HMDA lands
-
లే అవుట్ డౌటే!
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏలో భూసేకరణ నిలిచిపోయింది. ఔటర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములను సేకరించి లే అవుట్లను అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రణాళికలను రూపొందించారు. పలు చోట్ల రైతుల నుంచి భూసేకరణ కూడా చేపట్టారు. లేమూరు, ఇనుముల్‌నర్వ వంటి చోట్ల లే అవుట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు కూడా చేపట్టారు. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా లే అవుట్లను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ.. ప్రభుత్వం మారడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. భూ సేకరణపై కొత్త సర్కారు సమీక్షించి నిర్ణయం తీసుకొంటే తప్ప ముందుకెళ్లడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. వెయ్యి ఎకరాల సేకరణకు ప్రణాళికలు.. కోకాపేట్, మోకిలా, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో హెచ్ఎండీఏ సొంత స్థలాల్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌కు కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో అదే పద్ధతిలో మరిన్ని భూములను అభివృద్ధి చేయాలని భావించారు. ఔటర్‌కు అన్ని వైపులా సుమారు 1000 ఎకరాల వరకు సేకరించి అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఉప్పల్ భగాయత్‌లో మూడుసార్లు నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌కు కూడా కొనుగోలుదారుల నుంచి స్పందన లభించింది. అన్ని చోట్లా అంచనాలకు మించి ఆదాయం లభించింది. దీంతో హెచ్ఎండీఏ ఎక్కడ భూమి లభిస్తే అక్కడ లే అవుట్‌ను అభివృద్ధి చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ మేరకు ఉప్పల్ భగాయత్ తరహాలో ప్రతాపసింగారంలో భారీ లే అవుట్‌కు చర్యలు చేపట్టారు. ఇందుకోసం సుమారు 250 ఎకరాలను హెచ్ఎండీఏకు అప్పగించేందుకు రైతులు సైతం సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులకు, హెచ్ఎండీఏకు మధ్య ఒప్పందం ఏర్పాటు చేసుకోవాల్సిన తరుణంలో ఎన్నికల దృష్ట్యా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కీసర సమీపంలోని బోగారంలోనూ మరో 170 ఎకరాలు లే అవుట్‌కు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. రెండు దఫాలుగా రైతులతో చర్చలు జరిపారు. మరోసారి చర్చించి ఒప్పందం చేసుకోవాల్సిన తరుణంలో అసెంబ్లీ ఎన్నికలొచ్చేశాయి. ప్రతాపసింగారం, బోగారంలతో పాటు కుర్మల్‌గూడ, దండుమల్కాపురం, లేమూరు, ఇన్ముల్‌నర్వ, కొర్రెముల, నాదర్గుల్ తదితర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న సుమారు వెయ్యి ఎకరాల భూములను గుర్తించారు. ఇప్పటికే ఇన్ముల్‌నర్వలోని 96 ఎకరాలు, లేమూరులో మరో 83 ఎకరాలను సేకరించారు. కుర్మల్‌గూడలో 92 ఎకరాలు, దండుమల్కాపురంలో మరో 355 ఎకరాల చొప్పున భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 924 ఎకరాలకు పైగా భూములను గుర్తించగా, ఈ భూముల సేకరణ పూర్తయ్యేనాటికి మరి కొంతమంది రైతులు ముందుకు వచ్చే వచ్చే అవకాశం ఉందని అప్పట్లో అధికారులు అంచనాలు వేశారు. కానీ ప్రభుత్వ మార్పుతో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. తూర్పు వైపు విస్తరణపై దృష్టి.. ఇటీవల కాలంలో పడమటి వైపున రియల్టర్లు, బిల్డర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఐటీ సంస్థలు,పలు అంతర్జాతీయ సంస్థలు పడమటి వైపే విస్తరించుకొని ఉండడం, హైరైజ్ భవనాల నిర్మాణానికి అనుమతులు లభించడంతో కొనుగోలుదారులు సైతం ఇటు వైపు ఆసక్తి చూపుతున్నారు. కోకాపేట్ చుట్టుపక్కల ప్రాంతాల తర్వాత బుద్వేల్ హాట్‌కేక్‌గా మారింది. ఇప్పటికే ఈ రెండు చోట్ల విక్రయాలు పూర్తి కావడంతో హెచ్ఎండీఏ తూర్పు వైపున దృష్టి సారించింది. గతంలో మేడిపల్లి, బోడుప్పల్, తొర్రూరు తదితర ప్రాంతాల్లో స్థలాలను విక్రయించారు. సొంత ఇళ్ల నిర్మాణానికి ఈ లేఅవుట్లు అనుకూలంగా ఉండడంతో మధ్యగతరగతి వర్గాలు, ఎన్నారైలు ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే మరోసారి తూర్పు వైపున కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు భారీ లేఅవుట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిరుపయోగంగా ఉన్న భూములను సేకరించి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు తదితర సదుపాయాలతో నివాసయోగ్యమైన వెంచర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసిన తర్వాత 60 శాతం భూములను తిరిగి వారికే అప్పగిస్తారు. 40 శాతం భూమిని హెచ్ఎండీఏ తీసుకుంటుంది. ‘భూ సేకరణ తిరిగి మొదటికొచి్చంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే తప్ప తిరిగి చేపట్టడం సాధ్యం కాదు’ అని ఒక అధికారి చెప్పారు. హెచ్ఎండీఏ భూములకు జియో ట్యాగింగ్ హెచ్ఎండీఏ భూములకు త్వరలో జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో హెచ్ఎండీఏకు ఉన్న భూములపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఆ లెక్క తేలిన వెంటనే జియో ట్యాగింగ్‌కు శ్రీకారం చుడతారు. ఇదే జరిగితే ఆన్లైన్లో నిరంతరం భూములను పర్యవేక్షించేందుకు ఆస్కారం ఉంటుంది. ఎక్కడ ఎలాంటి అక్రమ కట్టడాలు వెలసినా, కబ్జాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయిన వెంటనే హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ బృందం రంగంలోకి దిగుతుంది. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, తదితర విభాగాల సాయంతో భూముల రక్షణకు చర్యలు చేపడుతుంది. హెచ్ఎండీఏలోని ఏడు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలకు పైగా భూములు ఉన్నట్టు అంచనా. అయితే కొంతకాలంగా ఈ భూముల రక్షణ పెద్ద సవాల్‌గా మారింది. ఒక్క జవహర్‌నగర్‌లోనే దాదాపు 1500 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు అంచనా. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అనేక చోట్ల హెచ్ఎండీఏ భూములు అదృశ్యమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు గతంలో హెచ్ఎంటీ ప్రాంతంలో ఉన్న వంద ఎకరాలకు పైగా భూమికి రక్షణ చర్యలు చేపట్టారు. కాగా.. శంషాబాద్‌లో అన్యాక్రాంతమైన భూముల కోసం హెచ్ఎండీఏ పెద్దఎత్తున న్యాయ పోరాటం చేయాల్సివచి్చంది. ఇటీవల ఆ భూములపై సుప్రీంకోర్టులోనూ హెచ్ఎండీఏకు అనుకూలంగా తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. ఇలా సొంత స్థలాలు అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకే తాజాగా జియో ట్యాగింగ్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. -
ఆ భూములు హెచ్ఎండీఏవే..
సాక్షి, హైదరాబాద్: సకల సౌకర్యాలతో భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ‘బాహుబాలి లే–అవుట్’గా తీర్చిదిద్దుతున్న కోకాపేట భూములపై ఉన్నత న్యాయస్థానంలో ఉన్న స్టేటస్ కో అడ్డంకులు తొలగిపోయాయి. గత 8 నెలలుగా న్యాయపోరాటం చేసిన హెచ్ఎండీఏ వాదనలతో హైకోర్టు ఏకీభవించడంతో పాటు కోర్టును తప్పుదోవ పట్టించిన ఆరుగురు పిటిషన్‌దారులకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని పేర్కొంటూ..రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చే ఈ లే–అవుట్ పనులు చకచకా జరిగే అవకాశముంది. 195.47 ఎకరాల్లో ప్లాట్లు చేసి విక్రయించడం ద్వారా రూ.5,850 కోట్ల ఆదాయం వస్తుందని గతంలో అధికారులు అంచనా వేసినా.. ఇప్పుడు ఆ స్థాయిలో ఆదాయం సమకూరుతుందా..అనే యోచనలో ఉన్నారు. కరోనా ప్రభావం కోకాపేట భూముల విక్రయాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశముందని, దీంతో మరికొన్ని నెలల తర్వాతనే ఆన్లైన్ వేలంపై ముందుకు వెళ్లే అవకాశాలున్నాయనే వాదనలు కూడా వినబడుతున్నాయి. 8 నెలలుగా న్యాయపోరాటం... తమ ఫిజికల్ పొజిషన్లో ఉన్న కోకాపేట సర్వే నంబర్ 239, 240లలోని 87.68 ఎకరాల భూమి లో హెచ్ఎండీఏ అధికారులు వచ్చి లే– అవుట్ అభివృద్ధి చేస్తున్నారంటూ ముక్తజాతో పాటు మరో ఐదుగురు హైకోర్టులో గతేడాది అక్టోబర్ 8న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ భూమి తమ పేరు మీద ఉందంటూ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా జత చేయడంతో కోర్టు అదే నెలలో స్టేటస్ కో విధించింది. ఈ భూముల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్, ఎస్టేట్ విభాగ ఉన్నతాధికారి గంగాధర్ వాటికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి హైకోర్టుకు సమర్పించారు. 2017లో సుప్రీం కోర్టులో తీర్పు వచ్చే ముందు అంటే 2009–10లో ఇదే కోకాపేట భూములపై వేసిన రిట్ పిటిషన్లో ఇప్పటి పిటిషన్‌దారులు అందరూ ఇంప్లీడ్ అయి ఉన్నారని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు అంతకుముందు విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తేయడంతో పాటు రిట్ పిటిషన్‌ను కొట్టేసింది. కోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషన్‌దారులకు జైలు శిక్ష విధించాలని హెచ్ఎండీఏ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గిరి వాదించారు. పిటిషన్‌దారులు వృద్ధులు కావడంతో రూ.లక్ష చొప్పున జరి మానా విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. -
ప్రభుత్వ భూములపై దృష్టి సారించిన యంత్రాంగం
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ప్రభుత్వ భూములెన్ని.. వివిధ అవసరాల నిమిత్తం ఎంత అసైన్డ్ చేశారు.. ప్రస్తుతం ఉన్నదెంత.. లేకపోతే ఎటుపోయింది.. లెక్క తేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వ భూముల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరడంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా హైదరాబాద్ శివారులో గల మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వీటితో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆక్రమణకు గురయ్యాయి. దీంతో లెక్కలు తేల్చేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వెంచర్లుగా మారిన ప్రభుత్వ భూములు వ్యవసాయం, గృహ, సామూహిక ప్రజా అవసరాలు, ప్రభుత్వ అవసరాలకోసం ప్రభుత్వ భూములను అసైన్ చేశారు. ఇందులో వ్యవ సాయ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవడమే కాకుండా క్రయవిక్రయాలు జరిగాయి. జిల్లాలో వైటీడీఏ, బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల కోసం పెద్ద ఎత్తున భూసేకరణ జరుగుతోంది. పునరావాసం కింద బాధితులకు తిరిగి ప్రభుత్వం భూములను ఇవ్వాల్సి ఉంది. మరో వైపు ఇప్పటికే అసైన్ చేసిన భూములు కొన్ని క్రయవిక్రయాలు జరిగాయి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. రియల్ఎస్టేట్ వ్యాపారం ముసుగులో భారీగా ప్రభుత్వ అసెన్ భూములు కొల్లగొట్టారు. ఆక్రమణలను అడ్డగించేవారు లేకపోవడంతో కోట్లాది రూపాయల విలువగల భూములను రియల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేసి విక్రయించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో గల ప్రభుత్వ అసైన్డ్ భూములను రియల్టర్లు కబ్జా చేసి ఓపెన్ప్లాట్ల వ్యాపారం చేశారు. నిరోధించాల్సిన యంత్రాంగ చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమాలు యథేచ్ఛగా జరిగిపోయాయి. ప్రభుత్వం గతంలో భూముల లెక్కలు తేల్చడానికి సర్వే చేపడితే వందకోట్ల రూపాయలు విలువ చేసే భూములు కబ్జా, ,క్రయవిక్రయాలు జరిగినట్లు తేలింది. క్షేత్రస్థాయిలో సరైన రక్షణ లేకపోవడంతో జిల్లాలోని 17 మండలాల్లో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేసి అందినకాడికి ఆక్రమించి అమ్ముకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.100కోట్లకు పైగా విలువ చేసే 3,370 ఎకరాల భూములను ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. రూ.కోట్లల్లో డిమాండ్ హెచ్ఎండీఏ, మూసీ పరివాహక ప్రాంతం, యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి రెండు జాతీయ రహదారులు ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎకరం భూమి ధర రూ.కోట్లకు చేరింది. చౌటుప్పల్ డివిజన్లో పరిధిలో 33.608, భువనగిరి డివిజన్లో 49.604 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చౌటుప్పల్ డివిజన్లో 14,140.32 ఎకరాల భూమిని, భువనగిరి డివిజన్లో 23693 ఎకరాల భూమిని రైతులకు అసైన్డ్ చేశారు. సగానికి పైనే అన్యాక్రాంతం ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములు సగానికి పైగా అన్యాక్రాంతమయ్యాయి. ఆభూముల పక్కనే గల భూములను కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించారు. గతంలో నిర్వహించిన ప్రభుత్వ భూముల సర్వేలో భూ ఆక్రమణలు బయటపడ్డాయి. ఈమేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపారు. రాజకీయ వత్తిడులు, కొందరు ఉన్నతాధికారులప్రమేయంతో ఖబ్జాభూములపై నివేదికలన ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కేసులు నమోదు అసైన్ చేసిన భూ ముల క్రయవిక్రయాలు జరిగితే పీఓటీ కేసులు నమోదు చేస్తాం. అలాగే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం హైదరాబాద్ శివారులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తోంది. ప్రభుత్వం లెక్కలు తీస్తున్న జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా లేదు. ఇక్కడ బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వ భూములు అవసరం ఉన్నాయి. –రమేశ్, జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ భూముల వివరాలు ఎకరాల్లో మండలం మొత్తం ఏరియా వ్యవసాయానికి కేటాయింపు ఆలేరు 3794.08 1457.22 ఆత్మకూరు 8512.05 4302.09 భువనగిరి 8450.05 3341.19 బీబీనగర్ 5544.21 1884.07 బి.రామారం 6698.16 1831.06 మోత్కూర్ 8997.10 4426.23 రాజాపేట 4358.17 2346.34 తుర్కపల్లి 10920.03 4078.29 యాదగిరిగుట్ట 4618.22 1938.24 చౌటుప్పల్ 8057.33 2748.14 పోచంపల్లి 6707.15 5767.74 గుండాల 6094.06 2492.07 రామన్నపేట 7561.02 2830.26 వలిగొండ 7351.345 3218.03 మొత్తం 97665.18 39664.08 -
వేలానికి వేళాయే!
* ఆ జాబితాలో 3,500 ఎకరాలు హెచ్ఎండీఏ భూములు? * రూ.6,500 కోట్ల సమీకరణకు సర్కార్ యోచన * నగర శివార్లలో ‘రియల్’కు పూర్వ వైభవం సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరానికి సమీపంలోని ప్రభుత్వ భూముల విక్రయానికి రంగం సిద్ధమవుతోంది. వివిధ విభాగాల వద్ద నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల లెక్కతేల్చిన సర్కార్... వాటిని విక్రయించడం ద్వారా సమకూరే నిధులతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలనుకుంటోంది. వివిధ ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూములు దీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్నట్లయితే వాటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం...భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఆదేశాలిచ్చిన విషయం విదితమే. వీటి అమ్మకం ద్వారా రూ.6,500 కోట్లు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల బడ్జెట్లోనూ ఈ అంశాన్ని పెట్టింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూముల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూర్చుకోవడమే గాక... అక్కడ వివిధ సంస్థల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్న ద్విముఖ వ్యూహంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ భూముల వివరాలను ఇటీవల తెప్పించుకొంది. వీటిలో సింహభాగం హెచ్ఎండీఏకు చెందిన 3,500 ఎకరాలు... -
హెచ్‌ఎంఢీఏ
ఈ నెల 28న సుప్రీం బెంచ్‌కు కోకాపేట వివాదం తీర్పు అనుకూలంగా లేకుంటే భారీ మూల్యం హెచ్ఎండీఏ అధికారుల్లో ఆందోళన సుప్రీంలో వాదనలకు సిద్ధం సాక్షి, సిటీబ్యూరో: సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అనుకూలంగా వస్తే రూ.1500 కోట్లు ఆదాయం... ప్రతికూలంగా వస్తే రూ. 1000 కోట్లు భారం...ఇదీ హెచ్ఎండీఏ పరిస్థితి. కోకాపేట భూముల వ్యవహారం కేసు ఈ నెల 28న బెంచ్‌పైకి వస్తుండడంతో హెచ్ఎండీఏ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన హెచ్ఎండీఏకు ఈ వివాదం జీవన్మరణ సమస్యగా మారింది. దీనిపై బలంగా వాదనలు వినిపించేందుకు అధికారులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. కోకాపేట భూములన్నీ ప్రభుత్వానివేనని, ఆ విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదని ఇప్పటికే సుప్రీం కోర్టుకు నివేదించారు. యాజమాన్యపు హక్కుల విషయంలో వివాదం లేదని, బహిరంగ వేలంలో ఈ భూములను కొనుగోలు చేసిన సంస్థలకు రిజిస్ట్రేషన్‌కు తాము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ఆ సంస్థలు ముందుకు రావట్లేదని సుప్రీంకోర్టుకు హెచ్ఎండీఏ విన్నవించింది. వేలంలో భూములు కొన్న సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని గతంలోహైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని నివేదిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో హెచ్ఎండీఏ కౌంటర్లు దాఖలు చేసింది. వీటికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర అడ్వొకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీం న్యాయవాదులతో కలసి హెచ్ఎండీఏ వాదనను బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో విజయం సాధించేందుకు అధికారులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే రూ.687 కోట్లు వడ్డీతో సహా సుమారు రూ.1000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనుకూలంగా వస్తే సుమారు రూ.1500 కోట్ల ఆదాయం వస్తుంది. వివాదం ఇలా... రాష్ట్ర ప్రభుత్వం నిధుల సేకరణలో భాగంగా 617 ఎకరాల భూమిని గతంలో హెచ్ఎండీఏకు ఇచ్చింది. 2007లో ఈ భూములకు వేలం నిర్వహించిన హెచ్ఎండీఏ వివిధ సంస్థలకు విక్రయించింది. ప్రధానంగా గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు 100 ఎకరాలు, ఎంపైర్-1, 2లకు 87 ఎకరాలు మొత్తం 187 ఎకరాల భూమిని వేలంలో విక్రయించింది. అప్పట్లో రియల్ బూమ్ కారణంగా ఎకరా రూ.4.5 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు ధర పలికింది. వీటి విక్రయం ద్వారా మొత్తం రూ.1755 కోట్లు ఆదాయం వస్తున్నట్లు అప్పట్లో లెక్కతేలింది. వేలం పాటలో ఈ భూములు దక్కించుకున్న 15 సంస్థలు రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించాయి. వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది. ఆ తర్వాత రియల్ బూమ్ పడిపోవడంతో భూములకు డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూములు కొనుగోలు చేసిన వాటిలో 14 సంస్థలు తాము వేలంపాటలో దక్కించుకున్న భూములకు సంబంధించి యాజమాన్యపు హక్కుల వివాదం ఉందని, తమకు చెప్పుకుండా హెచ్ఎండీఏ దాచి పెట్టిందనే సాకుతో తమ సొమ్మును తిరిగి చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించాయి. వాదోపవాదాల అనంతరం కోకాపేట భూములు వివాదంలో ఉన్న విషయం తెలియజేయకుండా వేలం వేయడాన్ని తప్పుబడుతూ ఆయా సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాలని సింగిల్ జడ్జి 2010లో తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ఎదుట అప్పీళ్లు దాఖలు చేసింది హెఎండీఏ. ఈ కేసును లోతుగా పరిశీలించిన ధర్మాసనం గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ తీర్పు నిచ్చింది. దీంతో హెచ్ఎండీఏ మిగిలిన మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హడావుడిగా ఆ సంస్థలకు నోటీసులిచ్చింది. ఇందుకు ససేమిరా అంటూ అవి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ దీనిపై తిరిగి ఉత్తర్వులిచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హెచ్ఎండీఏని సుప్రీం ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చే సింది. ఈ కేసు జులై 4, 2014న చీఫ్ జస్టిస్ బెంచ్‌పైకి రాగా, ఇందులో మొత్తం 11 కేసులున్నాయని, వీటన్నిటిని క్లబ్ చేస్తూ 3 నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కోకాపేట భూముల కేసు ఈ నెల 28న బెంచ్‌పైకి రానుండటంతో హెచ్ఎండీఏలో కలవరం మొదలైంది. టైటిల్ వ్యవహారంలోనూ... కోకాపేటలో 1650 ఎకరాల భూమి మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదని, వారి ప్రతినిధిని తానంటూ గతంలో కె.ఎస్.బి.అలీ కోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనల అనంతరం ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ 2012 జులైలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌చేస్తూ కె.ఎస్.బి.అలీ సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ ఫైల్ చేశారు. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు ఆ భూమి విషయంలో యథాతథ స్థితిని (స్టాటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలోనూ హెచ్ఎండీఏ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో పాటు వెకేషన్ పిటిషన్ కూడా వేసింది. ఈ కేసు వచ్చేనెల 26న బెంచ్‌పైకి వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. -
సీఎం మిత్రునికి అక్రమంగా భూమి కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏకి చెందిన విలువైన భూములను అధికార యంత్రాంగం సీఎం కిరణ్ ఒత్తిడికి తలొగ్గి ఆయన మిత్రుడు అమరేందర్‌రెడ్డికి కారుచౌకగా కట్టబెట్టిందని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ మేరకు జేఏసీ కోకన్వీనర్ శ్రీరంగారావు నేతృత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. నందగిరిహిల్స్‌లో 4 ఎకరాల ఆరు గుంటల విలువైన భూమిని రూ.84.74 కోట్లకే అమరేందర్‌రెడ్డికి కట్టబెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చేందుకు బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు కోరారు.