లే అవుట్‌ డౌటే! | Geo tagging of HMDA lands | Sakshi
Sakshi News home page

లే అవుట్‌ డౌటే!

Published Sun, Jan 21 2024 7:51 AM | Last Updated on Sun, Jan 21 2024 7:51 AM

Geo tagging of HMDA lands - Sakshi

సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏలో భూసేకరణ నిలిచిపోయింది. ఔటర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములను సేకరించి లే అవుట్‌లను అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రణాళికలను రూపొందించారు. పలు చోట్ల రైతుల నుంచి భూసేకరణ కూడా చేపట్టారు. లేమూరు, ఇనుముల్‌నర్వ వంటి చోట్ల లే అవుట్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు కూడా చేపట్టారు. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా లే అవుట్‌లను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ.. ప్రభుత్వం మారడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. భూ సేకరణపై కొత్త సర్కారు సమీక్షించి నిర్ణయం తీసుకొంటే తప్ప ముందుకెళ్లడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.   
 
వెయ్యి ఎకరాల సేకరణకు ప్రణాళికలు.. 
కోకాపేట్, మోకిలా, బుద్వేల్‌ తదితర ప్రాంతాల్లో  హెచ్‌ఎండీఏ  సొంత స్థలాల్లో  నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో అదే పద్ధతిలో మరిన్ని  భూములను అభివృద్ధి చేయాలని భావించారు. ఔటర్‌కు అన్ని వైపులా సుమారు 1000 ఎకరాల వరకు సేకరించి అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఉప్పల్‌ భగాయత్‌లో మూడుసార్లు నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు కూడా కొనుగోలుదారుల నుంచి స్పందన  లభించింది. 

అన్ని చోట్లా అంచనాలకు మించి ఆదాయం లభించింది. దీంతో హెచ్‌ఎండీఏ ఎక్కడ భూమి లభిస్తే అక్కడ లే అవుట్‌ను అభివృద్ధి చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ మేరకు  ఉప్పల్‌ భగాయత్‌ తరహాలో ప్రతాపసింగారంలో భారీ లే అవుట్‌కు చర్యలు చేపట్టారు. ఇందుకోసం సుమారు 250 ఎకరాలను హెచ్‌ఎండీఏకు అప్పగించేందుకు రైతులు సైతం సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులకు, హెచ్‌ఎండీఏకు మధ్య ఒప్పందం ఏర్పాటు చేసుకోవాల్సిన తరుణంలో ఎన్నికల దృష్ట్యా ఈ ప్రక్రియ నిలిచిపోయింది.  

కీసర సమీపంలోని బోగారంలోనూ మరో 170 ఎకరాలు లే అవుట్‌కు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ భూములు  నిరుపయోగంగా ఉన్నాయి. రెండు దఫాలుగా రైతులతో  చర్చలు జరిపారు. మరోసారి చర్చించి ఒప్పందం చేసుకోవాల్సిన తరుణంలో అసెంబ్లీ ఎన్నికలొచ్చేశాయి. ప్రతాపసింగారం, బోగారంలతో పాటు  కుర్మల్‌గూడ, దండుమల్కాపురం, లేమూరు, ఇన్ముల్‌నర్వ, కొర్రెముల, నాదర్‌గుల్‌ తదితర ప్రాంతాల్లో  నిరుపయోగంగా ఉన్న సుమారు వెయ్యి ఎకరాల భూములను గుర్తించారు. 

ఇప్పటికే ఇన్ముల్‌నర్వలోని 96 ఎకరాలు, లేమూరులో మరో  83 ఎకరాలను సేకరించారు. కుర్మల్‌గూడలో 92 ఎకరాలు, దండుమల్కాపురంలో  మరో  355 ఎకరాల చొప్పున భూమి  అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 924 ఎకరాలకు  పైగా భూములను  గుర్తించగా,  ఈ భూముల సేకరణ పూర్తయ్యేనాటికి మరి కొంతమంది రైతులు ముందుకు వచ్చే వచ్చే అవకాశం ఉందని అప్పట్లో అధికారులు అంచనాలు వేశారు. కానీ ప్రభుత్వ మార్పుతో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. 
తూర్పు వైపు విస్తరణపై దృష్టి.. 

ఇటీవల కాలంలో పడమటి వైపున రియల్టర్లు, బిల్డర్‌ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఐటీ సంస్థలు,పలు అంతర్జాతీయ సంస్థలు పడమటి వైపే విస్తరించుకొని ఉండడం, హైరైజ్‌ భవనాల నిర్మాణానికి అనుమతులు లభించడంతో కొనుగోలుదారులు  సైతం  ఇటు వైపు  ఆసక్తి చూపుతున్నారు. కోకాపేట్‌ చుట్టుపక్కల ప్రాంతాల తర్వాత బుద్వేల్‌  హాట్‌కేక్‌గా మారింది. ఇప్పటికే ఈ రెండు చోట్ల  విక్రయాలు పూర్తి కావడంతో 
హెచ్‌ఎండీఏ తూర్పు వైపున దృష్టి సారించింది. గతంలో మేడిపల్లి, బోడుప్పల్, తొర్రూరు తదితర ప్రాంతాల్లో స్థలాలను విక్రయించారు.  

సొంత ఇళ్ల నిర్మాణానికి ఈ లేఅవుట్‌లు అనుకూలంగా ఉండడంతో మధ్యగతరగతి వర్గాలు, ఎన్నారైలు ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే మరోసారి తూర్పు వైపున కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు భారీ లేఅవుట్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిరుపయోగంగా  ఉన్న భూములను సేకరించి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు తదితర సదుపాయాలతో నివాసయోగ్యమైన వెంచర్‌లను ఏర్పాటు చేయాలని  ప్రతిపాదించారు. రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసిన తర్వాత 60 శాతం భూములను తిరిగి వారికే అప్పగిస్తారు. 40 శాతం భూమిని హెచ్‌ఎండీఏ తీసుకుంటుంది. ‘భూ సేకరణ తిరిగి మొదటికొచి్చంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే తప్ప తిరిగి  చేపట్టడం సాధ్యం కాదు’ అని ఒక అధికారి చెప్పారు. 

 హెచ్‌ఎండీఏ భూములకు జియో ట్యాగింగ్‌ 
హెచ్‌ఎండీఏ భూములకు త్వరలో జియో ట్యాగింగ్‌ చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో హెచ్‌ఎండీఏకు ఉన్న భూములపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఆ లెక్క తేలిన వెంటనే జియో ట్యాగింగ్‌కు శ్రీకారం చుడతారు. ఇదే జరిగితే ఆన్‌లైన్‌లో నిరంతరం భూములను పర్యవేక్షించేందుకు ఆస్కారం ఉంటుంది. ఎక్కడ ఎలాంటి అక్రమ కట్టడాలు వెలసినా, కబ్జాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయిన వెంటనే హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  బృందం రంగంలోకి దిగుతుంది. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, తదితర విభాగాల సాయంతో భూముల రక్షణకు చర్యలు చేపడుతుంది.

 హెచ్‌ఎండీఏలోని ఏడు జిల్లాల పరిధిలో  వేలాది ఎకరాలకు పైగా భూములు ఉన్నట్టు అంచనా. అయితే కొంతకాలంగా ఈ భూముల రక్షణ పెద్ద సవాల్‌గా మారింది. ఒక్క జవహర్‌నగర్‌లోనే దాదాపు 1500 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు అంచనా. కుత్బుల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో అనేక చోట్ల హెచ్‌ఎండీఏ  భూములు అదృశ్యమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు గతంలో హెచ్‌ఎంటీ  ప్రాంతంలో ఉన్న వంద ఎకరాలకు పైగా భూమికి రక్షణ చర్యలు చేపట్టారు. కాగా.. శంషాబాద్‌లో అన్యాక్రాంతమైన భూముల కోసం హెచ్‌ఎండీఏ పెద్దఎత్తున న్యాయ పోరాటం చేయాల్సివచి్చంది. ఇటీవల ఆ భూములపై సుప్రీంకోర్టులోనూ హెచ్‌ఎండీఏకు అనుకూలంగా తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. ఇలా సొంత స్థలాలు అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకే  తాజాగా జియో ట్యాగింగ్‌ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement