మగ్గాలపై మలిసంధ్య బతుకులు
చేనేతను నమ్ముకుని పనిచేస్తున్న ఆఖరితరం
- సిరిసిల్లలో మొత్తం 175 చేనేత మగ్గాలు
- కార్మికులు 225 మంది మాత్రమే
- ఇప్పటికే జియో ట్యాగింగ్ పూర్తి
- చేనేతను మింగిన మర నేత
ఈ చిత్రంలో కనిపిస్తున్న చేనేత కార్మికుడి పేరు మామిడాల చంద్రయ్య (92). భార్య పేరు కమలమ్మ. ముగ్గురు కుమారులు, ఒక కూతురు. సిరిసిల్ల విద్యానగర్‌వాసి. ఒకప్పుడు బాగానే బతికాడు. ఇల్లు కట్టుకోవడంతోపాటు కుమారులు, కూతురుకు పెళ్లిళ్లు చేశాడు. వీరు ఎవరికి వారే బతుకుతున్నారు. ఈ వృద్ధుడిది ఇప్పుడు సాతగాని పానం.. బొక్కలు తేలిన ఒళ్లు.. మగ్గంపై జోటను ఆడించాలంటే రెక్కల్లో సత్తువ లేదు. తన ఒంట్లో సత్తువ లేకున్నా.. చేనేత మగ్గంపై బట్ట నేస్తున్నాడు. రోజూ పొద్దుగాల 10 గంటలకు వచ్చి చేనేతమగ్గంపై 4 మీటర్ల బట్టను సాయంత్రం 5 గంటల వరకు ఉత్పత్తిచేసి వెళ్తాడు. ఒక్కో మీటరుకు రూ.17 చొప్పున రోజూ రూ.68 కూలి వస్తుంది. నెలకు రూ.1,500 – రూ.1,800 మాత్రమే అందుతుంది. ప్రభుత్వం ఆసరా పింఛన్ రూ.1,000 ఇస్తుంది. ఈ సొమ్ముతోనే బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలతో పూటగడవాలి. ఆరోగ్యం సహకరించకున్నా చేనేతమగ్గంపై బట్ట నేసి అంతో ఇంతో సంపాదించడం తప్ప మరోమార్గంలేదు. ఇది ఒక్క చంద్రయ్య– కమలమ్మ దంపతుల పరిస్థితే కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దాదాపు 225 మంది చేనేత కార్మికుల దుస్థితి.
సిరిసిల్ల: ‘చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు’.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్) మింగేశాయి. కాలంతో పోటీ పడలేక.. జిగిసచ్చిన వృద్ధ కార్మికులు మరోపని చేతకాక.. వయసు పైబడినా.. కళ్లు కనిపించ కపోయినా.. ఒళ్లు సహకరించకున్నా.. జానెడు పొట్ట కోసం.. కాళ్లు, చేతులు ఆడిస్తూ బట్ట నేస్తున్నారు. 58 ఏళ్లవయసు నిండితే ప్రభుత్వం రిటైర్మెంట్‌ను ప్రకటి స్తోంది. కానీ చేనేత కార్మికులంతా 60 దాటి 95 ఏళ్ల వయసున్న వారు ఇంకా మగ్గంపై శ్రమిస్తూ.. పొట్టపో సుకుంటున్నారు. తక్కువ కూలి ఉన్నా.. కుటుంబ అవసరాల కోసం మగ్గాన్నే నమ్ముకుని మలి సంధ్య లోనూ పనిచేస్తున్నారు. సిరిసిల్లలో మూడు చేనేత సహకార సంఘాలు ఉండగా.. 114 మంది కార్మికులు చేనేత మగ్గాలపై ఆధారపడ్డవారే.. మరమగ్గాలపై వేగం గా బట్ట ఉత్పత్తి అవుతుండగా.. చేనేతమగ్గంపై కాళ్లు, చేతులు ఆడిస్తూ.. ఎంతశ్రమించినా మరమగ్గాలతో పోటీపడలేక పోతున్నారు. అత్యంత కష్టమైన ఈ పనిలో వయోవృద్ధులు శ్రమించడం బాధాకరం. ఈ పనిని కొత్తగా ఎవ్వరూ నేర్చుకోకపోవడంతో ఈ తరం తనువు చాలిస్తే.. చేనేత మగ్గాలు మూలన పడాల్సిందే. ఇప్పుడు మరణశయ్యపై చేనేత మగ్గాలు ఆఖరితరం చేతిలో బట్టనేస్తున్నాయి.
మిగిలినవి కొన్నే..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 175 చేనేత మగ్గా లు ఉన్నాయి. వీటికి చేనేత, జౌళిశాఖ అధి కారులు జియో ట్యాగింగ్ చేశారు. ఈ రంగంపై 175 మంది కార్మికులు, మరో 50 మంది అను బంధ రంగాల కార్మికులు ఆధారపడ్డారు. సిరిసి ల్లలో అత్యధికంగా 135 మంది ఉండగా.. వేము లవాడ, మామిడిపల్లి, బోయినపల్లి, తంగళ్లపల్లి గ్రామాల్లో మిగతావారు పని చేస్తున్నారు. వీరికి టెస్కో ద్వారా నూలు సరఫరా అవుతోంది. దీని ఆధారంగా బట్టనేసి ఇస్తున్నారు.
‘ఆసరా’ అంతంతే..
ప్రభుత్వం అందించే రాయితీలు, సంక్షేమ పథకాలు మర మగ్గాల కార్మికులకు కొంతైనా దరి చేరుతున్నాయి. కానీ, నిజమైన చేనేత కార్మికులకు చేయూత లభించడంలేదు. 35 కిలోల బియ్యం వచ్చే అంత్యోదయ కార్డులు మంజూరు చేయడంలేదు. ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇవ్వాలనే నిబంధన.. వృద్ధాప్యంలో ఉన్న దంప తుల్లో ఒక్కరికే వర్తిస్తోంది. మగ్గం నేసే కార్మికుడు, ఇంట్లో ఉండే వృద్ధురాలు ఇద్దరూ పింఛన్‌కు అర్హులే. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ఈ నిబంధనను సడలించింది. చేనేత కార్మికులకు ఆం క్షలు ఉండడంతో సామాజిక భద్రత కరువైంది. ఆసరా పిం ఛన్లు, అంత్యోదయ కార్డులివ్వాలని వేడుకుంటున్నారు.