సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల్లోని డైరెక్టర్లను ప్రభుత్వం తొలగించింది. వారి తొలగింపు తక్షణమే అమలులోకి వస్తుందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్ రిజ్వీ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు 2012లో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిస్కమ్‌ల సీఎండీలను ఆయన ఆదేశించారు.
దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 11 డైరెక్టర్లు కొనసాగుతున్నారు. ఈ 11 మందిలో కేవలం ఇద్దరు డైరెక్టర్లు టి.శ్రీనివాస్ (డైరెక్టర్, ప్రాజెక్ట్స్), టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ వెంకటేశ్వరరావు (డైరెక్టర్ హెచ్‌ఆర్) మాత్రమే 2013లో నిబంధనలకు అనుగుణంగా డైరెక్టర్లుగా నియామకమయ్యారని పేర్కొన్నారు. మిగిలిన తొమ్మిదిమంది డైరెక్టర్లు ఆరేళ్ల క్రితం ఎలాంటి నిబంధనలు పాటించకుండా నియామకమయ్యారని ఆ ఉత్తర్వుల్లో రిజ్వీ స్పష్టం చేశారు.
తొలగించిన ఆ 11మంది ఎవరెవరంటే..
సోమవారం తొలగించిన 11 మంది డైరెక్టర్లలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలోని జె, శ్రీనివాస్‌రెడ్డి(ఆపరేషన్స్), శ్రీనివాస్(ప్రాజెక్ట్స్), కె.రాములు(కమర్షియల్, ఎనర్జీ ఆడిట్), జీ. పార్వతం(హెచ్‌ఆర్), సీహెచ్ మదన్‌మోహన్‌రావు(ప్రణాళిక, నిర్వహణ), ఎస్,స్వామిరెడ్డి(ఐపీసీ అండ్ ఆర్‌ఏసీ), గంపా గోపాల్(ఎనర్జీ ఆడిట్).. కాగా ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో బి. వెంకటేశ్వరరావు (హెచ్‌ఆర్), పి.మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్), పి. సంధ్యారాణి (కమర్షియల్), పి. గణపతి(ఐపీసీ అండ్ ఆర్‌ఏసీ) ఉన్నారు.
కొత్త డైరెక్టర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ.. ఇంటర్వ్యూలు
అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త డైరెక్టర్లను నియమించనున్నట్లు సమాచారం, ఇప్పటికే జెన్‌కో, ట్రాన్స్‌కోలో డైరెక్టర్లకు ప్రభుత్వం ఉద్వాసన పలికిన విషయం విదితమే. ఇప్పుడు పంపిణీ సంస్థల డైరెక్టర్లకు కూడా ఉద్వాసన పలకడం ద్వారా విద్యుత్ సంస్థలను పూర్తిగా ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేసినట్లయింది. ఏళ్ల తరబడి డైరెక్టర్లుగా వాళ్లే కొనసాగడం వల్ల విద్యుత్ సంస్థల్లో పురోగతి లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నప్పటికీ.. నష్టాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై వాళ్లు దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా రూ.వేల కోట్లలో నష్టాలు పేరుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలున్నాయి, కాగా, వచ్చేనెలలో ఈ డైరెక్టర్ల పోస్టుల భర్తీ పూర్తి చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment