జిల్లాల్లోనే చేనేత శిక్షణ కేంద్రాలు
అక్టోబర్ 2 నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: నేత కార్మికులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే చేనేత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నాంపల్లిలోని చేనేత భవన్‌లో గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అనంతరం చేనేత శిక్షణ కేంద్రాన్ని జూపల్లి సందర్శించారు. శిక్షణ పొందుతున్న కార్మికులతో మాట్లాడారు. నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తక్షణమే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాంధీ జయంతి అక్టోబర్ 2నుంచి వాటిని ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ నిఫ్ట్ సహకారంతో నూతన డిజైన్ల తయారీలో మెళకువలను నేర్చుకోవాలన్నారు. తద్వారా బహిరంగ మార్కెట్‌లో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగే అవకాశం వుంటుందన్నారు. చేనేత ఉత్పత్తుల ద్వారా తాము రోజుకు కనీసం రూ.60 నుంచి రూ.75కు మించి పొందలేకపోతున్నామని కార్మికులు మంత్రికి విన్నవించారు.