం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. ఆమెకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఈ కళను నేర్చుకునే మహిళల సంఖ్య క్రమంగా పెరిగింది. కాలానుగుణంగా అభిరుచులకు పెద్దపీట వేస్తూ కళను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నిర్వహణ బాధ్యతను గౌసియాబేగం తన కుమారుడు జాకీర్‌హుస్సేన్‌కు అప్పగించారు. న్యూఢిల్లీలో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ ప్రదర్శనలో జాకీర్‌హుస్సేన్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉదయగిరి హస్తకళను ఆసక్తిగా తిలకించారు. ఆ వస్తువుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంతటి నైపుణ్యవంతమైన ఈ కళకు 2016లో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ లభించింది. ఈ వస్తువులను ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం మరింత అవసరం 60 ఏళ్ల కిందట ఈ వృత్తిలో ప్రవేశించి ఈ కళను బతికించుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డాను. ఆదాయం లేకపోవడంతో బయటివారు ఎవరూ ముందుకు రాని రోజుల్లో నాకుమార్తెలిద్దరికీ ఈ కళ నేర్పించాను. మా కుటుంబంలో అందరూ ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వంద కుటుంబాలకుపైగా దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నారు. దీన్ని మరింత విస్తృతపరిచేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో అవసరం ఉంది. కొండాపురం మండలం జంగాలపల్లి వద్ద ఏర్పాటుచేసిన స్టాల్‌ను ప్రజాసంకల్ప యాత్రలో ప్రతిపక్షనేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించి ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీలో ఏర్పాటుచేసిన స్టాల్‌ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మా మనుమడు జాకీర్‌ను ప్రోత్సహించారు. దీంతో సీఎం జగన్మోహన్రెడ్డి నుంచి ఆయన్ని కలవాలని జాకీర్‌కు పిలుపొచ్చింది. ఈ కళకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం వస్తుందనే నమ్మకం కలిగింది. – షేక్ అబ్దుల్ బషీర్ ఆధునిక యంత్రాలు అందించాలి సంప్రదాయ పద్ధతిలో వస్తువులు తయారుచేయడంతో తగినంత ఆదాయం రావడం లేదు. ఆధునిక యంత్రాలు సమకూరిస్తే వస్తువులు తయారుచేసే సమయం తగ్గుతుంది. ఉత్పత్తి పెరిగి ఆదాయం పెంచుకునే అవకాశముంది. ఈ వృత్తిలో ముస్లిం మహిళలే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్రం ప్రాంగణంలోనే కొత్త భవనం ఏర్పాటుచేసి ఆధునిక యంత్రపరికరాలు సమకూర్చాలి. తద్వారా ఎక్కువమంది ఈ వృత్తిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. – షేక్ గౌసియాబేగం -
ఏపీ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బి.విజయలక్ష్మి ప్రమాణస్వీకారం
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బి.విజయలక్ష్మి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు. రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. హస్తకళలు భారత దేశానికి వెన్నెముక లాంటిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రవీంద్రనాథ్, వ్యవసాయశాఖ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
హస్తకళ కళాకారుడు న్యానేశ్వర్ కన్నుమూత
కెరమెరి (ఆసిఫాబాద్): హస్తకళ కళాకారుడు, కుమురంభీం జిల్లా కెరమెరి మండలం కేస్లాగూడకు చెందిన కోవ న్యానేశ్వర్ (70) అనారోగ్యంతో కన్నుమూశారు. ఐదురోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు బుధవారం ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండ టంతో కుటుంబసభ్యులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అ క్కడి వైద్యులు ఆదిలాబాద్‌కు రిఫర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆయన తుదిశ్వాస విడి చారు. న్యానేశ్వర్‌కు భార్య తుర్సాబాయి,. కొడుకులు భూమేశ్, రాంచందర్, కాశీరాం, కుమార్తె సక్కుబాయి ఉన్నారు. గురువారం కేస్లాగూడలో అంత్యక్రియలు జరగనున్నాయి. జాతీయస్థాయిలో గుర్తింపు హస్తకళల్లో న్యానేశ్వర్ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2016, నవంబర్ 9న ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘శిల్పిగురు’ అవార్డును అం దుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన సంప్ర దాయ డోక్రీ లోహకళలో న్యానేశ్వర్‌ది అందెవేసిన చేయి. లోహకళలో ఆయన ప్రదర్శించే నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కేస్లాగూడకు వచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన గౌరవానికి చిహ్నంగా ఐటీడీఏ అధికారులు కేస్లాగూడ ఆశ్రమ పాఠశాలను అప్పట్లో న్యానేశ్వర్ లోహకళ తయారీ కేంద్రంగా మార్చారు. గోండీ ఆదివాసీ డోక్రీ కళకు కొత్త శైలిని జోడించి, సృజ నాత్మక కళాఖండాలు సృష్టించిన న్యానేశ్వర్ చిరస్మరణీయుడని కవి, రచయిత జయధీర్ తిరుమలరావు సంతాపం తెలిపారు. ఆయన భార్యకు పింఛన్‌ఇవ్వాలని తెలంగాణ హస్తకళల అధ్యయన వేదిక అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీరాజ్ కోరారు. -
హస్తకళల కళాకారులకూ ఏటా రూ.10 వేలు
హస్తకళలపై ఆధారపడిన వారికి ప్రయోజనం కల్పించే విధంగా రెండు ఆన్లైన్ స్టోర్లు ప్రారంభిస్తున్నాం. తద్వారా మన కళలు, చేతి వృత్తులను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ కళలు సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సాక్షి, అమరావతి: హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మన జీవితంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వివిధ వృత్తుల వారికి గౌరవం ఇస్తూ.. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చామన్నారు. చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింతగా మార్కెటింగ్ కల్పించేందుకు ‘ఆప్కో– లేపాక్షి ఆన్లైన్ పోర్టల్’ను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ► రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు ఆప్కో ఆన్లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా జాతీయ, అంతర్జాతీయంగా మరింతగా మార్కెటింగ్ సదుపాయం లభిస్తుంది. ఇది ఆయా వృత్తుల కళాకారులకే కాకుండా, వారి ఉత్పత్తులకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించేలా చేస్తుంది. ► అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, అజియో, పేటీఎం, గో కోప్, మిర్రా వంటి ఈ–ప్లాట్‌ఫామ్‌లలో కూడా చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఆ మేరకు ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో ఒప్పందాలు చేసుకున్నాయి. ► ఆప్కో ఆన్లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ చేసి మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, చీరాల తదితర చేనేత, పట్టు, కాటన్ చీరలు, వ్రస్తాలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు పొందవచ్చు. ► లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కలంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం ఆదివాసీ పెయింటింగ్‌లు, ఉదయగిరిలో చెక్కతో తయారయ్యే కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలు బొమ్మలు పొందవచ్చు. హస్త కళాకారులకు మంచి జరగాలి ► ఒక వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు అవకాశం, మరోవైపు ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం వల్ల హస్త కళాకారులకు మంచి జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. ఇప్పుడు ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని ఫిబ్రవరి తర్వాత ఇస్తాం. ► జిల్లాల్లో ప్రసిద్ధి పొందిన హస్త కళల ఉత్పత్తులు ఉంటే, వాటిని కూడా ఈ వెబ్ స్టోర్స్‌లోకి తీసుకురావాలి. ఇప్పుడు చేనేత కారుల కోసం నేతన్న నేస్తం పథకం ఉంది కాబట్టే, ఆ రంగం బతుకుతోంది. అలాంటి వృత్తులు బతకాలంటే ప్రభుత్వ సహాయం, అండగా నిలవడం ఎంతో అవసరం. ► ముఖ్యమంత్రి జగన్ ఆప్కో– లేపాక్షి ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించిన తర్వాత ఒక చీర కొనుగోలు చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. -
చేనేత, హస్తకళలకు మరింత ప్రోత్సాహం
కరోనా కారణంగా కష్టాలున్నాయి. మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదు. మార్కెట్లు పూర్తిగా ఓపెన్ కాలేదు. సరుకుల రవాణా లేదు. కొత్త కొత్త సమస్యలతో యుద్ధం చేస్తున్నాం. అందువల్లే నిజంగా చేనేతలకు మంచి జరగాలన్న తలంపుతో ఈ రోజు ఈ పథకం అమలు చేస్తున్నాం. సాక్షి, అమరావతి: చేనేత, హస్తకళల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మరింత ప్రోత్సాహం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా అక్టోబర్ 2వ తేదీన ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో మూడు బ్రిడ్జిలు దాటాల్సి ఉందని, ఇందులో ఒకటి సరుకులు, ఉత్పత్తుల నాణ్యత కాగా.. రెండోది లాజిస్టిక్స్ (కొనుగోలు విధానం, రవాణా), మూడోది ఉత్పత్తులకు ఆర్డర్స్ ఇస్తే సకాలంలో సరఫరా చేయడం, పేమెంట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవడం అన్నారు. ఇందుకోసం అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.196.46 కోట్లను శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రంలోని అర్హులైన సుమారు 80 వేల చేనేత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో వేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని కలెక్టర్లు, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులనుద్దేశించి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మీ కష్టాన్ని స్వయంగా చూశాను ► నా సుదీర్ఘ 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు అన్ని జిల్లాల్లో చేనేతన్నల కష్టాలు స్వయంగా చూశాను.. విన్నాను. వస్త్రాలు బాగా తయారు చేసినా, మార్కెటింగ్ లేకపోవడం.. మరోవైపు ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల వస్త్రాలను అమ్ముకోలేక ఇబ్బందులు పడటం చూశాను. ► అందుకే మగ్గం ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఏటా రూ.24 వేలు ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ మేరకు గత ఏడాది డిసెంబరు 21న నా పుట్టినరోజున వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించాం. ప్రస్తుతం కరోనా కష్టాలు చూశాక, అన్ని రోజులు ఆగితే మీ కష్టాలు ఇంకా పెరుగుతాయని భావించి.. మళ్లీ ఆరు నెలలకే ఇవాళ ఈ పథకం కింద సాయం చేస్తున్నాం. వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 13 నెలల్లో దాదాపు రూ.600 కోట్లు ► గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో చేనేత కుటుంబాలకు కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వలేదు. అలాంటిది మనం కేవలం 13 నెలల్లోనే.. నిరుడు రూ.200 కోట్లు, ఇవాళ దాదాపు రూ.400 కోట్లు.. ఇచ్చాం. ఆ విధంగా కేవలం 13 నెలల్లోనే దాదాపు రూ.600 కోట్లు ఇచ్చామంటే దేవుడి దయ. ► గత ప్రభుత్వం ఆప్కోకు బకాయి పెట్టిన రూ.103 కోట్లతో పాటు మాస్కుల తయారీ కోసం ఆప్కో నుంచి తీసుకువచ్చిన వస్త్రాలకు రూ.109 కోట్లు ఇవాళే విడుదల చేస్తున్నాం. ప్రతి పేదవాడికి మంచి జరగాలని ఆరాటపడ్డాం. ఇంకా మంచి చేయాలన్న తపన ఉంది ► అన్ని వర్గాల ప్రజల కోసం పలు పథకాలు అమలు చేస్తున్నాం. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్ రూ.2,250కి పెంపు.. గతంలో 44 లక్షల పెన్షన్లు ఇస్తే ఇవాళ దాదాపు 60 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు వచ్చే నెల 8న ఇవ్వబోతున్నాం. ► పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం, నామినేషన్ విధానంలో ఇచ్చే పనులు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించాం. ఆయా పథకాల ద్వారా 3.89 కోట్ల కుటుంబాలకు దాదాపు రూ.43 వేల కోట్లు నేరుగా వారి వారి ఖాతాలకు నగదు బదిలీ చేశాం. ఇందులో రూ.600 కోట్లు నేతన్నలకే ఇచ్చాం. ► 13 నెలల వ్యవధిలోనే పేదలందరికీ మంచి చేయగలిగినందుకు సంతృప్తికరంగా ఉంది. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశాం. దేవుడి దయ, మీ అందరి దీవెనలతో ఇంకా మంచి చేయాలన్న తపన ఉంది. 1902కు ఫోన్ చేయండి ► ఎవరికి ఏ సమస్య వచ్చినా 1902కు ఫోన్ చేయండి. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రతి చేనేత కుటుంబానికి, చేనేతన్నకి భరోసా ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణతో పాటు, పలువురు అధికారులు, నేతన్నల ప్రతినిధులు పాల్గొన్నారు. పథకం అందకపోతే కంగారు పడొద్దు ► గ్రామ స్థాయి నుంచి గొప్ప మార్పులు చేశాం. వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ఇందుకు దోహదపడింది. వ్యవస్థలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అవినీతి లేదు. లంచాలు లేవు. వివక్ష లేదు. అర్హత ఉంటే చాలు.. నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేశాం. ► అందుకే 13 నెలల్లో ఇన్ని చేయగలిగాం. ఇప్పుడు దాదాపు 80 వేల మంది నేతన్నల కుటుంబాలకు మేలు జరుగుతోంది. మగ్గం ఉన్న ప్రతి ఇంటిని వలంటీర్లు పరిశీలించి, వారి పేర్లు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. ► అర్హులు మిగిలిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అర్హత ఉంటే వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్లి, మా ఇంట్లో మగ్గం ఉంది కాబట్టి ఆర్థిక సాయం చేయాలని, చేనేత పెన్షన్ కావాలని దరఖాస్తు చేయండి. మీకు అర్హత ఉంటే వచ్చే నెల ఇదే తేదీన సహాయం చేస్తాం. మంచి చేయాలి అన్నదే తప్ప, ఎలా ఎగ్గొట్టాలని ఆలోచన అసలు చేయం. మా ఆదాయం పెంచుకున్నాం 15 సంవత్సరాలుగా మగ్గం నేస్తున్నాం. గతంలో చాలా మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మా కష్టాలు ఆలకించి ధర్మవరంలో చేనేత కార్మికుల దీక్ష సందర్భంగా నేనున్నానని ఆనాడు మీరు మాకు ధైర్యాన్నిచ్చారు. మీరు ఇచ్చిన ధైర్యంతో, చేసిన సాయంతో ముందుకు సాగుతున్నాం. మొదట్లో మేం గద్వాల్ చీరలు నేసేవారం, ఇప్పుడు పెద్ద చీరలు నేస్తున్నాం. గతంలో నెలకు రూ.8 వేలు సంపాదిస్తే.. ఇప్పుడు నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాం. మరో 30 ఏళ్లు మీరే సీఎంగా ఉండాలన్నా. – బాలం లక్ష్మి, సిండికేట్ నగర్, రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం జిల్లా చేనేత కుటుంబాల్లో వెలుగు నింపారు ఏడాదికి రూ.24 వేలు అందించడం ద్వారా చేనేత కుటుంబాల్లో వెలుగు నింపిన దేవుడు మీరు. మీరు అందించిన సాయంతో మగ్గాలకు కావాల్సిన సామాన్లు కొనుక్కొని, మా ఆదాయాన్ని పెంచుకున్నాం. కరోనా కష్టకాలంలో మా ఇబ్బందులను గమనించి ఆరు నెలలు ముందుగానే రెండో సారి నేతన్న నేస్తం కింద మీరు రూ.24 వేలు ఇవ్వడం మాకు ఎంతో భరోసాను కల్పించింది. మీరు మాత్రమే మా కష్టాలు గుర్తించి మాకు అండగా నిలిచారు. – వాసా సత్యవతి, వంగర గ్రామం, తూర్పు గోదావరి జిల్లా ఇప్పుడు డిజైన్ చీరలు నేస్తున్నాం గతంలో మాకు చాలీచాలని బతుకు దెరువుగా చేనేత వుండేది. మా స్తోమతను బట్టి ముతక రకాలను నేసే వాళ్లం. దానివల్ల మాకు ఆదాయం కూడా తక్కువగానే వచ్చేది. ఇప్పుడు మీరు నేతన్న నేస్తం ద్వారా అందిస్తున్న రూ.24 వేల సాయంతో సామన్లు కొనుగోలు చేసి డిజైన్ చీరెలు నేస్తున్నాం. గతం కంటే మా ఆదాయం కూడా పెరిగింది. మీరే కలకాలం సీఎంగా వుండాలి. – కె.మల్లిబాబు, రాజుల గ్రామం, శ్రీకాకుళం జిల్లా వదిలేసిన వారు మళ్లీ వృత్తిలోకి వస్తున్నారు ఒకప్పుడు వ్యవసాయం తర్వాత చేనేత ప్రధాన రంగంగా వుండేది. కానీ ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చాలా మంది ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు. ఏడాదిగా మీరిస్తున్న భరోసాతో తిరిగి వారంతా మగ్గాలను ఏర్పాటు చేసుకుని ఈ వృత్తిలోకి వస్తున్నారు. మా గ్రామంలోనే కొత్తగా 70–80 మగ్గాలు వచ్చాయి. కరోనా వల్ల వస్త్రాల ఎగుమతులు ఆగిపోయాయి. కొనుగోలు చేసే వారు లేక, మాకు ఆదాయం లేకుండా పోయింది. ఈ సమయంలో ఆరు నెలల ముందే మీరిస్తున్న సొమ్ము మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – లక్ష్మీనారాయణ, ఈతముక్కల గ్రామం, ప్రకాశం జిల్లా ఈ ఏడాదే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టండి నేతన్న నేస్తం రెండో ఏడాది ఆర్థిక సాయం విడుదల కార్యక్రమం అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను పలువురు లబ్ధిదారులు కలిశారు. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను కచ్చితంగా ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇంగ్లిష్ మీడియం విద్యతో తమ పిల్లలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని.. అందుకే మీరు తీసుకున్న నిర్ణయానికి తామంతా మద్దతిస్తున్నామని చెప్పారు. -
ప్రపంచ దేవాంగ, చేనేత సమావేశం విజయవంతం
నేపర్‌విల్లే(చికాగో) : డానా యుఎస్ఎ, ఇండో అమెరికన్ ఫిలాంత్రొపక్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా చికాగోలోని నేపర్‌విల్లేలో నిర్వహించిన ప్రపంచ దేవాంగ, చేనేత సమావేశం సెప్టెంబర్ 1న విజయవంతంగా ముగిసింది. యుఎస్ఏ, భారతదేశం నుంచి పలువురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై సభను జయప్రదం చేశారు. నేపర్‌విల్లేలోని రాయల్ ప్యాలెస్ బాంక్వెట్ హాల్లో ఈ సమావేశం జరిగింది. యూఎస్ఏ కాంగ్రెస్‌మెన్ బిల్ ఫోస్టర్, ఉమాస్ ఐఎన్‌సీ అధినేత సంతోష్ కుమార్ జీ, డానా వ్యవస్థాపక చైర్మన్ వెంకటేశ్వరరావులు జ్యోతి ప్రజ్వనలతో ఈ సమావేశాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌మెన్ బిల్ ఫోస్టర్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని కాపాడటంతో పాటు పేద ప్రజలకు సాయం అందిస్తున్న ప్రవాస భారతీయులను అభినందించారు. తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి మహిళలు పురుషులతో సమానంగా సాధికారికతను సాధించడానికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని గ్రామీణ జీవితాన్ని మెరుగుపర్చడానికి ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పుట్టిన గడ్డ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. భారతదేశం నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతా శంకర్ మూర్తి.. ఏపీకి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ ఆధ్వర్యంలో నలుగురు కార్మికులు రాత్రింబవళ్లు కష్టించి నేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ జెండాను ఎటువంటి అతుకులు లేకుండా కేవలం చేతితోనే నేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఇక కార్యక్రమం చివర్లో బిల్ ఫోస్టర్, మిశ్రా, సంతోష్ కుమార్ జీ, చింతా శంకర్ మూర్తిలను డానా చైర్మన్ బాచువెంకటేశ్వరరావు సత్కరించారు. -
బాబు మాటలన్నీ నీటి మూటలే: చేనేత కార్మికులు
చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కుప్పలు తెప్పలుగా హామీల వర్షం కురిపించి.. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తకపోవడంతో చేనేతల బతుకులు అతుకు.. మెతుకు కరువై దుర్భరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మోసాన్ని తలుచుకుని నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. సాక్షి, ప్రొద్దుటూరు : జిల్లాలో సుమారు 30 వేల కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాం నుంచి ఆనవాయితీగా ఎక్కువ శాతం మంది టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం చేనేత కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. స్వయంగా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు సైతం ప్రభుత్వం అమలు చేయలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014 మే 4న ప్రొద్దుటూరు పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్లో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. చేనేత ఐక్యవేదిక కన్వీనర్ అవ్వారు ప్రసాద్ చేనేత కార్మికులకు వర్క్‌షెడ్‌తో కూడిన ఇళ్లు మంజూరు చేయాలని కోరగా అందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అపెరల్ పార్కు కోసం కేటాయించిన 76.16 ఎకరాల స్థలాన్ని బదలాయించి మున్సిపల్ అధికారులు ఇళ్ల నిర్మాణానికి కేటాయించారు. చేనేత కార్మికుల కోసం కేటాయించిన స్థలాన్ని ఇతరులకు ఎలా ఇస్తారని నేతన్నలు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ హామీలు గుర్తున్నాయా బాబూ..! చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు : ఎంతో మంది చేనేతలు గుర్తింపు కార్డులు లేక అవస్థలు పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 22,142 మంది చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ : అసలు రుణాలే ఇవ్వలేదు. సొసైటీలకు మాత్రమే ఇచ్చారు. లబ్ధి పొందింది సొసైటీ నిర్వాహకులే. చేనేత కార్మికుల పిల్లలను చదివించేందుకు ప్రత్యేక ప్యాకేజీ, ఉచిత వైద్యం : అసలు అమలు కాలేదు. రూ.లక్షా 50వేలతో ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు ఏర్పాటు : చేనేత కార్మికులకు ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణం జరగలేదు. అసలు వర్క్‌షెడ్‌తో కూడిన ఇళ్లు ఏర్పాటు చేయలేదు. ఒక్కొక్క చేనేత కుటుంబానికి రూ.లక్ష మేరకు సంస్థాగత రుణం : అమలుకు నోచుకోలేదు. చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు : రుణాల ఊసే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు : జిల్లాలో అమలు కాలేదు. ఉచిత ఆరోగ్య బీమా : గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐసీఐసీఐ లాంబార్డు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో 2005 నుంచి అమలు చేసిన ఆరోగ్య పథకం 2014 సెప్టెంబర్ 30తో ముగిసింది. తిరిగి ఈ పథకాన్ని అమలు చేయలేదు. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి ముడిసరుకులను సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలను జిల్లా, డివిజన్ కేంద్రాల్లో అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాం. : ఈ విధానం అమలుకు నోచుకోలేదు. జిల్లాకు ఒక చేనేత పార్కును ఏర్పాటు చేసి కార్మికులకు శిక్షణ, ఉపాధి : చేనేత పార్కు ఏర్పాటు చేయకపోగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ప్రొద్దుటూరులోని అపెరల్ పార్కు, మైలవరంలోని టెక్స్టైల్ పార్కు ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. సగం ధరకే జనతా వస్తాలు: జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ : గత ఐదేళ్లలో ఈ పథకం ఊసే లేదు. మగ్గాలకు ఉచిత విద్యుత్ : నేటికీ అమలుకు నోచుకోలేదు. విద్యుత్ చార్జీల భారంతో చేనేతలు అవస్థలు పడుతున్నారు. చేనేత ఉత్పత్తులపై ఆఫ్ సీజన్ సమయాల్లో రుణ సదుపాయం కల్పించి గిట్టుబాటు ధర వచ్చేదాకా వాటిని నిల్వ ఉంచుకునే అవకాశం కల్పించడం. : ఈ పథకం అమలుకు నోచుకోలేదు. చేనేత పరిశ్రమల ఆధునికీకరణకు ప్రత్యేక విభాగం : ఏర్పాటు కాలేదు. -
చేనేతల సంక్షేమానికి ప్రాధాన్యం
- నేతన్నల సంక్షేమ కార్యక్రమాలు తక్షణం ప్రారంభించండి - బతుకమ్మ చీరల పంపిణీపై సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికుల సంక్షేమం కోసం తలపెట్టిన యార్న్, రసాయనాలు, అద్దకాల సబ్సిడీ వంటి కార్యక్రమాలను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపుల్లో చేనేత శాఖకు పెద్ద పీట వేశామన్నారు. డిమాండ్ ఉన్న జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టెస్కో షోరూమ్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ చీరల పంపిణీతో పాటు శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలపై సోమవారం ఆయన బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ నెల 16 నాటికి చీరలన్నీ జిల్లా కేంద్రాలకు చేరతాయని, 17, 18, 19 తేదీల్లో పంపిణీ పూర్తవుతుందని అధికారులు మంత్రికి తెలిపారు. చీరల పంపీణీలో ఏ ఇబ్బందులూ లేకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రెండు నెలల వ్యవధిలో 1.06 కోట్ల అడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేతన్నలకు ఉపాధితో పాటు, పండగ సందర్భంగా అడపడుచులకు సంతోషం పంచిన ట్టవుతుందన్నారు. త్వరలో చేనేత వార్షిక ప్రణాళిక... ఇకపై ప్రభుత్వం సేకరించే ప్రతి మీటర్ వస్త్రాన్ని రాష్ట్రం నుంచే తీసుకొంటామని కేటీఆర్ చెప్పారు. త్వరలో చేనేత వార్షిక ప్రణాళికను ప్రకటిస్తా మన్నారు. దీని ద్వారా వచ్చే ఏడాది నుంచి నేతన్నలకు కనీసం ఏడాదిలో 8 నెలల పాటు ప్రభుత్వం సేకరించే వస్త్రాల ఉత్పత్తిపై పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆర్డర్లతో నెలకు కనీసం రూ.15 వేలు చొప్పున 3 నెలలు లభించిందన్నారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ చీరలు, రాజీవ్ విద్యా మిషన్ ద్వారా పంపిణీ చేసే స్కూల్ యూనిఫాంల సేకరణను వ్యవస్థీకృతం చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో తక్షణమే సమావేశాలు జరపాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే చేనేత మగ్గాలు, కార్మికుల పూర్తి సమాచారముందని, పవర్లూమ్ కార్మికుల సమాచారం సేకరించి డిజిటలైజ్ చేయా లన్నారు. ఇకపై కేంద్ర మంత్రులను కలిసే సంద ర్భంలో తెలంగాణ చేనేత వస్త్రాలు, గోల్కొండ కళాకృతులను అందిచాలని సూచించారు. -
చేనేతను జీఎస్టీ నుంచి మినహాయించాలి
తెలంగాణ చేనేత కార్మిక సంఘం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: చేనేత రంగాన్ని జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డి.రాజాను ఢిల్లీలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం కలసి వినతి పత్రాన్ని సమర్పించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర జౌళి మంత్రి స్మృతి ఇరానీ, జీఎస్టీ కౌన్సిల్ సభ్యుడు సంతోష్‌కుమార్ గంగ్వార్లకు సంఘం తరపున వినతిపత్రాలు పంపామని టి.వెంకట్రాములు ఓ ప్రకటనలో తెలిపారు. నేటికీ చేనేత రంగంపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభించక ఈ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిందిపోయి, జీఎస్టీలో చేర్చి నూలుపై 5 శాతం, వస్త్రాలపై 18 శాతం పన్ను విధించడం వల్ల చేనేత రంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
మగ్గాలపై మలిసంధ్య బతుకులు
చేనేతను నమ్ముకుని పనిచేస్తున్న ఆఖరితరం - సిరిసిల్లలో మొత్తం 175 చేనేత మగ్గాలు - కార్మికులు 225 మంది మాత్రమే - ఇప్పటికే జియో ట్యాగింగ్ పూర్తి - చేనేతను మింగిన మర నేత ఈ చిత్రంలో కనిపిస్తున్న చేనేత కార్మికుడి పేరు మామిడాల చంద్రయ్య (92). భార్య పేరు కమలమ్మ. ముగ్గురు కుమారులు, ఒక కూతురు. సిరిసిల్ల విద్యానగర్వాసి. ఒకప్పుడు బాగానే బతికాడు. ఇల్లు కట్టుకోవడంతోపాటు కుమారులు, కూతురుకు పెళ్లిళ్లు చేశాడు. వీరు ఎవరికి వారే బతుకుతున్నారు. ఈ వృద్ధుడిది ఇప్పుడు సాతగాని పానం.. బొక్కలు తేలిన ఒళ్లు.. మగ్గంపై జోటను ఆడించాలంటే రెక్కల్లో సత్తువ లేదు. తన ఒంట్లో సత్తువ లేకున్నా.. చేనేత మగ్గంపై బట్ట నేస్తున్నాడు. రోజూ పొద్దుగాల 10 గంటలకు వచ్చి చేనేతమగ్గంపై 4 మీటర్ల బట్టను సాయంత్రం 5 గంటల వరకు ఉత్పత్తిచేసి వెళ్తాడు. ఒక్కో మీటరుకు రూ.17 చొప్పున రోజూ రూ.68 కూలి వస్తుంది. నెలకు రూ.1,500 – రూ.1,800 మాత్రమే అందుతుంది. ప్రభుత్వం ఆసరా పింఛన్ రూ.1,000 ఇస్తుంది. ఈ సొమ్ముతోనే బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలతో పూటగడవాలి. ఆరోగ్యం సహకరించకున్నా చేనేతమగ్గంపై బట్ట నేసి అంతో ఇంతో సంపాదించడం తప్ప మరోమార్గంలేదు. ఇది ఒక్క చంద్రయ్య– కమలమ్మ దంపతుల పరిస్థితే కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దాదాపు 225 మంది చేనేత కార్మికుల దుస్థితి. సిరిసిల్ల: ‘చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు’.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్) మింగేశాయి. కాలంతో పోటీ పడలేక.. జిగిసచ్చిన వృద్ధ కార్మికులు మరోపని చేతకాక.. వయసు పైబడినా.. కళ్లు కనిపించ కపోయినా.. ఒళ్లు సహకరించకున్నా.. జానెడు పొట్ట కోసం.. కాళ్లు, చేతులు ఆడిస్తూ బట్ట నేస్తున్నారు. 58 ఏళ్లవయసు నిండితే ప్రభుత్వం రిటైర్మెంట్ను ప్రకటి స్తోంది. కానీ చేనేత కార్మికులంతా 60 దాటి 95 ఏళ్ల వయసున్న వారు ఇంకా మగ్గంపై శ్రమిస్తూ.. పొట్టపో సుకుంటున్నారు. తక్కువ కూలి ఉన్నా.. కుటుంబ అవసరాల కోసం మగ్గాన్నే నమ్ముకుని మలి సంధ్య లోనూ పనిచేస్తున్నారు. సిరిసిల్లలో మూడు చేనేత సహకార సంఘాలు ఉండగా.. 114 మంది కార్మికులు చేనేత మగ్గాలపై ఆధారపడ్డవారే.. మరమగ్గాలపై వేగం గా బట్ట ఉత్పత్తి అవుతుండగా.. చేనేతమగ్గంపై కాళ్లు, చేతులు ఆడిస్తూ.. ఎంతశ్రమించినా మరమగ్గాలతో పోటీపడలేక పోతున్నారు. అత్యంత కష్టమైన ఈ పనిలో వయోవృద్ధులు శ్రమించడం బాధాకరం. ఈ పనిని కొత్తగా ఎవ్వరూ నేర్చుకోకపోవడంతో ఈ తరం తనువు చాలిస్తే.. చేనేత మగ్గాలు మూలన పడాల్సిందే. ఇప్పుడు మరణశయ్యపై చేనేత మగ్గాలు ఆఖరితరం చేతిలో బట్టనేస్తున్నాయి. మిగిలినవి కొన్నే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 175 చేనేత మగ్గా లు ఉన్నాయి. వీటికి చేనేత, జౌళిశాఖ అధి కారులు జియో ట్యాగింగ్ చేశారు. ఈ రంగంపై 175 మంది కార్మికులు, మరో 50 మంది అను బంధ రంగాల కార్మికులు ఆధారపడ్డారు. సిరిసి ల్లలో అత్యధికంగా 135 మంది ఉండగా.. వేము లవాడ, మామిడిపల్లి, బోయినపల్లి, తంగళ్లపల్లి గ్రామాల్లో మిగతావారు పని చేస్తున్నారు. వీరికి టెస్కో ద్వారా నూలు సరఫరా అవుతోంది. దీని ఆధారంగా బట్టనేసి ఇస్తున్నారు. ‘ఆసరా’ అంతంతే.. ప్రభుత్వం అందించే రాయితీలు, సంక్షేమ పథకాలు మర మగ్గాల కార్మికులకు కొంతైనా దరి చేరుతున్నాయి. కానీ, నిజమైన చేనేత కార్మికులకు చేయూత లభించడంలేదు. 35 కిలోల బియ్యం వచ్చే అంత్యోదయ కార్డులు మంజూరు చేయడంలేదు. ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇవ్వాలనే నిబంధన.. వృద్ధాప్యంలో ఉన్న దంప తుల్లో ఒక్కరికే వర్తిస్తోంది. మగ్గం నేసే కార్మికుడు, ఇంట్లో ఉండే వృద్ధురాలు ఇద్దరూ పింఛన్‌కు అర్హులే. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ఈ నిబంధనను సడలించింది. చేనేత కార్మికులకు ఆం క్షలు ఉండడంతో సామాజిక భద్రత కరువైంది. ఆసరా పిం ఛన్లు, అంత్యోదయ కార్డులివ్వాలని వేడుకుంటున్నారు. -
త్వరలో సమంతతో అధికారిక ఒప్పందం
-
త్వరలో సమంతతో అధికారిక ఒప్పందం
టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యర్ సాక్షి, హైదరాబాద్: చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటి సమంత సేవలను వినియోగించుకుంటామని, త్వరలో ఆమెతో అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యర్ తెలిపారు. సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్ కాదని వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. స్వచ్ఛందంగా చేనేత కోసం ముందుకొచ్చిన సమంత సేవలను వాడుకుంటామన్నారు. చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం తెచ్చేందుకు, డిజైనింగ్, మార్కెటింగ్ రంగాల్లో తనకున్న ఆలోచనలు ఆమె తమతో పంచుకున్నారన్నారు. -
హ్యాండీక్రాఫ్ట్స్‌కు మరింత ప్రాధాన్యం ఇస్తాం
-
సంప్రదాయ హస్తకళలను ఆదరించాలి
అనంతపురం కల్చరల్ : ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే హస్తకళలు, కళాకారులను ప్రోత్సహించాలని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. అనంత వేదికగా 12 రోజుల పాటు సాగే లేపాక్షి హస్తకళా ప్రదర్శన శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. స్థానిక ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోన శశిధర్‌తో పాటు ఏపీ హసక్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాళీ ప్రసాద్, ఆర్డీఓ మలోల తదితరులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కళాకారులు అనంతకు విచ్చేయడం ఆనందంగా ఉందని, వినూత్నంగా ఉన్న వారి ఉత్పత్తులు మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. కళలను ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఆదరించాల్సిన అవసరముందన్నారు. లేపాక్షి ఎంపోరియం మేనేజర్ సుధీంద్ర కుమార్ మాట్లాడుతూ ఈనెల 24 నుంచి వచ్చేనెల 5 వరకు ప్రదర్శన సాగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాగే ప్రదర్శనలో నిర్మల్ పెయింటింగ్స్, బ్లాక్ మెటల్, బ్రాస్ ఐటమ్స్, బంజారా ఉత్పత్తులు, వివిధ చేనేత వస్త్రాలు వంటి సంప్రదాయక హస్తకళలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపోరియం మేనేజర్ వెంకటరమణప్ప, అనంతపురం లేపాక్షి ఎంపోరియం సిబ్బంది సురేష్, అమర్నాథ్, వెంకట్రాముడు, కాటమయ్య తదితరులు పాల్గొన్నారు. -
వృత్తి పనివారిని ప్రోత్సహించండి
- బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు ఇవ్వండి - ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రికి ఎంపీ బుట్టా రేణుక లేఖ కర్నూలు (ఓల్డ్‌సిటీ): జనాభాలో 70 శాతంగా ఉంటున్న బీసీ, ఓబీసీలకు న్యాయం చేసేందుకు వీలుగా చేతివృత్తులు, కులవృత్తులను ప్రోత్సహించాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీకి లేఖ రాశారు. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, చేనేత, మత్స్యకారులు, గొర్రెల పెంపకం వంటి కులవృత్తులతో పాటు హస్తకళలు, వ్యవసాయ అనుబంధ వృత్తులు నిర్వహించుకునేందుకు కనీస పెట్టుబడి, మార్కెటింగ్‌కు డబ్బు అవసరమన్నారు. ఆ మేరకు స్థోమత లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని, బడ్జెట్ (2017-18)లో ఎక్కువ మొత్తాలు కేటాయించి ప్రోత్సహించాలని లేఖలో పేర్కొన్నారు. -
హస్త వర్ణాలు
ఆ చేతులు కదిలితే ప్రపంచం చేతులెత్తి జై కొడుతోంది. ఆ చేతలే చే‘నేత’లై ఫ్యాషన్ ధోరణుల్ని తిరగరాస్తున్నాయి. కొమ్ములు తిరిగిన డిజైనర్లు సైతం సొమ్ములు కావాలంటే తమను ఆశ్రయించాల్సిందే అని శాసిస్తూ... అద్భుతాలను అలవోకగా ఆవిష్కరిస్తూ... హస్తవర్ణాల శోభితమై కొత్త కాంతులీనుతున్నాయి. ఆ చేతులకూ... ఆ చేతలకూ... మన చేనేతల ఘనతకూ ఇవి కొన్ని మెచ్చు తునకలు మాత్రమే... మన చేనేతలు ప్రపంచానికే ప్రత్యేకం సంప్రదాయ చేనేతల గొప్పదనాన్ని వెలికితీయడమే నా ఉద్దేశ్యం. ఇటీవల ‘కౌసల్యం’ పేరుతో హైదరాబాద్‌లో జరిగిన ఫ్యాషన్ షో లో ప్రదర్శించిన వస్త్ర శైలులు ఇవి. దాదాపు 700కు పైగా చేనేతకారుల నైపుణ్యాలు ఈ డిజైనరీ దుస్తులలో ప్రతిఫలిస్తాయి. జమదాని చేనేత పనితనం ఇక్కడే కాదు దేశం మొత్తం మీద, ఇతర దేశాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంది. ఇటీవల జరిగిన లాక్మేఫ్యాషన్ వీక్‌లోనూ, బెర్లిన్‌లో జరిగిన లవేరా ఎకో ఫ్యాషన్ వీక్‌లోనూ చేనేతలు తమ ప్రత్యేకతను నిలుపుకున్నాయి. ఫ్యాషన్ ప్రపంచానికి ఓ ఐకాన్‌గా గుర్తింపును సాధిస్తున్నాయి మన హ్లాండ్లూమ్స్! - గౌరంగ్ షా, ఫ్యాషన్ డిజైనర్ బంగారు జరీ అంచు.. ఆకట్టుకునే రంగులతో రూపొందించిన లెహంగా ఛోలీ ప్రతి వేడుకను దేదీప్యం చేస్తుంది. కాటన్ హ్యాండ్లూమ్ శారీ మీద సన్నని ప్రింట్. నేటి మహళను హుందాగా నిలపడంలో ఎప్పుడూ ముందుంచే ‘కళ’నేత. చూపులను కట్టడి చేసే రంగుల కాంబినేషన్, ఎంబ్రాయిడరీ పనితనం పెళ్లికూతురు సింగారంలో హైలైట్‌గా నిలుపుతాయి. బ్రైడల్ కలెక్షన్లో భాగంగా లెహంగా చోళీతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. సంప్రదాయకట్టు, పాశ్చాత్య కట్... ఇంపైన నిండుతనాన్ని కలిగించే చేనేతలు ప్రతి వేడుకలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటాయి. డిజైనర్ల సృష్టికి జోహార్లు చెబుతాయి. -
హస్తకళ..చేనేత భళ
-
ఆప్కోలో అవకతవకలు వాస్తవమే
ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విచారణ కమిటీ సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక చేనేత సొసైటీల ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా ఆప్కో (టీఎస్) ఇష్టారీతిన వస్త్రాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసినట్లు చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం విచారణలో తేలింది. క్షేత్ర స్థాయి అవసరాలతో పొంతన లేకుండా ఇండెంట్ ఆర్డర్లు.. మగ్గాలు లేని సొసైటీలు వస్త్రాన్ని సరఫరా చేయడం.. చేనేత పేరిట పవర్లూమ్ ఉత్పత్తులను అంటగట్టడం వంటి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగించిన వైనం విచారణలో వెల్లడైంది. రాష్ట్ర చేనేత సహకార సంఘం (ఆప్కో టీఎస్)లో జరిగిన అవకతవకలపై చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన త్రిసభ్య విచారణ కమిటీ.. ఇటీవల తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనేక అంశాలపై ఆప్కో (టీఎస్) నుంచి అరకొర సమాచారం అందినట్లు నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, ఆప్కో విక్రయ షోరూంల నుంచి అందే ఇండెంట్ల ఆధారంగా సొసైటీలకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ఇవ్వాల్సి ఉన్నా.. అధికారులు నిబంధనలు ఉల్లంఘించి నట్లు నివేదికలో పేర్కొంది. వస్త్రం నాణ్యత, సొసైటీల ఉత్పత్తి సామర్థ్యం తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సిబ్బంది స్టాంపింగ్ వేశారు. ఆప్కో గోదాముల్లోనూ వస్త్ర నిల్వలకు సంబంధించి గేట్ ఎంట్రీలు శాస్త్రీయంగా లేవు. చాలా సొసైటీల్లో మగ్గాల సంఖ్యకు, వస్త్ర ఉత్పత్తికి మధ్య పొంతన లేదని కమిటీ నివేదిక స్పష్టం చేసింది. నిబంధనలు బేఖాతర్: మెదక్ జిల్లాలో ఒక సొసైటీలో ఉత్పత్తి చేసే మగ్గాలు లేకున్నా.. వస్త్రాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించిన వైనం వెల్లడైంది. ఎన్‌హెచ్‌డీసీ నుంచి కనీసం 40% ముడి ఊలు కొనాలనే నిబంధన వున్నా అధికారులు.. వంద శాతం ఊలును బయటి సంస్థల నుంచి కొనుగోలు చేశారు. సొసైటీల నుంచి సరఫరా అయిన వస్త్రానికి చెల్లింపుల విషయంలో నిబంధనలు పాటించకుండా.. పలుకుబడి కలిగిన సొసైటీలకే డబ్బులు చెల్లించారు. ఏపీ సొసైటీల నుంచి వస్త్ర సేకరణ నిలిపేయాలని, తెలంగాణ సొసైటీల నుంచే సేకరించాలనే నిబంధనను పాటించలేదని విచారణలో వెల్లడైంది. విచారణ కమిటీ సూచనలివే.. ఆప్కో (టీఎస్)లో జరిగిన అవకతవకలను ప్రాథమికంగా నిర్ధారించిన విచారణ కమిటీ.. మరింత లోతుగా విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఆప్కో ఆర్థిక లావాదేవీలు, స్టాక్ వివరాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. సొసైటీల నుంచి కొనుగోలు చేసే వస్త్రం నాణ్యతను థర్డ్ పార్టీ ద్వారా నిర్ధారించాలి. ఆప్కో (టీఎస్) సభ్య సంఘాల నుంచి మాత్రమే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి. సొసైటీలు అవసరమైనంత వస్త్రాన్ని సరఫరా చేయలేని పక్షంలో.. టెండర్ లేదా ఇతర పద్ధతుల ద్వారా పవర్లూమ్ వస్త్రాన్ని సేకరించాలి. -
చేనేత వస్త్రాల ఎగుమతికి కృషి: జూపల్లి
నగరంలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం సాక్షి, హైదరాబాద్: చేనేత వస్త్రాలకు డిమాండ్ పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆన్లైన్ ద్వారా చేనేత ఉత్పత్తుల ఎగుమతికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం ‘జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో చేనేత ఎగుమతులు పెద్ద ఎత్తున సాగుతున్నాయని, కానీ తెలంగాణలో రూ. 100 కోట్ల విలువైన ఎగుమతులు కూడా లేవని అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేనేత ఉత్పత్తుల విక్రయాల్లో కూడా వినియోగిస్తామని, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ వ్యాపార సంస్థల ద్వారా అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఈ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులకు ఉపాధి కల్పించినట్లవుతుందని అన్నారు. ఇక నుంచి నేతన్నలు తయారు చేసిన వస్త్రాల్లో ఆ చీరను తయారు చేసిన వారి ఫొటో వివరాలు ఉంచే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా నేరుగా చేనేత కార్మికుల నుంచే వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జౌళి శాఖ సంచాలకులు శైలజా రామయ్యర్, ప్రభుత్వ కార్యదర్శి అనితా రాజేందర్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాల్లోనే చేనేత శిక్షణ కేంద్రాలు
అక్టోబర్ 2 నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: నేత కార్మికులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే చేనేత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నాంపల్లిలోని చేనేత భవన్లో గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అనంతరం చేనేత శిక్షణ కేంద్రాన్ని జూపల్లి సందర్శించారు. శిక్షణ పొందుతున్న కార్మికులతో మాట్లాడారు. నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తక్షణమే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాంధీ జయంతి అక్టోబర్ 2నుంచి వాటిని ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ నిఫ్ట్ సహకారంతో నూతన డిజైన్ల తయారీలో మెళకువలను నేర్చుకోవాలన్నారు. తద్వారా బహిరంగ మార్కెట్లో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగే అవకాశం వుంటుందన్నారు. చేనేత ఉత్పత్తుల ద్వారా తాము రోజుకు కనీసం రూ.60 నుంచి రూ.75కు మించి పొందలేకపోతున్నామని కార్మికులు మంత్రికి విన్నవించారు. -
ఒబామాకు అగ్గిపెట్టెలో పట్టే చీర
ఈ నెల 26న ప్రధాని చేతుల మీదుగా బహూకరణ సిరిసిల్ల చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అగ్గిపెట్టెలో అమరే చీరను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత శిల్పి నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను మగ్గంపై నేశాడు. ఈ చీరను అమెరికా అధ్యక్షుడికి అందించేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు హైదరాబాద్‌లో నల్ల విజయ్‌కుమార్ శనివారం అందించారు. హైదరాబాద్‌కు చెందిన దైవజ్ఞశర్మ నల్ల విజయ్‌కుమార్‌ను హైదరాబాద్‌కు పిలిపించి అమెరికా అధ్యక్షుడికి అగ్గిపెట్టెలో చీర, పట్టు శాలువాను అందించే విధంగా ఏర్పాటు చేశారు. జనవరి 26న భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి భారత్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా నాలుగున్నరమీటర్ల అగ్గిపెట్టెలో ఇమిడే చీరతో పాటు రెండుమీటర్ల శాలువాను ఒబామాకు అందించనున్నట్లు కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. నల్ల విజయ్‌కుమార్ చేనేత మగ్గంపై నెలరోజుల పాటు శ్రమించి వీటిని నేశాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసి కేంద్రమంత్రి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని విజయ్‌కుమార్ తెలిపారు. అతితేలికైన చీర, శాలువాను భారత ప్రధాని చేతులమీదుగా అమెరికా అధ్యక్షునికి బహూకరించే అవకాశం రావడంపై విజయ్‌కుమార్ సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో విజయ్‌కుమార్ వస్త్రాలను బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, దైవజ్ఞశర్మ పరిశీలించారు. -
పండగ పూటా పస్తులే!
తిరుపతి రూరల్: ప్రభుత్వ నిర్ణయాలు పండుటాకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పింఛన్ పెరిగిందని ఆనందించిన అసహాయులకు అదీ అందని ద్రాక్షలా మారుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూన్న జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి జనం ఉండరని జిల్లాలో పింఛన్ల పంపిణీని శనివారం అర్ధంతరంగా నిలిపివేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా వేలాదిమంది వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులు, అభయహస్తం పింఛన్‌దారులు పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి. వీరందరికీ జన్మభూమి ప్రారంభం తర్వాతే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇస్తూ.. ఇస్తూ.. జిల్లాలో సెప్టెంబర్ వరకు దాదాపు నాలుగు లక్షలకు పైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అనర్హుల ఏరివేత పేరుతో టీడీపీ నేతల కనుసన్నల్లో చే పట్టిన సర్వేలో పింఛన్ల జాబితా నుంచి 84,617 మందిని ఇప్పటికే తొలగించారు. వీరికి అక్టోబర్ నుంచి పింఛన్లు నిలిపివేశారు. మిగిలిన వారికి ఐదు రెట్లు పింఛన్ పెంచాం అంటూ జన్మభూమి కార్యక్రమంలో అందించారు. కొన్ని పంచాయతీల్లో జన్మభూమి ఆలస్యం కావడంతో పింఛన్ కోసం లబ్ధిదారులు ఆధికార పార్టీ నేతలను నిలదీయడం మొదలుపెట్టారు. దీంతో జన్మభూమితో పనిలేకుండా మూడు రోజులుగా పింఛన్లు అందిస్తున్నారు. కాని ఈ నెల 25 నుంచి మళ్లీ జన్మభూమి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. అందరికీ పింఛన్లు అందిస్తే సభలకు జనంరారనే అనుమానం అధికార పార్టీ నేతలకు వచ్చింది. అనుకున్నదే తడవుగా పింఛన్ల పంపిణీ నిలిపివేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో శనివారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని పోస్టుమాస్టర్లు నిలిపివేశారు. అభాగ్యుల ఆవేదన పెరిగిన పింఛన్ చేతికి వస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అభాగ్యులకు ప్రభుత్వ నిర్ణయం పిడుగుపాటుగా మారింది. పింఛన్‌కు, జన్మభూమికీ లింకు పెడుతూ దానిని అందకుండా చేస్తుండడంతో మండిపడుతున్నారు. దీపావళికి ఇంట్లో పింఛన్ వెలుగులు వస్తాయని కొందరు, అనారోగ్యానికి అక్కరకు వస్తుందని మరికొందరు ఆశించినా వారికి నిరాశే మిగిలింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. జన్మభూమి ఉన్న రోజునే పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందువలన పింఛన్ల పంపిణీ ఆపేశాం. తిరిగి జన్మభూమి జరిగే రోజు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తాం. - ఏపీడీ.శర్మ, పోస్టల్ సూపరింటెండెంట్, తిరుపతి -
మరోసారీ..!
చేనేతలను మభ్యపెడుతున్న చంద్రబాబు ఎమ్మిగనూరు : ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’ అన్న సామెత ప్రస్తుత టీడీపీ పాలకులకు సరిగ్గా సరిపోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేనేత రంగం రూపు రేఖలు మారుస్తానని, చేనేతల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా డ్వాక్రా, రైతు రుణాల మాఫీపైనే స్పష్టత ఇవ్వలేదు. ఇక చేనేతల రుణాల ఊసే ఎత్తడంలేదు. రుణాలు మాఫీ అవుతాయని తమ బతుకులు బాగుపడతాయని చేనేతలు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా సీఎం చేనేతలకు ఎలాంటి భరోసా ఇవ్వడంలేదు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. అప్పుడు ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయింది. ఇప్పటి హామీల పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. అపెరల్ పార్కు అటకెక్కించిన బాబు ఇప్పుడు టెక్స్టైల్ పార్కు ఏర్పాటుచేస్తామని చెప్పడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. బాబు హయాంలో ఎంతో ఆర్భాటంగా అపెరల్ పార్కుకు వేసిన పునాది రాయి సమాధి రాయిని తలపిస్తోంది. ఇక టెక్స్టైల్ పార్కుకు కూడా అదే గతి పడుతుంది. మరచిపోయారా..? వ్యవసాయ తర్వాత ఎక్కువ శాతం మంది ప్రజలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎమ్మిగనూరుకు చేనేత పురిగా కూడా పేరుంది. సుమారు 12 వేల మగ్గాలతో 7 వేల కుటుంబాలు చేనేత వృత్తిలో ఉన్నాయి. ఎమ్మిగనూరు పరిసర ప్రాంతంలోని గుడేకల్, గోనెగండ్ల, నందవరం, నాగులదిన్నె, కోడుమూరులోని మరో నాలుగు వేల కుటుంబాలు కూడా చేనేత వృత్తిపై ఆధారపడి ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో నేతన్నల బతుకులు మరింత దిగజారాయి. చేయూత నివ్వాల్సిన చేనేత సొసైటీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉపాధిని చూపే స్పిన్నింగ్ మిల్లు మూతబడింది. ఆదుకోవాల్సిన సర్కార్ అలసత్వం ప్రదర్శించడంతో చేనేత రంగం జవసత్వాలు కోల్పోయింది. బాబు జమానాలో ఐదుగురు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా 38 మంది స్పిన్నింగ్ మిల్లు కార్మికులు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందారు. ఆదరణ పథకం కింద బాబు హయాంలో కొంతమందికి చేనేత మగ్గాలను పంపిణి చేసినా అవి కూడా దళారుల దోపిడికి గురయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి, నమ్ముకున్న వృత్తిలో గట్టెక్కలేక సుమారు 3 వేల మంది కార్మికులు ప్రత్యామ్నాయం చూసుకున్నారు. మహిళలు హోటళ్లలో, ధనవంతుల ఇళ్లలో పని మనుషులుగా, ప్రైవేట్ సంస్థల్లో ఆయాలుగా చేరారు. పురుషులు లాడ్జిలలో రూమ్ బాయ్‌లుగా హోటళ్లలో సర్వర్లుగా, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలలో వాచ్మన్లుగా చేరారు. మరికొందరు బెంగళూరు, ముంబాయి, చెన్నైకి వలస పోయారు. అపెరల్‌కు ఆనాడే అడ్డంకులు: ఎమ్మిగనూరులో అపెరల్ పార్క్‌ను ఏర్పాటుచేసి చేనేతల కష్టాలు తీరుస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ నేతలు గతంలో ఎన్నికల వాగ్దానాలు చేశారు. 2004 ఫిబ్రవరి 15న అప్పటి చేనేత మంత్రి పడాల భూమన్న, మున్సిపల్ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి అపెరల్ పార్క్ ఏర్పాటుకు బనవాసి వద్ద శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్ల అంచనా వ్యయంతో 10 వేల మందికి ఉపాధిని కల్పించడమే లక్ష్యమని ఆర్భాటంగా ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే అపెరల్ పార్క్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలం బనవాసి పశు వీర్యోత్పత్తి క్షేత్రానికి, జవహార్ నవోదయ విద్యాలయానికి అతి సమీపంలో ఉండడంతో బనవాసి అటవీ శాఖ అధికారులు అపెరల్ పార్క్ నిర్మాణానికి అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కూడా బనవాసి అధికారుల వాదనలతో ఏకీభవించడంతో అపెరల్ పార్క్ నిర్మాణం బాబు జమానాలో మరో పునాది రాయిగానే మిగిలింది. చేయూతనిచ్చిన వైఎస్ సర్కార్: తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగానికి వైఎస్ పాలన వరమైంది. రసాయనాల ప్రభావం, మర మగ్గాల ఒత్తిడి వల్ల చిన్న వయస్సులోనే అనారోగ్యం పాలవుతున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం దశల వారీగా చేయూతనిచ్చింది. వృద్ధాప్య పెన్షన్‌ను చేనేత కార్మికులకు 50 ఏళ్లకే ఇచ్చేలా జీవో జారీ చేసింది. టీడీపీ హయాంలో ఎమ్మిగనూరుకు చెందిన 298 మంది 60 ఏళ్లు పైబడిన కార్మికులు పెన్షన్లు పొందితే వైఎస్ హయాంలో నెలకు రూ.200 చొప్పున 50 ఏళ్లు దాటిన 1586 మంది చేనేతలకు పెన్షన్ సదుపాయం లభించింది. క్లస్టర్ స్కీమ్‌లను ఏర్పాటు చేసి కార్మికులకు అవసరమైన నూలు, ముడి సరుకులను క్లస్టర్ ద్వారా ప్రభుత్వం పంపిణి చేసింది. ఆర్టీజన్ కార్డు, రుణ అర్హత కార్డులను జారీ చేసి కార్మికులకు బీమా సౌకర్యంతో పాటు రుణ సదుపాయాన్ని కూడా కల్పించింది. వైఎస్ చొరవతో ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటికి చెందిన రూ.3.5 కోట్ల రుణాలు, చేనేతలకు చెందిన రూ.16.78 లక్షల వ్యక్తిగత రుణాలు మాఫీ అయ్యాయి. మహానేత వైఎస్ మరణాంతరం చేనేతల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. వైఎస్, రోశయ్య అనంతరం ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన చంద్రబాబు పాలనకు బ్లూ ప్రింట్‌గా కొనసాగిందనే ఆరోపణలు ఉన్నాయి. కిరణ్ సర్కార్ సంక్షేమాన్ని, సంస్థల్ని నిర్వీర్యం చేేసిందనీ నేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్స్టైల్ పార్కు పేరుతో ప్రచారం: గతంలోని తప్పిదాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కొత్త వాగ్దానాలు చేస్తోంది. ఎమ్మిగనూరు-ఆదోని మద్య టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి చేనేతలకు చేయూతనిస్తామనీ సీఎం చంద్రబాబు, స్థానిక నాయకులు ఊదరగొడుతున్నారు. స్థలసేకరణ, నిధుల సమీకరణపై స్పష్టత లేకుండానే హంగామా సృష్టిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. -
చేనేతకు సిసలైన చేవ్రాలు
అతివల మనస్సు దోచే తళుకుబెళుకుల ‘జాందాని’ చేనేత చీరలు... వీటి రూపకల్పన వెనుక శక్తిలాంటి ఒక వ్యక్తి కఠోర శ్రమ... అకుంఠిత దీక్ష... అంతకు మించిన నైపుణ్యం ఉన్నాయి! ఏదో సాధించాలనే తపన... పదిమందికి ఉపయోగపడాలనే తాపత్రయం... పది మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యం ఉన్నాయి. తొమ్మిది పదులు మీద పడినా... చేనేత రంగ అభివృద్ధిపై ఉన్న పట్టుదల, హస్త కళలపై ఉన్న మక్కువ... చేనేత పారిశ్రామికవేత్త లొల్ల వెంకట్రావుకు ఇంకా ఈ రంగంలో కొనసాగేలా స్ఫూర్తి నింపుతున్నాయి... ఈ వయసులోనూ ఆయన అవిశ్రాంత కృషి చూస్తే ఎవరైనా సరే సలామ్ చేయక మానరు! తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని ఆ ఇంట్లోకి ప్రవేశించగానే ఒక టేబుల్ మీద పెద్ద డ్రాయింగ్ షీటు పరుచుకుని డి జైన్లు వేస్తున్న తొమ్మిది పదుల వయస్సు నిండిన ఒక పండు యువకుడు దర్శనమిస్తారు. ఆయన అలా డిజైన్లు ఎందుకు వేస్తున్నారా అని చూసేలోపే, కుర్చీలోంచి లేచి, మగ్గం మీద కూర్చుని తాను ముందుగా గీసిన డిజైన్‌ను చీర మీద తయారుచేస్తూ కనపడతారు. పూవుకు తావి అద్దినట్టుగా చీరెలకు బంగారు లతలు, పూవులు పూయిస్తారు లొల్ల వెంకట్రావు. చేనేత చీరల తయారీలో విప్లవం తెచ్చిన ఘనత ఆయనది. తెల్లటి పంచె లాల్చీ, మందపాటి కళ్లద్దాలతో చాలా సాధారణంగా కనిపించే వెంకట్రావు చేనేత కళకు చేసిన కృషి అసాధారణమైనది. గుమస్తాగా ప్రారంభించి, ఎందరికో ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. పాఠశాలకు వెళ్లి చదివింది ఎనిమిదో తరగతి వరకే అయినా, జీవితాన్ని మాత్రం నిండుగా చదివారు. ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక పెద్ద కథే ఉంది. గుమాస్తాగా... ఉప్పాడకు చెందిన చేనేత వ్యాపారి పుచ్చల రామలింగం వద్ద గుమస్తాగా చేనేత పని జీవితాన్ని ప్రారంభించిన వెంకట్రావు, ఈ పనిలో చేరడానికి ముందు, ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకున్నారు. స్థానికం పాఠశాలలో ఆరు నెలలపాటు ఉపాధ్యాయ శిక్షణ పొంది, ట్రెయినీగా విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పారు. ‘‘మా నాన్నగారు కులవృత్తిని విడిచిపెట్టవద్దని చెప్పడంతో ఆయన ఆవేదనను అర్థం చేసుకుని కులవృత్తి వైపు అడుగులు వేశాను’’ అని చెబుతారు వెంకట్రావు. గుమస్తాగా పని చేస్తున్న రోజుల్లోనే అంటే 1983 నుంచి జాందాని చీరల తయారీలో విప్లవం తీసుకువచ్చారు. దాంతో అక్కడక్కడ మాత్రమే కనిపించే జాందాని మగ్గాల సంఖ్య వందలకు చేరుకుంది. వేల మంది కార్మికులు ఈ వృత్తిని ఎంచుకున్నారు. ‘‘నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేసేవాడిని. జాందాని చీరలలో కొత్త విప్లవం తీసుకురావడానికి ఆ కళ చాలా ఉపయోగపడింది. చీరలపై తీగలు, ఆకులు, జంతువులు, కాయల వంటి కళాకృతులను నేత ద్వారా సృష్టించాను. ఆకృతిని ముందుగానే గ్రాఫ్‌పై తయారుచేసి, దాని మీద నుంచి చీరలపై ఆ డిజైన్ వచ్చేవిధంగా తయారుచేయడం ప్రారంభించాను’’ అని వివరించారు వెంకట్రావు. భవిష్యత్తరాలకు అందించాలని... చేనేతపై ఇంతటి అభిమానం కలగడానికి బీజం స్వాతంత్య్రానికి ముందే వెంకట్రావులో నాటుకుంది. మహాత్మాగాంధీ ఇచ్చిన విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపుతో స్వదేశీ వస్తువుల మీద ఆయన పెంచుకున్న ప్రేమ ఆ తర్వాత జాందాని కళాభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో ఆ కళ గుర్తింపు పొందడానికి కారణమైంది. తాను మక్కువ పెంచుకున్న కళాభివృద్ధికోసం ఆయన చేసిన అచంచల కృషే ఆ కళపై ఆయన పేటెంట్ హక్కును పొందేలా చేసింది. ‘‘జాందాని కళను భవిష్యత్తరాలకు అందించాలని నా సంకల్పం. అందుకే ఈ కళకు సంబంధించి, ‘జాతీయ హస్తకళలలో జాందాని చేనేత హస్తకళ, దాని ప్రత్యేకత - నా అనుభవాలు’ పేరుతో ఒక పుస్తకం రాశాను’’ అంటారు వెంకట్రావు. చేనేత అభివృద్ధి ధ్యేయంగా... నేత కార్మికుడి కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించారు వెంకట్రావు. ‘‘చేనేత రంగం అభివృద్ధి దిశలో పయనిస్తోంది కానీ, కార్మికులు మాత్రం ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు. అందుకే ఈ రంగంలో నిష్ణాతులైన సుమారు వంద మంది నిరుపేద చే నేత కార్మికులకు నెలకు 200రూపాయల చొప్పున పింఛను అందిస్తున్నాను. ఊపిరి ఉన్నంతవరకు ఈ రంగం అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటాను’’ అంటారు వెంకట్రావు. ఈ వయసులో కూడా చీరలకు అవసరమైన డిజైన్లను తానే తయారుచేసుకోవడాన్ని బట్టే ఆయన దీక్ష, పట్టుదల ఎలాంటివో అర్థమవుతుంది. కళల అభివృద్ధికి ఇలాంటి కార్యశూరులే కదా కావాల్సింది! - ఎల్ శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ ఫొటోలు: ఎస్వివివిఎస్ ప్రసాద్, పిఠాపురం జాందాని అంటే... సాధారణంగా ఏదైనా చీరలకు డిజైన్ ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది. జాందాని చీరలపై మాత్రం రెండు వైపులా డిజైన్ ఒకేలా కనిపిస్తుంది. జాందాని అనేది పర్షియన్ పదం. సంస్థానాధీశుల కాలంలో దీనిని వాడుకలోకి తీసుకువచ్చారు. రాణుల కోసం ప్రత్యేకంగా ఈ చీరలు తయారు చేయించేవారు. కాలక్రమంలో వీటిని మన రాష్ట్రంలో కొత్తపల్లిలో నేయడం ప్రారంభించాక వీటికి విస్తృత ప్రాచుర్యం లభించింది. వెండి బంగారు జరీలతో నేత నేయడం వలన ఈ చీరల ధర రూ. 10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ చీర చిరిగినా, పాడైనా సగం ధర తిరిగి రావడం వీటి విశిష్టత. -
జాతీయ చేనేత ప్రదర్శన అదుర్స్
- ఆర్కాట్రోడ్డులో ప్రారంభమైన ఎక్స్పో - జూన్ 15 వరకు కొనసాగనున్న ప్రదర్శన కొరుక్కుపేట, న్యూస్‌లైన్:భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే చేనేత, హస్తకళా వస్తువులు దశాబ్దాల నుంచి ఆదరణ పొందుతూనే ఉన్నాయి. హస్తకళలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వంతోపాటు, పలు సంఘాలు కృషి చేస్తున్నాయి. భారత దేశానికే వన్నె తెచ్చిన చేనేత, హస్తకళలు మరింతగా బతికించుకునేందుకు పుష్పాంజలి ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థాన్ ప్రత్యేకంగా కృషి చేస్తూ చేనేత హస్తకళా ఉత్పత్తులతో ప్రదర్శనలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా చెన్నై, సాలిగ్రామం, భరణీ హాస్పిటల్ సమీపంలోని ఆర్కాట్ రోడ్డులో జాతీయ చేనేత ఎక్స్పోను గురువారం నుంచి ప్రారంభించింది. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, హస్త కళాకారులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రదర్శనలోని వస్తువులు, హస్తకళాఖండాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీహార్‌కు చెందిన మధుబానీ రింట్ శారీలు, జైపూర్‌కు చెందిన తుషార్ సిల్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాంతా సిల్క్ శారీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మధ్య ప్రదేశ్‌కు చెందిన కాశ్మీర్ ప్లోరల్ ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్, ప్యూర్ సాఫ్ట్ కాటన్ బందిని శారీలు, బెంగాళ్ కాటన్ శారీలు, మదురై కాటన్ చీరలు మగువలకు కనువిందు చేస్తున్నాయి. అదేవిధంగా హస్తకళా ప్రియులను లెట్ ఉడ్‌తో, రోజ్ ఉడ్‌తో చేసిన బొమ్మలు, ఆర్ట్ జ్యువలరీ, చిన్నారుల ఆట బొమ్మలు అలరిస్తున్నాయి. జూన్ 15వ తేదీ వరకు కొనసాగనున్న ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. -
నేటి నుంచే గ్రామీణ సాంకేతిక మేళా
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ)లో ఆరు రోజుల గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శనకు రూరల్ టెక్నాలజీ పార్కు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు 11వ గ్రామీణ సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఆర్డీ డెరైక్టర్ జనరల్ ఎం.వి.రావు తెలిపారు. గురువారం ఎన్ఐఆర్డీ ప్రధాన కార్యాలయంలో ఎం.వి.రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13వరకు జరిగే మేళాలో 250 స్టాళ్లను అనుమతించామని.. రాష్ట్రం, దేశంలోని పలు ప్రాంతాల నుంచి హస్తకళలు, శాస్త్రసాంకేతిక ఉత్పత్తులు, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులు మేళాలో ప్రదర్శనకు రానున్నాయని తెలిపారు. 50 కొత్త ప్రయోగాలు సందర్శకులను ఆకట్టుకుంటాయని, సోలార్ గ్రైండర్ మిక్సర్ ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గం టల వరకూ మేళా జరుగుతుందని, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు రావడానికి రవాణా సౌకర్యం కల్పించినట్టు రావు తెలిపారు. ఎన్ఐఆర్డీకి 12వ పంచవర్ష ప్రణాళికలో రూ. 500 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో మారుమూల గ్రామాల యువతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రావు వివరించారు. -
సబ్ ప్లాన్ రాకుంటే ఆకలి చావులే!
ఇంతవరకు ఈ వృత్తులనే నమ్ముకుని, సమాజ మనుగడకు కారణభూతులైన కోట్లాది మందికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపవలసిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. వృత్తి యాంత్రీకరణ జరిగి, లాభసాటి కాగానే దానిని సంపన్న పారిశ్రామిక వర్గాల చేతిలో పెట్టడం ధర్మమా? దీనికి ఒక విధానం ఉండాలి. అనాదిగా సంపద సృష్టికి, సమాజ మనుగ డకు కారణభూతులైన చేతివృత్తులు, కులవృ త్తుల వారి మనుగడ ఈ రోజు ప్రశ్నార్థకమైం ది. 1992 నాటి సరళీకృత ఆర్థిక విధానాల తరువాత, ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పరి శ్రమలు రావడంతో దాదాపు 42 కులవృ త్తులు పూర్తిగా కుదేలయి వాటిని నమ్ముకున్న కులాలు విలవిలలాడుతున్నాయి. ప్రపంచం శరవేగంతో ముందుకు పోతు న్నది. ఈ సందర్భంలో కులవృత్తులు, చేతి వృత్తుల స్థానంలో యాంత్రీకరణ, కంప్యూటీ కరణ, కార్పొరేటీకరణ జరగడాన్ని వ్యతిరేకిం చనవసరం లేదు. పాత వ్యవస్థ కొనసాగాలని కోరడం సబబు కాదు. కాని ఇంతవరకు ఈ వృత్తులనే నమ్ముకుని, సమాజ మనుగడకు కారణభూతులైన కోట్లాది మందికి ప్రత్యా మ్నాయ ఉపాధి చూపవలసిన బాధ్యత ప్రజా స్వామ్య ప్రభుత్వంపై ఉంది. వృత్తి యాంత్రీక రణ జరిగి, లాభసాటి కాగానే దానిని సం పన్న పారిశ్రామిక వర్గాల చేతిలో పెట్టడం ధర్మమా? దీనికి ఒక విధానం ఉండాలి. ప్రపంచ దేశాలు ఆధునికీకరణ చెందే క్రమంలో ఆయా ప్రభుత్వాలు అన్ని వర్గాలను ఆ మార్పులకు భాగస్వాములను చేస్తున్నా యి. అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు అం దిస్తున్నాయి. దాదాపు 40 దేశాలలో వచ్చిన పురోగతి అన్ని వర్గాలకు సమంగా చేరింది. మన దేశంలో ఆ సమతుల్యత కానరాదు. బట్ట ల మిల్లులు, ఫ్యాక్టరీలు న్యాయబద్ధంగా చేనే త కార్మికులకు; డిస్టిలరీలు, బ్రేవరీస్, వైన్‌షా పులు గీత కార్మికులకు చెందాలి. అలా జరగ డంలేదు. చేపల చెరువులు, రొయ్యల చెరు వులు మత్స్యకారులకు కేటాయించడంలేదు. ఇవన్నీ పారిశ్రామిక వర్గాల వశమై, వృత్తులు కోల్పోయిన వారు ఆకలి చావులు చస్తున్నారు. 54 శాతం ఉన్న చేతివృత్తులు, కులవృత్తుల వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవ డం ఉచిత సహాయమని ప్రభుత్వం భావించరాదు. మానవ వనరులను సద్వినియోగం చేస్తున్నా మనే కోణంలో చూడాలి. ఈ అంశంలో ప్రభుత్వ విధానాలు మొక్కుబడిగా ఉంటే మంచిది కాదు. ఫెడరే షన్ల ద్వారా లబ్ధిదారులకు ప్రస్తుతం ఒక్కొ క్కరికి కేవలం 5 వేల రూపాయలు మంజూరు చేస్తున్నారు. దీనితోనే అభివృద్ధి చెందగలరా? కార్పొరేటీకరణ నేపథ్యంలో రజకులకు ఒక్కొ క్కరికి 5 వేలు మంజూరు చేస్తే ‘డ్రైక్లీన్ షాప్’ ఎలా పెడతారు? కాబట్టి 17 ఫెడరేషన్ల వారికి ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తే తప్ప, వృత్తిలో యాంత్రికీకరణ సాధించలేరు. 20 వేల కోట్ల బడ్జెట్‌తో సబ్‌ప్లాన్ ప్రకటించాలని బీసీ సంక్షే మ సంఘం ముఖ్యమంత్రితో నాలుగు దఫా లు చర్చించింది. కుల, చేతివృత్తులకు ప్రత్యా మ్నాయ ఉపాధి, రోడ్లపాలైన 124 కులాల వారికి బీసీ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు లిం కు లేకుండా రుణాలు మంజూరు చేయడం. కులవృత్తులను ఆధునీకరించి, కార్పొరేట్ స్థాయిలో పోటీ పడి నడిపించడానికి వృత్తిని బట్టి ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేయడం, ఫీజుల రియింబర్స్‌మెంట్ పథకానికి పెట్టిన షరతు లను తొలగించడం, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ తదితర కోర్సుల వారికి పూర్తి ఫీజులు మంజూరు, రెసిడెన్షియల్ పాఠశాలలు లేని 244 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీసీ రెసిడెన్షి యల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు మం జూరు చేయడం. పాఠశాల స్థాయి విద్యా ర్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమును పునరుద్ధరించి ఒక్కొక్కరికి నెలకు రూ.500 చొప్పున స్కాలర్షిప్ 10 నెలలపాటు ఇవ్వ డం వంటి డిమాండ్లను బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వం ముందు ఉంచింది. అన్ని రంగా లలో శాఖల వారీగా బీసీ జనాభా ప్రకారం సబ్ ప్లాన్‌కు 50 శాతం బడ్జెట్ కేటాయించా లని కూడా సంఘం కోరుతోంది. ఈ డిమాం డ్లతోనే కలెక్టరేట్లు ముట్టడి జరిగింది. దీనితో నలుగురు మంత్రుల ఉపసంఘం వేశారు. కానీ ఇంకా ఏమీ తేలలేదు. ఇందిరమ్మ ఇళ్లు, సబ్సిడీ బియ్యం, ఆహార భద్రత, అభయ హస్తం, బంగారు తల్లి లాంటి పధకాలతో వారి బతుకులు బాగుపడవు. ఎప్పుడూ చేత లు చాచేవిగానే మిగిలిపోతాయి. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలకే ఉపయోగపడతాయి. 66 ఏళ్ల స్వాతంత్య్రంలో ఈ కులాలను ప్రభు త్వాలు ఇలాగే మోసగిస్తున్నాయి. బీసీ కులాల సమగ్రాభివృద్ధికి సత్వరం స్పందించవలసిన సమయమిది. - ఆర్.కృష్ణయ్య అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం