![CM Revanth Reddy Inaugurates Experium Eco Park In Proddatur: Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/29/PRODDUTUR-10.jpg.webp?itok=5azwXYe8)
చిరంజీవికి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి జూపల్లి, రాందేవ్‌రావు
వికారాబాద్‌ను ఎకో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక
ప్రొద్దుటూరులోని ఎకో పార్కు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
త్వరలోనే కొత్త టూరిజం పాలసీ తెస్తామని ప్రకటన
శంకర్‌పల్లి: ‘ఎక్స్‌పీరియం ఎకోపార్కు’రాష్ట్రానికి మణిహారంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో 85 దేశాల నుంచి తెచ్చిన 25 వేల మొక్కలతో ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌పీరియం’ఎకో పార్కును ప్రముఖ సినీనటుడు చిరంజీవి, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పార్కు యజమాని రాందేవ్‌రావుతో కలిసి ఎలక్ట్రిక్ వాహనంలో తిరుగుతూ పార్కును పరిశీలించారు.
మొక్కల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వనజీవి రామయ్య దంపతులు, ఇటీవల గవర్నర్ పురస్కారానికి ఎంపికైన దుశ్చర్ల సత్యనారాయణను సీఎం రేవంత్‌రెడ్డి, చిరంజీవి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎక్స్‌పీరియం ఎకోపార్కు లోగో, కాఫీ టేబుల్‌బుక్‌ను ఆవిష్కరించారు. అయితే కార్యక్రమ ప్రారంబోత్సవంలో వేదికపైకి వనజీవి రామయ్యను పిలవకపోవడాన్ని గమనించిన సీఎం..వారిని వేదికపైకి పిలిచి గౌరవించారు.
టూరిజంతోనే గుర్తింపు, ఆదాయం
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో రాణించిందని, టూరిజంను అభివృద్ధి చేసేందుకు వనరులున్నా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. టూరిజం ద్వారానే రాష్ట్రానికి గుర్తింపు, ఆదాయం లభిస్తుందని తెలిపారు. త్వరలోనే నూతన టూరి జం (టెంపుల్, ఎకో, హెల్త్) పాలసీని తీసుకొచ్చేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. వికారాబాద్ ప్రాంతంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందని, ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం స్పాట్‌గా మారుస్తామని, ఇందుకోసం పెద్ద పెద్ద పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. 25ఏళ్ల కలను సాకారం చేసుకున్న ఎక్స్‌పీరియం పార్కు యజమాని రాందేవ్‌రావును సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
ఈ పార్కు తెలంగాణ పర్యాటక రంగానికి ఎంతో దగ్గరగా ఉందని, ప్రస్తుతం 30 శాతం మాత్రమే పూర్తయిందని, ఏడాదిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీనికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేశారు. వనజీవి రామయ్య జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీఎం రమేశ్, అనిల్‌కుమార్, శాసనమండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం నా సంపాదన అంతంతే: చిరంజీవి
‘రాందేవ్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. దేశ, విదేశాల్లోని మొక్కలను తీసుకొచ్చి చూపిస్తూ తీసుకోండి సార్ అనేవారు. అప్పుడు రూ.వేలల్లో ఉన్న మొక్కలు ధరలు, ఇప్పుడు కోట్లలో ఉన్నాయి. ప్రస్తుతం నా సంపాదన అంతంత మాత్రమే ఉంది. తర్వాత కొనుగోలు చేస్తానంటూ’మెగాస్టార్ చిరంజీవి చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.ప్రొద్దుటూరులో రాందేవ్‌రావు నిర్మించిన ఎక్స్‌పీరియం పార్కును చూడాలంటే కళా హృదయం ఉండాలని చిరంజీవి అన్నారు. తనకు ఈ ప్రాంతంతో 25 ఏళ్ల క్రితం నుంచి అనుబంధం ఉందన్నారు. 2000లో జీవం ఉన్న మొక్కలను అందించి రాందేవ్ తననే ఆశ్చర్యపరిచారని, ఆ మొక్కలు నేటికి తన గార్డెన్‌లో ఉన్నాయని తెలిపారు. షూటింగ్‌లకు అనుమతి ఇస్తారా అంటే తనకే ఫస్ట్ ఇస్తానని రాందేవ్ చెప్పారని, రానున్న రోజుల్లో ఇక్కడ షూటింగ్ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment