
ఎన్‌పీడీసీఎల్‌లో ‘జియో ట్యాగింగ్’ ప్రయోగం
ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో జూన్ నుంచి అమలయ్యేలా చర్యలు
దాదాపుగా పూర్తయిన నంబరింగ్.. యుద్ధ ప్రాతిపదికన మ్యాపింగ్ పనులు
సాక్షిప్రతినిధి, వరంగల్: సాంకేతిక సమస్యలను క్షణాల్లో అధిగమించి..నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేసేందుకు తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్‌పీడీసీఎల్) జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇందుకోసం ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామా బాద్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో చేపట్టిన విద్యుత్ ఫీడర్‌లు, సబ్‌స్టేషన్‌లు, విద్యుత్ స్తంభాల నంబర్లు, మ్యాపింగ్ ప్రక్రియ తుది దశకు చేరింది. విద్యుత్ స్తంభాలకు జియో ట్యాగింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక రంగులతో నంబర్లు వేస్తున్నారు.
33 కేవీ స్తంభానికి పసుపు రంగు, 11 కేవీ స్తంభానికి నలుపు రంగుతో ఈ నంబర్లు ఇస్తున్నారు. ఇది పూర్తయ్యాక జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేస్తారు. ఈ ప్రక్రియ జూన్‌లో ప్రారంభిస్తామని ఆ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో ఐదు లక్షలకు పైగా విద్యుత్‌స్తంభాలకు జియో ట్యాగింగ్ పూర్తి దశకు చేరినట్టు అధికారవర్గాల సమాచారం. స్తంభాలకు ఇస్తున్న నంబరింగ్ పూర్తయ్యాక జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేస్తారు.
జియో ట్యాగింగ్‌తో ఇవీ ప్రయోజనాలు
విద్యుత్ ఉత్పత్తి నుంచి వినియోగం వరకు చాలా రకాల సమస్యలు ఉంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు, వర్షాలు కురిసినప్పుడు అంతరాయాలు ఎదురవుతాయి. ప్రకృతి విపత్తులో కరెంట్ అంతరాయం, ప్రమాదాలు జరిగినప్పు డు, గాలి దుమారానికి, పిడుగు పడినప్పుడు కరెంట్ స్తంభాలు విరగడం, విద్యుత్ వైర్లు తెగిపోవడం, ఫ్యూజులు పోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో గంటలపాటు కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. విద్యుత్ అంతరాయానికి కారణం ఏంటి.. సమస్య ఎక్కడొచ్చింది? అన్నది తెలుసుకోవడం సిబ్బందికి తలనొప్పి వ్యవహారమే.
సాధారణంగా ఒకలైన్‌లో విద్యుత్ అంతరాయం వస్తే దాని పరిధిలోని మిగతా లైన్లకు కరెంట్ సరఫరా నిలిపివేస్తారు. కానీ జియో ట్యాగింగ్ చేస్తే సమస్య ఉన్న లైన్‌కు మాత్రం కరెంట్ సరఫరా ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు.
జియో ట్యాగింగ్ ద్వారా విద్యుత్ అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్‌లకు మెస్సేజ్‌ల ద్వారా సమాచారం వస్తుంది. దీంతో విద్యుత్ లైన్‌లలో ఎక్కడ సమస్య తలెత్తిన ఆ ప్రాంతాన్ని సులువుగా గుర్తించి పరిష్కరించొచ్చని అధికారులు చెప్పారు.
జూన్ మాసాంతం వరకు పూర్తి
పోల్ నంబరింగ్, మ్యాపింగ్ ప్రక్రియ జూన్‌కు పూర్తవుతుంది. యాసంగి పంటలు చేతికి రాగానే మిగిలిపోయిన స్తంభా లకు నంబరింగ్, జియో ట్యాగింగ్ పూర్తి చేస్తాం. జియో ట్యాగింగ్ (మ్యాపింగ్) ద్వారా రైతులు, విద్యుత్ వినియోగ దారులకు సరఫరాలో ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ అధికారులకు, సిబ్బందికి పోల్‌పై నంబర్‌తో సహా సమాచారం అందిస్తే సిబ్బంది మ్యాపింగ్ ద్వారా సులువుగా, త్వరగా చేరుకుంటారు.
సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుంది. కొత్త లైన్లు వేయాల్సి వస్తే సులభంగా ప్రణాళిక రూపొందించొచ్చు. సత్వర సేవలకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతోంది. – కర్నాటి వరుణ్‌రెడ్డి, సీఎండీ,టీజీఎన్పీడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment