హెచ్‌ఎంఢీఏ | On the 28th of this month, the Supreme bench of the dispute kokapeta | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎంఢీఏ

Published Mon, Oct 20 2014 12:17 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

హెచ్‌ఎంఢీఏ - Sakshi

హెచ్‌ఎంఢీఏ

  • ఈ నెల 28న సుప్రీం బెంచ్‌కు కోకాపేట వివాదం
  •  తీర్పు అనుకూలంగా లేకుంటే భారీ మూల్యం
  •  హెచ్‌ఎండీఏ అధికారుల్లో ఆందోళన
  •  సుప్రీంలో వాదనలకు సిద్ధం
  • సాక్షి, సిటీబ్యూరో:  సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అనుకూలంగా వస్తే రూ.1500 కోట్లు ఆదాయం... ప్రతికూలంగా వస్తే రూ. 1000 కోట్లు భారం...ఇదీ హెచ్‌ఎండీఏ పరిస్థితి. కోకాపేట భూముల వ్యవహారం కేసు ఈ నెల 28న బెంచ్‌పైకి వస్తుండడంతో హెచ్‌ఎండీఏ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన హెచ్‌ఎండీఏకు ఈ వివాదం జీవన్మరణ సమస్యగా మారింది.  దీనిపై బలంగా వాదనలు వినిపించేందుకు అధికారులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

    కోకాపేట భూములన్నీ ప్రభుత్వానివేనని, ఆ విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదని ఇప్పటికే సుప్రీం కోర్టుకు నివేదించారు. యాజమాన్యపు హక్కుల విషయంలో వివాదం లేదని, బహిరంగ వేలంలో ఈ భూములను కొనుగోలు చేసిన సంస్థలకు రిజిస్ట్రేషన్‌కు తాము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ఆ సంస్థలు ముందుకు రావట్లేదని సుప్రీంకోర్టుకు హెచ్‌ఎండీఏ విన్నవించింది.

    వేలంలో భూములు కొన్న సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని గతంలోహైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని నివేదిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో హెచ్‌ఎండీఏ కౌంటర్లు దాఖలు చేసింది. వీటికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర అడ్వొకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీం న్యాయవాదులతో కలసి హెచ్‌ఎండీఏ వాదనను బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో విజయం సాధించేందుకు అధికారులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే రూ.687 కోట్లు వడ్డీతో సహా సుమారు రూ.1000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనుకూలంగా వస్తే సుమారు రూ.1500 కోట్ల ఆదాయం వస్తుంది.
     
    వివాదం ఇలా...

    రాష్ట్ర ప్రభుత్వం నిధుల సేకరణలో భాగంగా 617 ఎకరాల భూమిని గతంలో హెచ్‌ఎండీఏకు ఇచ్చింది. 2007లో ఈ భూములకు వేలం నిర్వహించిన హెచ్‌ఎండీఏ వివిధ సంస్థలకు విక్రయించింది. ప్రధానంగా గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు 100 ఎకరాలు, ఎంపైర్-1, 2లకు 87 ఎకరాలు మొత్తం 187 ఎకరాల భూమిని వేలంలో విక్రయించింది. అప్పట్లో రియల్ బూమ్ కారణంగా ఎకరా రూ.4.5 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు ధర పలికింది. వీటి విక్రయం ద్వారా మొత్తం రూ.1755 కోట్లు ఆదాయం వస్తున్నట్లు అప్పట్లో లెక్కతేలింది.

    వేలం పాటలో ఈ భూములు దక్కించుకున్న 15 సంస్థలు రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించాయి. వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది. ఆ తర్వాత రియల్ బూమ్ పడిపోవడంతో భూములకు డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూములు కొనుగోలు చేసిన వాటిలో 14 సంస్థలు తాము వేలంపాటలో దక్కించుకున్న  భూములకు సంబంధించి యాజమాన్యపు హక్కుల వివాదం ఉందని, తమకు చెప్పుకుండా హెచ్‌ఎండీఏ దాచి పెట్టిందనే సాకుతో తమ సొమ్మును తిరిగి చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించాయి.

    వాదోపవాదాల అనంతరం కోకాపేట భూములు వివాదంలో ఉన్న విషయం తెలియజేయకుండా వేలం వేయడాన్ని తప్పుబడుతూ ఆయా సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాలని సింగిల్ జడ్జి 2010లో తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ఎదుట అప్పీళ్లు దాఖలు చేసింది హెఎండీఏ. ఈ కేసును లోతుగా పరిశీలించిన ధర్మాసనం గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ తీర్పు నిచ్చింది. దీంతో హెచ్‌ఎండీఏ మిగిలిన మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హడావుడిగా ఆ సంస్థలకు నోటీసులిచ్చింది.

    ఇందుకు ససేమిరా అంటూ అవి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ దీనిపై తిరిగి ఉత్తర్వులిచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హెచ్‌ఎండీఏని సుప్రీం  ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చే సింది. ఈ కేసు జులై 4, 2014న చీఫ్ జస్టిస్ బెంచ్‌పైకి రాగా, ఇందులో మొత్తం 11 కేసులున్నాయని, వీటన్నిటిని క్లబ్ చేస్తూ 3 నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కోకాపేట భూముల కేసు ఈ నెల 28న బెంచ్‌పైకి రానుండటంతో హెచ్‌ఎండీఏలో  కలవరం మొదలైంది.
     
    టైటిల్ వ్యవహారంలోనూ...

    కోకాపేటలో 1650 ఎకరాల భూమి మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదని, వారి ప్రతినిధిని తానంటూ గతంలో కె.ఎస్.బి.అలీ కోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనల అనంతరం ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ 2012 జులైలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

    ఈ తీర్పును సవాల్‌చేస్తూ  కె.ఎస్.బి.అలీ సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ ఫైల్ చేశారు. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు ఆ భూమి విషయంలో యథాతథ స్థితిని (స్టాటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలోనూ హెచ్‌ఎండీఏ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో పాటు వెకేషన్ పిటిషన్ కూడా వేసింది. ఈ కేసు వచ్చేనెల 26న బెంచ్‌పైకి వచ్చే అవకాశం ఉందని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement